నీలగిరి, ఏప్రిల్ 20 : నల్లగొండ పట్టణంలోని అపర్ణ దవాఖాన వద్ద బుధవారం రెండు గంటల పాటు హైడ్రామా సాగింది. నకిలీ పత్రాలతో ఆసుపత్రి నిర్వహిస్తున్నారని, నోటీసులు ఇచ్చిన సరైన సమాధానం ఇవ్వడం లేదని ఉన్నతాధికారుల ఆదేశాలతో దవాఖాన సీజ్ చేయడానికి డెమో (డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ మాస్ మీడియా ఆఫీసర్) రవిశంకర్ ఆధ్వర్యంలో వైద్యారోగ్యశాఖ అధికారులు వచ్చారు. దాంతోయాజమాన్యం, సిబ్బంది అధికారులను అడ్డుకున్నారు. తమకు కోర్టు అనుమతులు ఉన్నాయని వాటిని ఎలా ధిక్కారిస్తారని యాజమాన్యం పేర్కొంది. ఈనెల 13న హైకోర్టు ఇచ్చిన తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని, ఆస్పత్రి యాజమాన్యం, ఆ ఆదేశాలు తమకు అందలేదని డెమో వాదోపవాదానికి దిగారు.
అనంతరం హైకోర్టు పీపీతో డెమో రవిశంకర్ ఫోన్లో మాట్లాడి ఆస్పత్రి సీజ్ చేయడం లేదని, స్కానింగ్‌లు మాత్రం తీయ వద్దని వెళ్లి పోయారు. ఈ సందర్భంగా డెమో రవిశంకర్ మాట్లాడుతూ దవాఖాన రేడియాలజిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అపర్ణ నకిలీ విద్యార్హత పత్రాలు సమర్పించి అనుమతులు పొందారని తిరిగి సర్టిఫికెట్లు సమర్పించాలని వైద్యారోగ్యశాఖ రెండు దఫాలుగా నోటీసులు జారీ చేసినా దవాఖాన యాజమాన్యం నోటీసులకు సరైనా పత్రాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇతర దేశాల్లో చదివిన పత్రాలతో దవాఖాన నిర్వహిస్తున్నారని ఇండియన్ మెడికల్ కౌన్సిల్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో అనుమతుల లేవని చెప్పారు.
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు దవాఖాన నిర్వహిస్తున్నామని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మూల హుస్సేన్‌రెడ్డి తెలిపారు. పీసీపీఎన్డీ యాక్ట్ ప్రకారం వారు ఇచ్చిన అనుమతుల మేరకే ఎండీ బోర్డు పెట్టామని పేర్కొన్నారు.