సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఓ విద్యార్థి వెయిట్ లిఫ్టింగ్‌లో జాతీయస్థాయిలో ప్రతిభ చాటుతున్నాడు. చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి, ఆత్మవిశ్వాసంతో ఎన్నో పతకాలు సొంతం చేసుకున్నాడు. చిలుకూరు మండల కేంద్రానికి చెందిన యడవల్లి యశ్వంత్‌గౌడ్ జాతీయస్థాయిలో ప్రతిభ చూపుతున్నాడు. యశ్వంత్‌గౌడ్ హైదరాబాద్‌లోని హకీంపేటలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
చిలుకూరు గ్రామానికి చెందిన యడవల్లి యశ్వంత్గౌడ్కు చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి ఉండేది. తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడవ్వడంతో 2013లో హకీంపేట క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో అడ్మిషన్ దక్కించుకున్నాడు. చదువుతో పాటు క్రీడలపై ఆసక్తితో వెయిట్ లిఫ్టింగ్‌పై కోచ్‌లు మాణిక్యరావు, ఎస్ఎం సింగ్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.
2015లో హైదరాబాద్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో 50కిలోల విభాగంలో 3వ స్థానంలో నిలిచి బ్రౌంజ్ మెడల్ సాధించాడు. అప్పటి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణిస్తూ పలు పతకాలు కైవసం చేసుకున్నాడు. 2017లో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో గోల్డ్ మెడల్ దక్కించుకుని జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. గతేడాది ఫిబ్రవరిలో తెలంగాణ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 96 కిలోల విభాగంలో మొదటిస్థానంలో నిలిచాడు. అసోంలో నిర్వహంచిన జాతీయ స్పోర్ట్స్ మీట్లో ద్వితీయ స్థానం సాధించాడు. 2021 డిసెంబర్లో జరిగిన ఖేల్ ఇండియా పోటీలకు ఎంపికయ్యాడు.
చిన్నప్పటి నుంచి క్రీడలపై ఉన్న ఆసక్తితో వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. 96 కిలోల విభాగంలో ఎన్నో పతకాలను సాధించాను. భువనేశ్వర్‌లో జరిగే నేషనల్ వెయిట్ లిప్టింగ్ పోటీలకు రాష్ట్రం తరఫున ఎంపికయ్యాను. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరిన్ని పతకాలను సాధిస్తాను.
– యడవల్లి యశ్వంత్‌గౌడ్