నీలగిరి, ఏప్రిల్ 16 : రాష్ర్టాన్ని ప్రధానంగా దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చేలా కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులు స్వాధీనం చేసుకుంటూ కేంద్ర జలవనరుల శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని పలువురు మేధావులు డిమాండ్ చేశారు. గెజిట్‌కు వ్యతిరేకంగా నల్లగొండలో ఒకరోజు నిరసన దీక్ష చేయాలని రౌండ్‌టేబుల్ సమావేశంలో తీర్మానించారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో అఖిలపక్ష, ప్రజా సంఘాలతో స్థానిక లయన్స్ క్లబ్ భవన్లో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్, ప్రముఖ పాత్రికేయులు, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం, ఏపీ పబ్లిక్ పాలసీ సలహాదారులు కె.రామచంద్రమూర్తి, విశ్రాంత ఇంజినీర్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్యాం ప్రసాద్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు కె.శ్రీనివాస్‌రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వీరారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు నెల్లూరి దుర్గాప్రసాద్, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రవణ్‌కుమార్, తెలంగాణ జేఏసీ జిల్లా కన్వీనర్ జి.వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకులు బాణోత్ రమణానాయక్తో పాటు పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ తన ఆధీనంలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం చేతిలో చిన్న తరహా ప్రాజెక్టులు మాత్రమే ఉండేలా కేంద్రం గెజిట్‌ను విడుదల చేసిందన్నారు. దీంతో దక్షిణ తెలంగాణతో పాటు ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలు ఎడారిగా మారనున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఏర్పాటు సందర్భంగా నది జలాల సమస్య పరిష్కరించకుండా ప్రాజెక్టులన్నింటిని కేంద్రం ఆధీనంలోకి తీసుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పనులు ఆపాలనే కుట్ర గెజిట్ నోటిఫికేషన్లో ఉందని విమర్శించారు. గెజిట్ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా బలమైన ప్రజాపోరాటాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
దీనికి జిల్లా ప్రజలను చైతన్యం చేయడానికి సంఘాలు, రాజకీయ పార్టీలు ముందుకు రావాలన్నారు. పోరాటాల ఖిల్లాగా పేరొందిన నల్లగొండ నుంచే గెజిట్‌కు వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. సమావేశంలో పలు సంఘాలు, పార్టీల నాయకులు తుమ్మల మధుసూదన్‌రెడ్డి, రణధీర్‌రెడ్డి, అంబటి నాగయ్య, సైదులు, పన్నాల గోపాల్‌రెడ్డి, సులోచన, గుర్వయ్య, అంజిరెడ్డి, లెక్చరర్ మోహన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.