యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఛేదిస్తూ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం మేరకు
ఉమ్మడి జిల్లా అంతటా కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం కొనుగోళ్లపై మంత్రి జగదీశ్‌రెడ్డి ఉమ్మడి జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి కార్యాచరణను ప్రకటించారు. గురువారం అందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. కేంద్రాల గుర్తింపు, నిర్వాహకులకు శిక్షణ, హమాలీల నియామకం, గన్నీ బ్యాగుల సేకరణ, కాంటాల సరఫరా, ట్రాన్స్‌పోర్టు వాహనాలు, మిల్లుల్లో దిగుమతులకు ఏర్పాట్లు తదితర అంశాలపై కసరత్తు ప్రారంభించింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యం జిల్లాలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లో చెక్‌పోస్టులను గురువారం నుంచే అందుబాటులోకి తెచ్చారు. నల్లగొండ పట్టణ పరిధి ఆర్జాలబావి, మిర్యాలగూడ మండలం అవంతీపురంలో శుక్రవారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్14(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష అనంతరం ఏర్పాట్లకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. యాసంగిలో సన్నం, దొడ్డు అన్న తేడా లేకుండా ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
దాంతో ఏర్పాట్లల్లో అధికారులు తలమునకలయ్యారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 934 కొనుగోలు కేంద్రాల ద్వారా 14.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తున్నదని అధికారులు అం చనా వేస్తున్నారు. కాగా, నల్లగొండ మండలం ఆర్జాలబావి వద్ద ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, కలెక్టర్ పీజే పాటిల్, మిర్యాలగూడ మండలం అవంతీపురంలో ఎమ్మెల్యే భాస్కర్‌రావు శుక్రవారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈనేపథ్యంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ గురువారం తన చాంబర్లో రవాణా, కాంట్రాక్టర్లు, లారీ ఓనర్స్ అసోసియేషన్ల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. డీఎస్ఓ వి.వెంకటేశ్వర్లు, డీఎం నాగేశ్వర్రావు, జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
గతంలో కేటాయించిన కేంద్రాలనే తిరిగి కాంట్రాక్టర్లకు కేటాయించనున్నట్లు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ మేరకు రవాణాలో ఇబ్బందుల్లేకుండా వాహనాలు సమకూర్చాలని ఆదేశించారు. ఎక్కడైనా అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తర్వాత జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతోనూ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మిల్లులకు వచ్చే ధాన్యాన్ని వెంటనే దిగుమతులు చేసుకుని సహకరించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో సర్టిఫై చేశాకే ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తామని, అక్కడికి వచ్చాక దిగుమతులకు నిరాకరిస్తే చర్యలు తప్పవన్నారు. ఇక నల్లగొండ జిల్లాకు సంబంధించి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శుక్రవారం ప్రత్యేకంగా శిక్షణ ఏర్పాటు చేశారు.
కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో డీపీసీ ఇన్చార్జి కొనుగోళ్ల విషయంలో ఎలా వ్యవహరించాలని, వచ్చే ఇబ్బందులను ఎలా అధిగమించాలి వంటి అంశాలపై ప్రభుత్వ విధానాలను స్పష్టం చేయనున్నారు. సూర్యాపేట జిల్లాలోనూ ధాన్యం కొనుగోళ్లపై క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. వివిధ శాఖల వారీగా సమీక్షలు చేస్తూ గుర్తించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎక్కడికక్కడ వెంటవెంటనే ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేశారు.
ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర రూ.1960 కచ్చితంగా అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా సమీక్షలో అధికారులకు స్పష్టం చేస్తూ ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. దాంతో మర్నాడే సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని రామాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద, నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.మఠంపల్లి వద్ద కృష్ణానది బ్రిడ్జి, నాగార్జునసాగర్ కొత్త బ్రిడ్జి వద్ద చెక్‌పోస్టు ద్వారా తనిఖీలకు ఆదేశించారు. గతంలో కూడా చెక్‌పోస్టుల ద్వారా ఆంధ్రా నుంచే ధాన్యాన్ని నిలువరించడం వల్ల జిల్లా రైతులకు మద్దతు ధర విషయంలో ఎంతో ప్రయోజనం జరిగిన విషయం తెలిసిందే.
కరోనా తొలిదశ లాక్డౌన్ సమయంలో ధాన్యం కొనుగోళ్లను ఎలా అయితే పకడ్బందీగా నిర్వహించారో అంతే స్థాయిలో ఈ యాసంగిలోనూ ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగాలన్నీ దీనికే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ రంగంలోకి దిగాయి. అవసరమైతే ఇతర శాఖల అధికారులను, సిబ్బందిని సైతం వినియోగించుకుని కొనుగోళ్లలో ఆటంకాలు రాకుండా నిర్వహించాలన్న లక్ష్యంతో ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. ఒకటి, రెండు రోజుల్లో కొనుగోలు కేంద్రాలకు శ్రీకారం చుడుతూ వారం రోజుల్లోనే అవసరాన్ని బట్టి అంతటా అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
ధాన్యం కొనుగోళ్లలో గన్నీ బ్యాగుల సేకరణ ప్రధానమైన అంశం. కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలకు ఎగుమతి చేయాలంటే బ్యాగులు అందుబాటులో ఉండాలి. వీటి సేకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 4 లక్షల గన్నీ బ్యాగులు పౌరసరఫరాల శాఖ వద్ద అందుబాటులో ఉన్నట్లు అంచనా. వీటికి తోడు మిల్లర్ల వద్ద గత యాసంగి, వానకాలంలో సీఎంఆర్‌కు ఇచ్చిన ధాన్యానికి సంబంధించి మరో 30 లక్షల నుంచి 40 లక్షల వరకు గన్నీ బ్యాగులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వీటన్నింటిని తక్షణమే మిల్లర్ల వద్ద నుంచి తీసుకురావాలని పౌరసరఫరాల శాఖ డీటీలకు బాధ్యతలు అప్పగించారు. అలాగే మిల్లర్లకు కూడా గన్నీ బ్యాగులు అప్పగించాలని ఆదేశించారు. ఇక మొత్తంగా కోటిన్నర వరకు గన్నీ బ్యాగులు ఒక్క నల్లగొండ జిల్లాకు అవసరం పడనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇదే రకంగా సూర్యాపేట జిల్లాలోనూ గన్నీ బ్యాగుల సేకరణపై దృష్టి పెట్టారు.
ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇందుకు వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కొనుగోళ్లలో ఇబ్బందుల్లేకుండా ఉండడానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. గత సీజన్లో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించాం. ఎక్కడైనా రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్, నల్లగొండ