
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్29(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో హరితవిప్లవం తరహాలోనే క్షీర విప్లవం మొదలైందని, పాడి పరిశ్రమ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆది నుంచి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యవసాయంతోపాటు దాని అనుబంధ రంగాలు సైతం బలోపేతం కావాలన్నదే సర్కారు ఆకాంక్ష అని వివరించారు. విజయ డెయిరీ తరహాలోనే మదర్ డెయిరీని లాభాల బాటలో నడిపించేలా కొత్త పాలక వర్గం ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నార్మాక్స్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన సందర్భంగా జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో సంస్థ డైరెక్టర్లు, జిల్లా ప్రజాప్రతినిధులు బుధవారం ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. కొత్త డైరెక్టర్లను మంత్రి కేటీఆర్ అభినందించారు. నార్మాక్స్ నూతన చైర్మన్ ఎన్నిక మంగళవారం కోరం లేకపోవడంతో గురువారానికి వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు హయత్‌నగర్‌లో జరుగనున్న ప్రత్యేక సమావేశంలో చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు.
నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార యూనియన్(నార్మాక్స్) ఎన్నికల్లో ఆరింటికి ఆరు డైరెక్టర్ స్థానాలను టీఆర్ఎస్ ఏకపక్షంగా గెలుచుకుంది. దీంతో నూతనంగా ఎన్నికైన ఇద్దరు మహిళా డైరెక్టర్లతోపాటు మిగతా నలుగురు డైరెక్టర్లు, ఇప్పటికే కొనసాగుతున్న డైరెక్టర్లంతా కలిసి హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కృతజ్ఞతాపూర్వకంగా కలిశారు. నార్మాక్స్ ఎన్నికలను మిగతా నేతలతో సమన్వయం చేస్తూ ముందుండి నడిపించిన మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో వీరంతా ప్రగతిభవన్‌కు తరలివెళ్లారు. వీరితోపాటు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్‌కుమార్, నార్మాక్స్ ప్రస్తుత చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నంద్యాల దయాకర్‌రెడ్డి కేటీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నార్మాక్స్‌లో ఘనవిజయం సాధించడంపై జిల్లా నేతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం ఏర్పడ్డాక సాగు నీరు అందుబాటులోకి రావడంతో అనేక రంగాలకు పునరుజ్జీవంగా మారిందని కేటీఆర్ అన్నారు. వ్యవసాయంతోపాటు దాని అనుబంధ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ దిశగా సీఎం కేసీఆర్ అనేక పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్న విషయాలను గుర్తు చేశారు. పాడి పరిశ్రమ అభివృద్ధిపై కూడా రాష్ట్రం ఏర్పాటు నాటి నుంచే ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. విజయ డెయిరీ తరహాలోనే మదర్ డెయిరీని లాభాల బాటలో నడిపించేందుకు నూతన పాలకవర్గం ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న విజయ డెయిరీని సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో బలోపేతం చేసిన తీరును గుర్తు చేశారు. ఇదే తరహాలో పాడి రైతులకు న్యాయం చేస్తూ మదర్ డెయిరీనీ అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కొత్త పాలకవర్గం సమష్టిగా ప్రభుత్వ సహకారంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.
చైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా..
నార్మాక్స్ నూతన చైర్మన్ ఎన్నిక.. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఉదయం 11గంటలకు జరగాల్సి ఉంది. హయత్‌నగర్‌లోని మదర్ డెయిరీ బోర్డు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా, ఏ ఒక్క డైరెక్టర్ కూడా హాజరుకాలేదు. 15 మంది సభ్యుల్లో కనీసం 10 మంది హాజరైతేనే కోరం పూర్తికానుంది. కోరం లేకపోవడంతో ఎన్నికను బుధవారానికి వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి జీవీ హన్మంతరావు ప్రకటించారు. ఉదయం 11గంటలకు సంస్థ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలోనే నార్మాక్స్ నూతన చైర్మన్ ఎన్నిక జరుగనున్నది. 15 మంది డైరెక్టర్లలో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకోనున్నారు. కాగా, చైర్మన్ అభ్యర్థిపై సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయమని ఇప్పటికే మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.