
తల్లీ, ఇద్దరు కూతుళ్లకు పింఛనే జీవనాధారం
ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కు లేని నిరుపేదలకు బతుకుపై భరోసా కల్పిస్తున్నాయి. తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన పగిళ్ల దుర్గమ్మ, ఆమె ఇద్దరు కూతుళ్లు ఆసరా పింఛన్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. తమ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కన్న తండ్రిలా, సోదరుడిలా అండగా నిలిచాడని కొనియాడుతున్నారు.
తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన పగిళ్ల దుర్గమ్మకు ముగ్గురు కూతుళ్లు. భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో ఇండ్లల్లో బట్టలు ఉతికి జీవనం సాగిస్తూ కూతుళ్లను పెంచి పెద్ద చేసింది. ఓ కూతురు చనిపోగా మిగతా ఇద్దరికీ వివాహాలు చేసింది. పెద్ద కూతురు మంగమ్మకు ఆరోగ్యం సహకరించకపోవడంతో భర్త వదిలి వెళ్లిపోయాడు. రెండో కూతురు జయమ్మ కూడా భర్తకు దూరంగా తల్లి దగ్గరే ఉంటున్నది. ఈ నేపథ్యంలో మంగమ్మకు వృద్ధాప్య పింఛన్, ఇద్దరు కూతుళ్లకు ఒంటరి మహిళల పింఛన్ ఆ కుటుంబానికి కొండంత ఆసరా అయ్యింది. ప్రస్తుతం దుర్గమ్మ వయస్సు మీదపడడంతోపాటు ఆమె ఇద్దరు కూతుళ్లు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రేషన్ దుకాణంలో ఇచ్చే బియ్యం, పింఛన్ డబ్బులు 6వేల రూపాయలే వారికి ఆధారమయ్యాయి.35కిలోల రేషన్ బియ్యం వస్తుండడంతో మందులకు, ఇంట్లో సామగ్రికి పింఛన్ డబ్బులు వాడుకుంటున్నారు.
కేసీఆర్ సారే మాకు పెద్ద దిక్కు
‘మాలాంటి వారికి బుక్కెడు బువ్వ పెట్టేటోళ్లు కూడ ఉండరు.. నేను ముసలిదాన్ని అయిన.. నా బిడ్డలు ఆరోగ్యం బాగలేక పనిచేసే సత్తువ లేదు. కేసీఆర్ సారు మా కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యిండు. మా ముగ్గురికీ పింఛన్ డబ్బులు వస్తున్నయి. రేషన్ షాపులో బియ్యం ఇస్తున్నరు. ఒంటరోళ్లమైనా ధైర్యంగా బతుకుతున్నం. ’ అని వృద్ధురాలు పగిళ్ల దుర్గమ్మ, ‘ఆరోగ్యం బాగలేక ఇంటి దగ్గరే ఉంటున్నా సంతోషంగానే బతుకుతున్నం. కేసీఆర్ సారు మా లాంటోళ్లకు పింఛన్, బియ్యం ఇచ్చి ఆదుకుంటున్నడు. ఆయన రుణం తీర్చుకోలేం’ అని దుర్గమ్మ కూతుళ్లు మంగమ్మ, జయమ్మ తెలిపారు.