
దరఖాస్తులకు వచ్చే నెల 15 వరకే గడువు ఉమ్మడి జిల్లాలో నమోదైన ప్రాజెక్టులు 158 మాత్రమే.. ప్రైవేట్ స్కూళ్ల నుంచి కనీస స్పందన కరువు సర్కారు ఉద్దేశం, విద్యార్థుల భవిత్యంపై నిర్లక్ష్యం గతేడాది కొవిడ్ పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోనే ముందంజ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి, జాతీయ స్థాయిలో ప్రోత్సాహం అందించేందుకు ఉద్దేశించిన ఇన్స్పైర్ మానక్పై పాఠశాలలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే గొప్ప అవకాశానికి హైస్కూల్ విద్యార్థులను దూరం చేస్తున్నాయి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్రయోగాల వైపు ప్రోత్సహిం చేందుకు ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇన్స్పైర్ మానక్ నిర్వహిస్తున్నది. దీనికి ఎంపికైన విద్యార్థులకు నమూనా ప్రాజెక్టు తయారీ కోసం 10 వేల రూపాయలను ముందుగానే అందిస్తుంది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఏర్పాటుచేసి ప్రోత్సహిస్తుంది. జూలై 15 నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుండగా, ఉమ్మడి జిల్లాలోని 1,744 పాఠశాలల తరఫున ఇప్పటివరకు 158 నామినేషన్లు మాత్రమే రావడం గమనార్హం. విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు, సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించినా స్పందన కరువవడం శోచనీయం. గతేడాది కరోనా పరిస్థితుల్లోనూ 2,758 దరఖాస్తులు నమోదయ్యాయి. ఈసారి ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు పట్టించుకోవడం లేదని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే 15 వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది. ఇప్పటికీ స్పందించకపోతే విద్యార్థులు నష్టపోనున్నారు.
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల కోసం ప్రయోగాల రూపకల్పనకు నేషనల్ డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిధులు మంజూరు చేస్తున్నది. ఖర్చుల కోసం రూ.10 వేలు విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమచేస్తుంది. జిల్లా స్థాయిలో మంజూరైన ప్రాజెక్టుల్లో పది శాతం రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయిలో ఎంపికైన వాటిలో పది శాతం జాతీయ స్థాయికి పంపిస్తారు. ఉత్తమంగా నిలిచే 60 నమూనాలను రాష్ట్రపతి భవన్లో ప్రదర్శించే అవకాశం దక్కుతుంది. జాతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.20 వేల నగదు పురస్కారం అందిస్తారు.
నేషనల్ డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్పైర్ అవార్డు-మానక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆమోదం, గైడ్ టీచర్ సహకారంతో www.inspireawards-dst.gov.in ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఒక్కో పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులకు అవకాశం ఉంటుంది. 2021-22 సంవత్సరానికి భారత ప్రభుత్వ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ దేశ వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలల నుంచి 10 లక్షల ప్రాజెక్టుల ఆలోచనలు రావాలని సంకల్పించారు. వాటిలో లక్ష ప్రాజెక్టులను ఎంపిక చేసి ఆయా విద్యార్థులకు రూ.10వేలు చొప్పున ఇచ్చి ప్రాజెక్టులు తయారు చేయించాలని నిర్ణయించారు.
నామమాత్రంగా స్పందన…
ఇన్స్పైర్ అవార్డు-మానక్లో నమోదు చేసుకోవడానికి ఈ విద్యా సంవత్సరం దరఖాస్తుల ప్రక్రియ జూలై 15న ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలో 1,744 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 158 ప్రాజెక్టులు మాత్రమే నమోదయ్యాయి. దరఖాస్తు గడువుకు మరో 17రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఇప్పటికైనా స్పందిస్తారో లేదో వేచిచూడాల్సిందే.
ఉమ్మడి జిల్లాలో అవకాశం ఉన్న పాఠశాలలు ఇలా..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇన్స్పైర్ మానక్ అవార్డుల నమోదుకు అర్హత ఉన్న వాటిలో ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేట్ పాఠశాలలు మొత్తం 1,744 ఉన్నాయి. ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో 841పాఠశాలలకు గాను 68, సూర్యాపేట జిల్లాలో 549 పాఠశాలలకు గాను 58, యాదాద్రి భువనగిరి జిల్లాలో 354 పాఠశాలలకు గాను 32 దరఖాస్తులు మాత్రమే అందాయి.
గతేడాది ఉమ్మడి జిల్లా నంబర్ వన్…
ఇన్స్పైర్ మానక్ అవార్డుల కోసం గతేడాది కరోనా పరిస్థితుల్లోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి అత్యధిక దరఖాస్తులు నమోదయ్యాయి. ఈ పర్యాయం పరిస్థితి మెరుగైనప్పటికీ దరఖాస్తులు తగ్గుముఖం పట్టాయి. అధికారుల పర్యవేక్షణా లోపం, హెచ్ఎంలు, సైన్స్ టీచర్స్ నిర్లక్ష్య వైఖరే అందుకు కారణమని తెలుస్తున్నది. గతేడాది నల్లగొండ జిల్లా నుంచి 1,754 ప్రాజెక్టులకు దరఖాస్తు చేయగా 221 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 215 పాఠశాలల నుంచి 528 ప్రాజెక్టులు నమోదుకాగా 74, యాదాద్రి భువనగిరి జిల్లాలో 203 పాఠశాలల నుంచి 476 ప్రాజెక్టులు నమోదు కాగా 62 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి.
ఇన్స్పైర్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలి…
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే ఇన్స్పైర్ అవార్డు – మానక్లో ప్రదర్శనల నమోదు కోసం ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఆన్లైన్ నామినేషన్స్ గడువు అక్టోబర్ 15న ముగియనున్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గతంలో మాదిరిగానే ఈ ఏడాది సైతం ప్రాజెక్టుల నమోదులో నల్లగొండను ప్రథమ స్థానంలో ఉంచేలా కృషి చేస్తాం. ప్రైవేట్ పాఠశాలల నుంచి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు అందడం లేదు.
నమోదులో జాప్యానికి కారణాలెన్నో..
ఇన్స్పైర్ అవార్డు-మానక్ నమోదుల్లో వెనుకబాటుకు సంబంధిత ఉపాధ్యాయలు పలు కారణాలను వెల్లడిస్తున్నారు. విద్యార్థుల బ్యాంక్ ఖాతాలో నమోదైన నగదును ప్రధానోపాధ్యాయులు విత్ డ్రా చేయించి తీసుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. రూ.2వేల నుంచి 3వేలు మాత్రమే అందిస్తూ నిరుత్సాహ పరుస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగుతున్నట్లు సమాచారం.