
జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం
నల్లగొండ, తుంగతుర్తి మండలాల్లో
6 సెం.మీ వర్షపాతం
పొంగిన వాగులు.. నిండిన చెరువులు
నల్లగొండ, ఆగస్టు 28 : ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలో శనివారం పొద్దంతా ముసురు కారణంగా వీధులు జలమయమయ్యాయి. వెలుగుపల్లిలో సాయంత్రం ఐదు గంటల వరకు 58.5 మిల్లీ మీటర్ల వర్షం పడగా, కట్టంగూర్ మండల కేంద్రంలో 53.5మి.మీ., అయిటి పాములలో 51.5 మి.మీ కురిసింది. ఇక తిప్పర్తి, నకిరేకల్ మండలాల్లో 3సెంటీ మీటర్లు, నార్కట్‌పల్లి, కేతేపల్లి, శాలిగౌరారం మండలాల్లో 2సెంటీమీటర్ల వర్షం పడింది. త్రిపురారం, చిట్యాల, మిర్యాలగూడ మండలాల్లో ఒక సెంటీమీటర్ వర్షం పడగా అనుముల, వేముల పల్లి, మర్రిగూడ, మాడ్గులపల్లి, గుండ్లపల్లి, నాంపల్లి, నిడమనూరు, పీఏ పల్లి, దామరచర్ల మండలాల్లో జల్లులు కురిశాయి. కట్టంగూర్ మండలంలో భారీ వర్షానికి వీధులన్నీ జలమయమయ్యాయి. మండలంలోని చెరువులు, కుంటల్లో భారీగా నీరుచేరి నిండుకుండను తలపిస్తున్నాయి. కట్టంగూర్‌లోని పెద్ద, చిన్న వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
28మండలాల్లో వర్షం..
శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకు జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. అత్యధికంగా మర్రిగూడ మండలంలో 28.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా నిడమనూర్‌లో 21.5, నార్కట్ పల్లి 21.3, చండూర్ 20.7, చిట్యాల 20.7, నల్లగొండ 13.5, గుండ్లపల్లి 13.1, కనగల్ 12.5, అనుముల 10.0, కేతేపల్లి 9.7, తిప్పర్తి 8.0, త్రిపురారం 6.9, నాంపల్లి 5.7, వేముల పల్లి 5.3, మునుగోడు 4.6, దేవరకొండ 4.5, చందంపేట 4.3, చింతపల్లి 2.9, గుర్రంపోడు 2.2, మాడ్గులపల్లి 2.0, నేరేడుగొమ్ము 2.0, పీఏ పల్లి 1.5, దామరచర్ల 1.4, పెద్దవూర 1.2, అడవిదేవులపల్లి 1.0, కొండమల్లే పల్లి 1.0, శాలిగౌరారం 0.3 మి.మీ వర్షం పడగా అత్యల్పంగా మిర్యాలగూడలో 0.3మి.మీ వర్షం కురిసింది. ఆయా మండలాల్లో 224.8 మి.మీ., వర్షం పడగా 7.3 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఈ సీజన్లో 351.7 మి.మీ వర్షం పడాల్సి ఉండగా 477.6 మిల్లీ మీటర్లతో 36శాతం అదనంగా నమోదైంది.
మూసీ ప్రాజెక్టు 3గేట్ల ఎత్తివేత
ఎగువన భారీ వర్షాలు, పెరిగిన ఇన్ ఫ్లో
కేతేపల్లి, ఆగస్టు 28 : మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన హైదరాబాద్, వరంగల్‌లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తుతున్నది. శనివారం ఉదయం 1,897 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, మధ్యాహ్నం వరకు 3,750 క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువ కావడంతో అధికారులు 3 గేట్లను ఎత్తి నీటి విడుదల ప్రారంభించారు. ప్రాజెక్టు 2, 4, 11వ నెంబరు క్రస్టు గేట్లను ఒక్కో గేటును రెండు అడుగుల మేర ఎత్తి 3870.92 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కుడి, ఎడమ కాల్వలకు కలిపి 189.72 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది. మొత్తం 4,147.54 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 643.45(4.06 టీఎంసీలు) అడుగులు ఉన్నట్లు ఏఈ ఉదయ్ తెలిపారు.
తుంగతుర్తిలో 61.3 మిల్లీమీటర్ల వర్షపాతం
సూర్యాపేట, ఆగస్టు 28 : సూర్యాపేట జిల్లాలో అన్ని మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా తుంగతుర్తి మండలంలో 61.3మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మద్దిరాల, మోతె మండలాల్లో 50మి.మీ., పెన్పహడ్ 30.8, గరిడేపల్లి 35.5, సూర్యాపేట, అనంతగిరి, ఆత్మకూర్(ఎస్) 30.1, నూతనకల్ 25.5, జాజిరెడ్డిగూడెం 22.8, నడిగూడెం, మఠంపల్లి 20.2, కోదాడ, చివ్వెంల, చిలుకూరు మండలాల్లో 15.2మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.