
కరోనా స్వల్ప లక్షణాలున్నవారికి మెడికల్ కిట్
హడావుడి లేకుండా ఇంటి వద్దకే వైద్య సేవలు
ఆస్పత్రుల చుట్టూ తిరగకుండా హోం ఐసొలేషన్‌తో సాంత్వన
మల్టీ విటమిన్ మాత్రలతో సహా రూ.500-600 విలువైన మందుల పంపిణీ
గ్రేటర్ వ్యాప్తంగా వేగంగా ఫీవర్ సర్వే
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 27 (నమస్తేతెలంగాణ) : కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వమిస్తున్న మందుల కిట్ (మెడికల్ కిట్) సత్ఫలితాలిస్తోంది. మహమ్మారి నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన జ్వర సర్వే గురువారానికి ఏడు రోజులు పూర్తయ్యింది. ఈ సర్వేలో ఇంట్లో లక్షణాలున్నట్లు అనిపిస్తే వెంటనే కిట్ అందజేస్తున్నారు. సర్వేతో ఇంటి ముంగిటకే వైద్య సేవలు రావడం ఒకవంతైతే, ఎలాంటి హడావుడి లేకుండా, సామాజిక ఇబ్బందులు తలెత్తకుండా, ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లకు వెళ్లి డబ్బులు దుబారా చేసుకోకుండా హోం ఐసొలేషన్‌తో బాధితులు ఉపశమనం పొందుతున్నారు. ప్రభుత్వమిచ్చే మందుల కిట్ విలువ రూ.500- రూ.600 ఉంటోంది.
ఫీవర్ సర్వేలో భాగంగా గ్రేటర్‌వ్యాప్తంగా వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు ఉన్నట్లు చెప్పిన వెంటనే మందులు అందజేస్తున్నారు. ఫలితంగా కరోనా వ్యాప్తిని నివారించడంతోపాటు బాధితులకు ఆర్థిక ఇబ్బందులు తప్పినట్లవుతోంది.
సర్వేతో ప్రయోజనం
బయట మార్కెట్లో ప్రభుత్వమిచ్చే మందుల ధరలు
మందు ధర
అజిత్రోమైసిన్ 180.00
పారాసిటమాల్ 20.00
లెవోసెటిరిజైన్ 110.00
రానిటిడైన్ 10.00
విటమిన్-సి 16.00
మల్టీ విటమిన్ 80.00
విటమిన్-డి 120.00
మొత్తం 536.00