
గరిడేపల్లి, జనవరి 27 : స్వప్రయోజనాల కోసమే పనులు చేసే నేటి రోజుల్లో ఊరు గురించి, ఊరి జనం మేలు కోరి పనులు చేసే వ్యక్తులు అరుదు. అటువంటే వ్యక్తే మండలంలోని గానుగుబండ గ్రామానికి చెందిన పేరూరి సత్యనారాయణ. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నాలుగేండ్లు ఉద్యోగం చేసిన అనంతరం రాజీనామా చేసి గ్రామంలో కిరాణా దుకాణం నడుపుతూ ధాన్యం వ్యాపారం ప్రారంభించారు. ఆర్థిక పరిపుష్టిని సాధించి సమాజం కోసం ఏదైనా చేయాలన్న సంకల్పంతో గ్రామానికి అనేక రకాలుగా విరాళాలు అందించారు.
ముఖ్యంగా గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన విద్యార్థులు కొండాయిగూడెం రోడ్డులోని జడ్పీహెచ్ఎస్ ఆవరణలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లేందుకు దూరభారంతో ఇబ్బంది పడేవారు. కాలనీలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం అక్కడే పాఠశాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు పర్చాలన్న సంకల్పంతో సత్యనారాయణ తన సొంత ఖర్చులతో మూడు కుంటల స్థలాన్ని కొనుగోలు చేసి పాఠశాలకు విరాళంగా అందించాడు. అలాగే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల ఆవరణలో మహత్మాగాంధీ విగ్రహం, ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో నెహ్రూ విగ్రహాన్ని సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు పలుసార్లు నోట్ పుస్తకాలు, పెన్నులు, పలుకలు తదితర సామగ్రిని అందించారు. సత్యనిష్ఠతో సర్కారు బడికి సత్తువను అందజేసేందుకు ఇప్పటికే పది లక్షలకు పైగా విరాళాలు అందించాడు. ఇవే కాకుండా గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర ఏర్పాటుకు ఐదు గుంటల స్థలాన్ని కొనుగోలు చేసి విరాళంగా ఇచ్చాడు. తాను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశానని, అప్పట్లో విద్యార్థులు పడుతున్న బాధలను అర్థం చేసుకుని వాటిని పరిష్కరించేందుకు ఏదైనా సహాయం అందించాలని తీసుకున్న నిర్ణయానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు సత్యనారాయణ చెప్పారు. గ్రామాభివృద్ధికి రూ.20 లక్షలకు పైగా విరాళాలు అందించిన సత్యనారాయణ లాంటి దాత ఉండడం తమ అదృష్టం అని చెప్తున్నారు గానుగుబండ గ్రామస్తులు.