
రామగిరి, సెప్టెంబర్ 25 : ప్రతి ఒక్కరూ న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని న్యాయ సేవా సంస్థ మెంబర్ సెక్రటరి వై.రేణుక అన్నారు. నల్లగొండ జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్‌లో శనివారం రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ-హైదరాబాద్, ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ న్యాయవాదులకు, పారా లీగల్ వలంటీర్లకు, వివిధ శాఖల జిల్లా అధికారులకు నిర్వహించిన ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఓరియంటేషన్’ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రజలకు లబ్ధి చేకూరే విషయాలపై అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14 వరకు అవగాహన కల్పించాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని 65 మండలాల్లో 1557 గ్రామాల్లో ఈ కార్యక్రమాల నిర్వహణకు 149 ప్యానల్ న్యాయవాదులు, 195 మంది పారాలీగల్ వలంటీర్లతో 65 గ్రూపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ మాట్లాడుతూ జ్ఞానం అందివ్వడమనేది మహా కార్యక్రమం అన్నారు. నేటికీ అనాగరికంగా నేరాలు జరుగడం సమాజానికి పెను సవాల్‌గా మారిందని పేర్కొన్నారు. దీనిని రూపు మాపేందుకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో మొదటి అదపు జిల్లా న్యాయమూర్తి ఎం.నాగరాజు, అదనపు జిల్లా న్యాయమూర్తులు కృష్ణమూర్తి, తిరుపతి, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ పరిపాలనాధికారి పి.ఆంజనేయులు, ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.వేణు, సీనియర్ సివిల్ జడ్జి ఎం.వెంకటేశ్వర్రావు, ఎక్సైజ్ మేజిస్ట్రేట్ రాణి, మొబైల్ కోర్టు న్యాయమూర్తి కీర్తి చంద్రికారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.