
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత నిర్మాణం సంపూర్ణమైంది. పార్టీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామ, మండల కమిటీలు, అనుబంధ సంఘాల ఎన్నికలు పూర్తయ్యాయి. అక్కడకక్కడా మిగిలి ఉన్న కార్యవర్గాల ఎన్నికనూ అధినేత కేసీఆర్ తాజా ఆదేశాల మేరకు గురువారం ముగించారు. కార్యవర్గాల వివరాలన్నింటినీ నియోజకవర్గాల వారీగా క్రోడీకరిస్తూ రాష్ట్ర కార్యాలయానికి అందజేసే పనిని ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటికే 5నియోజకవర్గాలవి పంపగా, మిగతా రేపటిలోగా సమర్పించనున్నారు. జిల్లాఅంతటా ఆయా కమిటీల్లో స్థానం కోసం క్యాడర్ మధ్య పోటాపోటీ నెలకొన్నా… చివరకు అందరి ఆమోదంతోనే ఏకగ్రీవంగా పూర్తవడం విశేషం. ఎన్నికలు సజావుగా ముగియడంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, ఇతర ముఖ్యులు కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు అందరి దృష్టీ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించనున్న జిల్లా కార్యవర్గంపై పడింది.
క్షేత్రస్థాయి నుంచి చేపట్టిన సంస్థాగత నిర్మాణంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తున్నది. గ్రామ, అనుబంధ సంఘాల కార్యవర్గాలతో ఈ నెలారంభం నుంచే పార్టీలో సందడి నెలకొంది. ఈ నెల 2న జెండా పండుగతో సంస్థాగత నిర్మాణం మొదలుకాగా 3వ తేదీ నుంచే గ్రామ, వార్డు కమిటీల ఎన్నికకు శ్రీకారం చుట్టారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు జిల్లా ఎన్నికల ఇన్చార్జిగా, రాష్ట్ర కార్యదర్శులైన ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, చాడ కిషన్‌రెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డి, వై.వెంకటేశ్వర్లు నియోజకవర్గాల ఇన్చార్జులుగా వ్యవహరించారు. స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి కార్యవర్గం ఎన్నికల్లో నేతలను, క్యాడర్‌ను సమన్వయపరిచారు. కమిటీల ఎన్నికల్లో పార్టీ సూచించిన విధంగా 51శాతం బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తూనే చురుకుగా పనిచేసే వారికే పట్టం కట్టారు. చురుకుగా పనిచేసే వారిని గుర్తిస్తూ యువతకు మెజార్టీ గ్రామ కమిటీల్లో నాయకత్వ బాధ్యతలు కట్టబెట్టారు. చాలాచోట్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పదవులకు పోటీ నెలకొన్నా… అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. ఫైనల్‌గా అందరి ఆమోదంతోనే కార్యవర్గాల ఎన్నికను ఏకగ్రీవంగా పూర్తి చేశారు.
శ్రేణుల్లో నూతనోత్సాహం
గ్రామ, వార్డు కమిటీలను ఈ నెల 12నాటికే పూర్తి చేశారు. అనంతరం మండల కమిటీల ఎన్నిక చేపట్టి 20వ తేదీ నాటికి మెజార్టీ వంతు ఎన్నికలు పూర్తి చేశారు. మిగిలిన చోట్ల గురువారం నాటికి పూర్తి చేసి వందశాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. మండల కమిటీల్లో అనుభవానికి, కలుపుకొనిపోయేతత్వానికి ప్రాధాన్యమిస్తూ సీనియర్లకు అధ్యక్ష, ప్రధానకార్యదర్శుల బాధ్యతలు అప్పజెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న వారికి కూడా పార్టీ అవసరాల రీత్యా చాలాచోట్ల మరోసారి అవకాశం కల్పించారు. ఇందులోనూ సామాజికవర్గాలకు పార్టీ నిర్దేశించిన ప్రకారం ప్రాధాన్యత కల్పించారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు, నేతల్లో సంస్థాగత నిర్మాణంతో నూతనోత్సాహం వెల్లివిరుస్తున్నది.
వివరాలు రాష్ట్ర కార్యాలయానికి అందజేత
కొత్త కార్యవర్గాల వివరాలను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరవేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్యవర్గాల వివరాలను నియోజకవర్గాల వారీగా ప్రత్యేకంగా పొందుపరుస్తున్నారు. గురువారం సాయంత్రానికి ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన గ్రామ, మండల పార్టీ, అనుబంధ సంఘాల కార్యవర్గాల వివరాలను అందజేశారు. నల్లగొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ నియోజవర్గాల కమిటీల వివరాలను పంపించారు. సూర్యాపేట, దేవరకొండ, నకిరేకల్, మునుగోడు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు సంబంధించి నేడో, రేపో సమర్పించనున్నారు. నల్లగొండ జిల్లాలో 31 మండల, 8 పట్టణ కమిటీలు, సూర్యాపేట జిల్లాలో 23మండల, ఐదు పట్టణ కమిటీలు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 17మండల, ఆరు పట్టణ కమిటీలు ఉండగా అన్నింటి ఎన్నిక పూర్తైనట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరు లోగా జిల్లా కార్యవర్గం ఎన్నికలు పూర్తి కానుండగా పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా జిల్లా అధ్యక్షులను ప్రకటిస్తారని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. తర్వాత పూర్తి స్థాయి కార్యవర్గాన్ని కూడా ఖరారు చేయనున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకే అధ్యక్షుడు ఉండగా ప్రస్తుతం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాలకు వేర్వేరు కార్యవర్గాలు తొలిసారి ఏర్పాటు కానున్నాయి. జిల్లా కార్యవర్గాల కూర్పులో మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలు కీలకం కానున్నాయి.
ఏకాభిప్రాయంతోనే పూర్తి…
మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యవేక్షణలో ఎమ్మెల్యేలు, ఎన్నికల ఇన్చార్జీలు, ఇతర ముఖ్యుల సమన్వయంతో పార్టీ సంస్థాగత నిర్మాణం సజావుగా ముగిసింది. గ్రామ, మండల కమిటీల్లో స్థానం కోసం ఆరోగ్యకరమైన పోటీ కనపడింది. ఇది పార్టీ భవిష్యత్‌కు మంచి పరిణామమే. పార్టీ కోసం పనిచేస్తామని పోటాపోటీగా ముందుకు రావడం పార్టీ పట్ల ఉన్న తపనకు నిదర్శనం. గ్రామ కమిటీల్లో యువతకు, మండల కమిటీల్లో అనుభవానికి ప్రాధాన్యమిస్తూ సామాజిక సమతుల్యత పాటించాం. అందరి అభిప్రాయాలకు విలువనిస్తూనే ఏకాభిప్రాయంతోనే కమిటీలు పూర్తికావడం సంతోషకరం. పోటీ ఎక్కువగా ఉన్న చోట్ల ఒకటికి రెండుసార్లు బహిరంగంగానే అందరితో చర్చించి, ఒప్పించి కార్యవర్గాలను ఫైనల్ చేశాం. కార్యవర్గాల వివరాలన్నింటినీ ఒకటీరెండు రోజుల్లో పంపిస్తాం. జిల్లా కార్యాలయాలు అందుబాటులోకి తెచ్చి, పూర్తిస్థాయిలో పార్టీని పటిష్టంగా నడిపించాలన్నదే అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యం.
తక్కెళ్లపల్లి రవీందర్రావు, జిల్లా ఎన్నికల ఇన్చార్జి