
అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టి మురిసిపోయిన అక్కాచెల్లెలు
జిల్లావ్యాప్తంగా సందడే సందడి
రామగిరి, ఆగస్టు 22 : జిల్లావ్యాప్తంగా ఆదివారం రక్షాబంధన్ వేడుకలను ఆప్యాయతానురాగాలతో ఘనంగా జరుపుకున్నారు. అన్నాదమ్ముళ్లకు అక్కాచెల్లెలు రాఖీలు కట్టి మురిసిపోయారు. పుట్టింటికి వెళ్లి సోదరులకు రాఖీ కట్టి స్వీట్లు తినిపించి సంబురాలు చేసుకున్నారు. అంతటా సందడి సందడిగా కనిపించింది. నల్లగొండలోని ప్రధాన కూడళ్లు, రాఖీ విక్రయ కేంద్రాలు, స్వీటుషాపులు రద్దీగా కనిపించాయి.
పలు దేవాలయాల్లో…
జిల్లా కేంద్రంలోని వీటీ కాలనీలో శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక అలకంరణ చేశారు. అమ్మవారి సమక్షంలో రాఖీలు కట్టుకున్నారు. పాతబస్తీ సంతోషిమాత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ చేశారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో పంచముఖ హనుమాన్ ఆలయంలో, తులసీనగర్‌లోని శ్రీభక్తాంజనేయస్వామి ఆలయంలో భక్తులకు రాఖీలను పంపిణీ చేశారు.
వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు..
నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి ఆయన నివాసంలో పలువురు మహిళలు రాఖీలు కట్టారు. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డికి తన సోదరి రాఖీ కట్టి ఆశీర్వచనం చేశారు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ధర్మానాయక్‌కు మహిళా కౌన్సిలర్లు(అధ్యాపకులు), విద్యార్థులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీఓ భవనంలో ఆ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో రక్షాబంధన్ నిర్వహించారు. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌కు ఉద్యోగులు రాఖీలు కట్టి సంబురాలు చేశారు.
కట్టంగూర్(నకిరేకల్) : నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమారాణి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు రాఖీలు కట్టి సోదరభావాన్ని పంచుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సోదర సోదరీమణుల అనురాగానికి రక్షాబంధన్ ప్రతీక అన్నారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లిం మహిళలతోపాటు
పలువురు వీరేశానికి రాఖీలు కట్టారు.
శాలిగౌరారం : హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ నివాసంలో ఎమ్మెల్యేకు మండలంలోని పెర్కకొండారం ఎంపీటీసీ భీనబోయిన పుష్పాభద్రయ్య రాఖీ కట్టారు.
మిర్యాలగూడ టౌన్ : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్బీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు నల్లమోతు సిద్దార్ధకు నియోజకవర్గంలోని పలువురు మహిళలు రాఖీ కట్టారు.
దేవరకొండ : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌కు దేవరకొండ జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్ రాఖీ కట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మహిళలను సోదరీమణులుగా భావించి అండగా నిలువాలన్నారు.
పెద్దఅడిశర్లపల్లి : మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వైస్ ఎంపీపీ అర్వపల్లి సరిత ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు రాఖీ కట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, అంజిరెడ్డి, యాదగిరి ఉన్నారు.
శివరామక్షేత్రంలో పూజలు
మునుగోడు : మండల కేంద్రంలోని ప్రాచీన శివరామక్షేత్రంలో రక్షాబంధన్, జంధ్యాల పౌర్ణమి సందర్భంగా స్వామివారికి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున రుద్రాభిషేకం, కుంకుమ పూజ, గాయత్రీ హోమం చేశారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి టీటీడీ నుంచి వచ్చిన కంకణాలు, జంధ్యాలను భక్తులకు అందించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కొండోజు నవీన్‌కుమార్, అర్చకులు మహేశ్, శ్రీకాంత్, ప్రవీణ్, ఆలయ కమిటీ చైర్మన్ పాల్వాయి చెన్నారెడ్డి పాల్గొన్నారు.
సీతారామాంజనేయ స్వామి ఆలయంలో..
నార్కట్‌పల్లి : మండలంలోని బ్రాహ్మణ వెల్లెంల సీతారామాంజనేయ స్వామి ఆలయంలో సామూహిక యజ్ఞోపవీతధారణ జరిగింది. అర్చకులు శ్రీమాన్ లక్ష్మీనర్సింహాచార్యులు, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు చెరుపల్లి రఘుపతి, శ్రీనివాస్, రాములు, నరేందర్ పాల్గొన్నారు.
చండూరులో గాయత్రీ హోమం
చండూరు : శ్రావణ పౌర్ణమి, నూలు పుట్టిన రోజు సందర్భంగా స్థానిక మార్కండేశ్వర ఆలయంలో గాయత్రి హోమం, జంధ్యాల ధారణ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గాయత్రి ధారణ చేశారు. రాపోలు నారాయణ, కోమటి వీరేశం, తిరందాసు శ్రీను, చెరిపల్లి బిక్షమయ్య, ఏలె శ్రీను, దామోదర్, దుస్స గణేశ్ పాల్గొన్నారు.
సోదరీ, సోదరుల అనుబంధానికి ప్రతీక రాఖీ : కలెక్టర్
నల్లగొండ జిల్లా కేంద్రంలోని బాలసదన్, శిశుగృహకు వెళ్లిన కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ చిన్నారులతో రాఖీలు కట్టించుకున్నారు. ఈ సందర్భంగా బాలికలకు కలెక్టర్ కొత్త వస్ర్తాలు అందించారు. పిల్లలతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఎలా చదువుతున్నారు.. వసతులు సక్రమంగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సోదరీ, సోదరుల అనుబంధానికి ప్రతీక రాఖీ అన్నారు. ఆత్మీయుల మధ్య ఐకమత్యానికి పరస్పర చిహ్నంగా రాఖీ పండుగ చేసుకుంటారన్నారు. బాలల సంక్షేమ సమితి చైర్మన్ చింతకృష్ణకు బాలికలు రాఖీ కట్టారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి కె.గణేశ్, కో-ఆర్డినేటర్ ఈ.హరిత, తేజస్వీ, మేనేజర్లు దుర్గాభవాని, సుష్మ, నాగమణి, ఆర్ఐ అమర్నాథ్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.