
నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి భారీ ఆదాయం
అధికంగా ధాన్యం కొనుగోళ్లతో పెరిగిన ఆదాయం
రైతుల కోసం వివిధ కార్యక్రమాలు అమలు
నిడమనూరు, ఆగస్టు 22 : నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్దేశిత లక్ష్యానికి మించి ఆదాయాన్ని సాధించి జిల్లాలోనే ముందు వరుసలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలోనూ రెండింతల ఆదాయాన్ని సాధించగా.. ఈ సంవత్సరం ఇప్పటికే టార్గెన్ను అధిగమించింది. చెక్ పోస్టులు, ధాన్యం కొనుగోళ్ల ద్వారా మార్కెట్కు భారీగా రాబడి వస్తున్నది. గతంతో పోలిస్తే రెండింతల సంపాదనతో మార్కెట్ కమిటీ తనదైన ముద్ర వేస్తోంది.
ఆదాయం పెంచడమే లక్ష్యం
నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి గతంలో మిల్లులు, చెక్ పోస్టుల ద్వారా మాత్రమే ఆదాయం వచ్చేది. 2019లో మార్కెట్ కమిటీకి రూ.89.16 లక్షలు మాత్రమే వచ్చాయి. ఆ ఏడాది డిసెంబర్లో మార్కెట్ కమిటీకి కొత్త పాలకవర్గం ఎన్నికైంది. కమిటీ చైర్మన్ కామర్ల జానయ్య ఆధ్వర్యంలో ఆదాయం పెంపునకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుండడంతో గణనీయమైన ఆదాయాన్ని సాధించింది. 2019-20 సంవత్సరానికి రూ.1.40 కోట్లు లక్ష్యంగా నిర్ణయించగా రూ.1.28 కోట్ల ఆదాయం రాబట్ట గలిగింది. 2020-21లో మాత్రం లక్ష్యానికి మించి రికార్డు స్థాయిలో రూ.3,83,90,000 ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇందులో మిల్లుల ద్వారా రూ.20.10 లక్షలు, చెక్ పోస్టుల ద్వారా రూ. 42.82 లక్షలు, ధాన్యం కొనుగోళ్ల ద్వారా రూ.3,20,98,000 వచ్చాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.03 కోట్లు లక్ష్యం కాగా ఇప్పటికే రూ.1.06 కోట్లు వసూలు చేసింది. రాబోయే రోజోల్లో మరింత ఆదాయం రానున్నది.
పకడ్బందీగా పథకాల అమలు
రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మార్కెట్ పరిధిలోని రైతులకు అందించేందుకు కమిటీ కృషి చేస్తున్నది. దీంతో పాటు రైతులు సాగు చేసిన పంటల నిల్వపై 50శాతం వడ్డీ లేని రుణాలు అందిస్తున్నది. రైతులు తమ పంట ఉత్పత్తులు నిల్వ చేసుకొని గిట్టుబాటు ధర లభించినప్పుడు
అమ్ముకునేందుకు వీలుగా రైతులకు అవకాశం కల్పిస్తున్నది.
అభివృద్ధి పనులకు నిధులు మంజూరు
వ్యవసాయ మార్కెట్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.95 లక్షలను మంజూరు చేసింది. వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రహరీ నిర్మాణానికి రూ.24లక్షలు, లోపల సీసీ కోసం రూ.68లక్షలు, యార్డులో ఏర్పాటు చేసిన ధర్మకాంటా తరలింపునకు రూ.3లక్షలు మంజూరయ్యాయి. త్రిపురారం మండలం కంపాసాగర్ సబ్యార్డు చదునుకు రూ. 30 లక్షలు, ప్రహరీకి రూ.42 లక్షల అవసరమని ప్రతిపాదనలు పంపారు.
ఆదాయం పెంచేందుకు కృషి
వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణతో కృషి చేస్తున్నాం. మిల్లులు, మార్కెట్ చెక్ పోస్టులు, ధాన్యం కొనుగోళ్ల ద్వారా ఆదాయాన్ని సాధించగలిగాం. ప్రభుత్వ లక్ష్యం మేరకు రైతులకు మేలు చేసే అంశాల్లో రాజీపడకుండా శ్రమిస్తున్నాం. మార్కెట్లో అభివృద్ధి పనుల కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.95 లక్షలు మంజూరు చేసింది.