
తొలి విడుతలో 76శాతానికి మించి విద్యార్థుల చేరిక
ఎల్లుండి నుంచి రెండో విడుత అడ్మిషన్లు షురూ
హాలియా కొత్త కాలేజీలోనూ 84శాతం సీట్లు భర్తీ
సబ్జెక్టు నిపుణులు, నాణ్యమైన బోధన,
మెరుగైన మౌలిక వసతులు వెరసి.. దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) అడ్మిషన్లలో ప్రభుత్వ కళాశాలలు విద్యార్థులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఉన్నత విద్యామండలి ప్రారంభించిన ఆన్లైన్ అడ్మిషన్ల తొలి విడుతలో 76శాతం పూర్తి చేసుకొని ముందంజలో నిలిచాయి. మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 91ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉండగా వాటిలో 11ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్ల జోరు కొనసాగుతున్నది. సీట్ల భర్తీలో ప్రథమ స్థానంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున కళాశాల, రెండో స్థానంలో మహిళా కళాశాల నిలిచాయి. సీఎం కేసీఆర్ హామీ అమలులో భాగంగా హాలియాలో కొత్తగా ఏర్పాటైన కళాశాలలో 84శాతం అడ్మిషన్లు పూర్తయ్యాయి.
రామగిరి, ఆగస్టు 22 : డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీని పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘దోస్త్’ వెబ్సైట్ను ప్రారంభించింది. 2021-22 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల తొలి విడుత ప్రక్రియ ముగియగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రభుత్వ కళాశాలల్లో 76శాతం కంటే అధికంగానే అడ్మిషన్లు పూర్తి కావడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలే ఈ పరిస్థితికి నిదర్శనమని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 11డిగ్రీ కళాశాలల్లో..
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎంజీయూ పరిధిలో 11ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, రెండు ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. ‘దోస్త్’ తొలి విడుతలోనే అన్ని కళాశాలల్లో అత్యధికంగా సీట్లు భర్తీ కావడం గమనార్హం. వివిధ కోర్సుల్లో 5,700సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో తొలి విడుతలో 3,777సీట్లకు గాను 2,911 మంది విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. రెండో విడుతకే మెజార్టీ కళాశాలల్లో నూరుశాతం అడ్మిషన్లు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దోస్త్ రెండో విడుత అడ్మిషన్ల ఈ నెల 25నుంచి ప్రారంభిస్తామని ఉన్నత విద్యామండలి దోస్త్ విభాగం వెల్లడించింది. తొలి విడుతలో సీట్లు రాని విద్యార్థులు రెండో విడుతలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్లో కళాశాల ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

హాలియా కళాశాలకు స్పందన బాగుంది
సీఎం కేసీఆర్ సార్ హామీ మేరకు హాలియాలో ఏర్పాటు చేసిన నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు విద్యార్థుల స్పందన బాగున్నది. తొలి విడుతలో 119మంది విద్యార్థ్థులు చేరారు. రెండు, మూడో విడుత నాటికి నూరుశాతం అడ్మిషన్లు పూర్తయ్యే అవకాశాలున్నాయి. అన్ని వసతులు కల్పించే ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవడం బెటర్.
ఉమెన్స్ కాలేజీలో సీటు రావడం సంతోషంగా ఉంది
నల్లగొండలోని మహిళా డిగ్రీ కళాశాలలో సీటు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను కోరుకున్నట్లుగానే ఎంఈసీఎస్ సీటు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మంచి అధ్యాపక బృందంతో పాటు ల్యాబ్స్, 45వేల పుస్తకాలతో డిజిటల్ లైబ్రరీ చాలా బాగుంది. చక్కటి వాతావరణం, భవిష్యత్ బాగుంటుందని మా సీనియర్స్ చెప్పడంతో ఉమెన్స్ కాలేజీని ఎంచుకున్నా.