
ఇటీవల కురిసిన వర్షాలతో రైతులకు ఊరట
పంటల సస్యరక్షణ చర్యల్లో హలధారులు
చింతలపాలెం, ఆగస్టు 22 : నెల రోజులుగా వర్షం లేక వాడుబట్టిన పత్తి చేలకు ఇటీవల కురిసిన వర్షం ప్రాణం పోసింది. మిర్చి నారుకు ఈ ముసురు ఎంతో మేలు చేసింది. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో మెట్ట పంటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
తగ్గిన పత్తి.. పెరిగిన మిర్చి సాగు..
గత సంవత్సరం సుమారు 14వేల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. వర్షాలు ఎక్కువగా కురువడంతో ఆశించిన దిగుబడి రాలేదు. ఈ ఏడాది సుమారు 9 వేల ఎకరాల్లో మాత్రమే పత్తిని సాగు చేశారు. అలాగే గత సంవత్సరం మిర్చి పంట 6 వేల ఎకరాల్లో వేయగా, ఈ సంవత్సరం సుమారు 12వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉంది. ఇందుకు ప్రధాన కారణం పత్తి కంటే మిర్చికి ధర ఎక్కువగా ఉండటమే.
పత్తి, మిర్చిలో రక్షణ చర్యలు..
ఇటీవల కురిసిన వర్షాలతో పంటలు ఏపుగా పెరిగి ఆశాజనకంగా ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షం ఎక్కువగా కురిస్తే మిర్చి విత్తనాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నందున వాటి రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. మిర్చి నారును పిచ్చుకలు, ఇతర పక్షులు తినకుండా వలలు, చీరెలు, గ్రీన్షేడ్ వంటివి రక్షణగా ఏర్పాటు చేసుకున్నారు. 12వేల ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు నారు మడులను సిద్ధం చేసుకున్నారు. అలాగే పత్తిచేలల్లో నీరు నిల్వ లేకుండా చూసుకుంటున్నారు. మిర్చి నారులో నీరు నిలిస్తే కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నారుమడుల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. మిర్చి నారు 45 రోజులపాటు పెంచుతారు. సుమారు 12 నుంచి 18 ఇంచుల వరకు ఎదిగిన తర్వాతనే నాటాల్సి ఉంటుంది.
అనుకూలంగా వర్షాలు..
మూడ్రోజులపాటు కురిసిన వర్షాలతో పత్తిచేలు, మిర్చి నారు బాగా ఎదిగాయి. అనుకూలంగా వర్షాలు పడుతుండడంతో ఈసారి పంటలు సమృద్ధిగా పండే అవకాశం ఉంది. ఇలాగే మరో రెండు నెలలపాటు వర్షాలు అనుకూలంగా కురిస్తే రైతులందరికీ లాభం చేకూరనున్నది.
నీరు నిల్వ లేకుండా చూడాలి..
పత్తి, మిర్చి సాగు చేసే భూముల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ప్రభుత్వం గుర్తించిన విత్తనాలనే వాడాలి. కొనుగోలు చేసిన విత్తనాలకు రసీదు తీసుకోవాలి. నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే ఆశించిన పంట చేతికి వస్తుంది.