
నీలగిరి, అక్టోబర్ 19 : శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అను నిత్యం పోరాడుతున్నారు. మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే అది పోలీసులు అప్రమత్తంగా ఉండడం వల్లే. ఉగ్రవాదం, తీవ్రవాదం, అసాంఘిక శక్తుల నుంచి ప్రజలను కాపాడేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. అందుకే పోలీస్ శాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సంఘవ్యతిరేక శక్తులతో పోరాడుతూ కొందరు పోలీసులు అసువులు బాసారు. అలాంటి అమరుల త్యాగాలు మరువలేనివి. వారిని స్మరించుకునేందుకు ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం ( పోలీస్ ఫ్లాగ్ డే) నిర్వహిస్తున్నారు.
కార్యక్రమ నిర్వహణ ఇలా..
పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను గతేడాది నుంచి ఫ్లాగ్‌డేగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 15 నుంచి 21 వరకు జరిగే వారోత్సవాలను ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 31 వరకు నిర్వహించేలా మార్పు చేశారు. ఫ్లాగ్‌డే సందర్భంగా ఈ నెల 21న జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో పరేడ్, 22న ఆన్లైన్లో ఓపెన్ హౌజ్‌తో పాటు 21 నుంచి 28 వరకు పాఠశాల, కళాశాలల విద్యార్థులకు ‘జాతి నిర్మాణంలో తెలంగాణ పోలీసుల పాత్ర’ అనే అంశంపై ఆన్లైన్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. ఆసక్తిగల వారు https://forms.gle/uJj58xXN1GQPNjp8A లింక్ ద్వారా తమ వ్యాసాలను పంపాల్సి ఉంటుంది. 22 నుంచి 25 వరకు విధి నిర్వహణలో గాయపడిన, మృతిచెందిన పోలీసుల కుటుంబాల ఇండ్లకు వెళ్లి వారిని పరామర్శించడం, 27న రక్తదాన శిబిరాలు, 28న పోలీస్ సిబ్బంది గ్రామాల్లో పర్యటించి సమస్యలు గుర్తించి పరిష్కరిస్తారు.
షార్ట్ ఫిల్మ్‌లకు ఆహ్వానం
అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నారు. ఆసక్తి గల వారు మూడు నిమిషాల పాటు పోలీసుల సేవలు, త్యాగాలు కనిపించేలా తాజాగా రూపొందించిన చిత్రాలు, ఫొటోలను రాష్ట్ర పోలీసు వెబ్సైట్ లేదా నల్లగొండ జిల్లా వెబ్సైట్లో ఈ నెల 30వ తేదీలోగా అప్లోడ్ చేయాలని పోలీసు అధికారులు సూచించారు.
అమరుల కుటుంబాలకు అండగా..
పోలీస్ అమరులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. అమరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించారు. వారికి రావాల్సిన అన్ని బెనిఫిట్స్‌ను వెంటనే అందించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 29 మంది పోలీసులు అమరులు కాగా అందులో నల్లగొండ జిల్లా వారు 13 మంది ఉన్నారు. 1991 నుంచి ఇప్పటి వరకు విధి నిర్వహణలో అసువులు బాసిన వారిలో నలుగురు ఎస్ఐలు, ఒక ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్, ఐదుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు, 11 మంది సివిల్ కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో 29 మంది అమరులు
1994 ఆగస్టు 1న దామరచర్ల మండలం అడవిదేవులపల్లిలో పోలీసు అవుట్‌పోస్టుపై మావోయిస్టులు దాడి చేసి ఎస్ఐ, కానిస్టేబుళ్లను హత మార్చారు. 1996లో తుర్కపల్లి, 1997లో డిండి, 1998లో గుట్ట, 1999లో బొమ్మలరామారం, 2000లో తిరుమలగిరి పోలీస్స్టేషన్లపై నక్సల్స్దాడి చేయగా.. గుట్టలో ఇద్దరు , తిరుమలగిరిలో ఇద్దరు సిబ్బంది మృతి చెందారు. 2000 జూలై 7న వరంగల్ జిల్లాకు చెందిన వార్దళాలు తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఇద్దరు కానిస్టేబుళ్లను చంపేశారు. 2001లో నారాయణపురం హోటల్లో టీ తాగుతున్న కానిస్టేబుల్ ప్రసాద్‌ను నక్సలైట్లు కాల్చి చంపారు. 2001 ఆగస్టులో మర్రిగూడ కానిస్టేబుల్ కిష్టారావు జాతర బందోబస్తులోఉండగా నక్సలైట్లు హతమార్చారు. 2003 జూన్ 16న మేళ్లచెర్వు మండలం నెమలిపురి శివారులో జరిగిన కాల్పుల్లో ఆర్ఎస్ఐ గంగారాం, శంకర్‌నాయక్, చెన్నకేశవులు మృతి చెందారు. 2005లో చౌటుప్పల్ వద్ద పెట్రోలింగ్‌లో ఉన్న సిబ్బందిపై మావోయిస్టులు దాడి చేసి ముగ్గురు కానిస్టేబుళ్లను హతమార్చారు. 2008లో ఆత్మకూర్ఎం పోలీస్‌స్టేషన్‌పై మావోయిస్టులు దాడి చేసి ఎస్ఐ చాంద్‌పాషా, హోంగార్డు లింగయ్యను చంపారు. 2015లో సిమి ఉగ్రవాదుల దాడిలో ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డు ప్రాణాలు వదిలారు. 2015 మార్చి 31న సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో ఇద్దరిని విచారిస్తుండగా వారు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేశ్ చనిపోగా ఇన్స్పెక్టర్ మొగిలయ్యకు గాయాలయ్యా యి. ఆత్మకూర్ ఎస్ఐ సిద్ధయ్య, కానిస్టేబుల్ వారిని పట్టుకోవడానికి యత్నించగా ఉగ్రవాదులు కాల్చి చంపారు.
ఇదీ నేపథ్యం
1959 అక్టోబర్ 21న దేశ సరిహద్దు లడక్ సమీపంలోని హాటిస్ప్రింగ్స్గా గుర్తింపు పొందిన అక్వాచింగ్ సమీపంలో చైనా బలగాలు దాడి చేశాయి. ఆ సమయంలో సరిహద్దులో కాపలాగా ఉన్న 10 మంది జవాన్లు తమకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న చైనా సైనికులతో వీరోచితంగా పోరాడారు. ఈ యుద్ధంలో 10 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణా లు వదిలారు. వీరి త్యాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకొంటున్నారు.
ఫ్లాగ్ డేకు ఏర్పాట్లు పూర్తి
ఈ నెల 21 నుంచి పది రోజుల పాటు పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశాం. నల్లగొండ జిల్లాలో జరిగే కార్యక్రమాలను అదనపు ఎస్పీ నర్మద పర్యవేక్షిస్తారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులకు ఆన్లైన్లో వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తాం. ఉత్తమ వ్యాసాన్ని రాష్ట్ర పోలీస్ అధికారిక ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాం.
-ఏవీ రంగనాథ్, నల్లగొండ జిల్లా ఎస్పీ