
రామగిరి, అక్టోబర్ 19 : కొవిడ్ నేపథ్యంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలోకి ప్రమోట్ చేయబడిన విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నెల 25 నుంచి నవంబర్ 3వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2020-21విద్యా సంవత్సరం(ప్రథమ సంవత్సరం) విద్యార్థులకు పరీక్షల నిర్వహణ కోసం ఆ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరిగే పరీక్షలకు నిర్ణీత సమయం కంటే నిమిషం ఆలస్యమైనా పరీక్షల హాల్లోకి అనుమతి ఉండదు. అదేవిధంగా పరీక్ష రాసే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
27,371 మంది విద్యార్థులు..
పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల నుంచి 27,371 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 146 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పరీక్షల నోడల్ అధికారి సంజీవ పర్యవేక్షణలో బెంచీకి ఒక్క విద్యార్థి మాత్రమే ఉండేలా ప్రణాళికలు చేశారు. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో డీఐఈఓ, పరీక్షల జిల్లా నోడల్ అధికారి దస్రూ పర్యవేక్షణలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రతి బెంచీకి ఇద్దరు చొప్పున ఏర్పాట్లు చేశారు. ఇదే విధానాన్ని సూర్యాపేటలో డీఐఈఓ జె.కృష్ణయ్య పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు.
థర్మల్ స్క్రీనింగ్ చేశాకే అనుమతి..
అన్ని పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్, చేతులకు శానిటైజేషన్నే చేశాకే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. ఎవ్వరికైనా జ్వరం, దగ్గు, జలుబు తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరీక్ష హాల్‌కి పంపించి పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా ప్రతి విద్యార్థి విధిగా మాస్క్ ధరించడంతోపాటు శానిటైజర్, వాటర్ బాటిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పరీక్ష కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించాలి. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.
పర్యవేక్షణకు స్కాడ్ బృందాలు
పరీక్షల విధుల్లో డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ అధికారులతోపాటు పర్యవేక్షణ కోసం స్కాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. డీఈసీ(డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ)సభ్యులతోపాటు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీ చేయనున్నాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాట్లు పూర్తి
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతి విద్యార్థి భౌతిక దూరం పాటించేలా గదిలో 20మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నాం. అన్ని సెంటర్లలో ప్రతిరోజూ శానిటైజేషన్ చేయడంతోపాటు విద్యార్థులకు శానిటైజర్ అందుబాటులో ఉంచుతున్నాం. నిర్ణీత సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. కాబట్టి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలి. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించి, శానిటైజర్, వాటర్‌బాటిల్ వెంట తెచ్చుకోవాలి.
జిల్లా వారీగా విద్యార్థులు, కేంద్రాలు
జిల్లా విద్యార్థులు కేంద్రాలు
నల్లగొండ 16,854 58
సూర్యాపేట 9,765 44
యాదాద్రి 7,523 44
మొత్తం 27,371 146