
ఆ గ్రామం గతంలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. ఊళ్లో ఎటుచూసినా సమస్యలే. అలా కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న గ్రామం కాస్తా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ‘పల్లె ప్రగతి’ పుణ్యాన అభివృద్ధిని చవిచూసింది. మునుగోడు మండలంలోని ఇప్పర్తి గ్రామం ప్రగతి పనుల్లో ఆదర్శంగా నిలిచింది.
ఇప్పర్తి గ్రామ పంచాయతీ మండల కేంద్రానికి సుమారు 12కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామ జనాభా 1,452 కాగా.. 408 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గతంలో గ్రామంలో శ్మశానవాటిక లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా రూ.12.6లక్షలతో సర్వే నంబర్ 135లో అర ఎకరం విస్తీర్ణంలో సకల వసతులతో కూడిన వైకుంఠ ధామాన్ని నిర్మించారు. ఇందులో రెండు బర్నింగ్ పాయింట్లు, దింపుడు కల్లాలు, స్నానాల గదులు, పూజ గది, ఆఫీస్ రూం ఏర్పాటు చేశారు.
వెల్లివిరిసిన పచ్చదనం
హరితహారం, పల్లె ప్రగతిలో భాగంగా నాటిన మొక్కలతో గ్రామంలో పచ్చదనం వెల్లివిరిసింది. ఎవెన్యూ ప్లాంటేషన్ ద్వారా రోడ్లకు ఇరువైపులా 1,896 మొక్కలు నాటారు. కమ్యూనిటీ ప్లాంటేషన్ కింద 200మొక్కలు నాటారు. గ్రామస్తులు ఇంటి ఆవరణల్లో నాటేందుకు ఇప్పటి వరకు 7,344మొక్కలు అందజేశారు. దీంతో పాటు సర్వే నంబర్ 135లో 20 గుంటల విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో వేప, రావి, కోనోకార్పస్, బగోడా, బాదం, కానుగ, మహాగని, మామిడి, చెర్రి, సీతాఫలం, నందివర్ధనం, నూరువరహాలు, అల్లనేరేడు, చామంతి, కాగితం పూలు, మద్ది, జామ సహా 23రకాల మొక్కలు నాటారు. పంచాయతీ ట్యాంకర్ ద్వారా ఎప్పటికప్పుడు నీళ్లు పోసి సంరక్షిస్తున్నారు.
సమస్యలకు పరిష్కారం..
పల్లె ప్రగతి మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామంలో సమస్యలను గుర్తించి పరిష్కరించుకున్నారు. మురుగు నీటి సమస్య ఉన్న ప్రాంతంలో రూ.2లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మించారు. గ్రామంలో నూతనంగా 219 ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. శిథిలావస్థలో ఉన్న 90 విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి అమర్చారు. జనావాసాల్లో పడావుపడ్డ ఇళ్లు, గోడలను కూల్చివేశారు.
పరిశుభ్రతకు పెద్దపీట
పల్లె ప్రగతి ద్వారా గ్రామంలో పరిసరాలు పరిశుభ్రంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పర్తి పంచాయతీకి రూ.5.22లక్షలతో ట్రాక్టర్, రూ.1.84లక్షలతో ట్రాలీ, రూ.1.84 లక్షలతో ట్యాంకర్‌ను సమకూర్చింది. ట్రాక్టర్ ద్వారా పంచాయతీ సిబ్బంది రోజూ ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. ఇందులో తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారు. దీంతో కంపోస్టు షెడ్డులో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. ఇలా మొదటి విడుతలో తయారైన వంద కిలోల ఎరువును గ్రామంలో హరితహారం మొక్కలకు వేశారు. పనికిరాని చెత్తను వేసేందుకు సర్వే నంబర్ 48లో రూ.2.5లక్షలతో డంపింగ్‌యార్డ్ ఏర్పాటు చేశారు.
పల్లె ప్రగతి స్ఫూర్తిని కొనసాగిస్తాం..
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన పల్లె ప్రగతి ద్వారా ఇప్పర్తి గ్రామం ఎంతో మెరుగుపడింది. గ్రామంలో చెత్త, వీధి దీపాలు, విద్యుత్ స్తంభాలు, మురుగుకాల్వ, పచ్చదనం.. ఇలా ఎన్నో సమస్యలను గ్రామసభ ద్వారా గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించుకున్నాం. పల్లె ప్రగతి స్ఫూర్తిని ఇలాగే కొనసాగించి గ్రామాన్ని అన్ని రంగాల్లో మేటిగా మార్చేలా పనిచేస్తాం.
టీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి..
టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాల రూపురేఖలు మారాయి. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మా గ్రామాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకున్నాం. పల్లె ప్రకృతి వనం, హరితహారం మొక్కలతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది.