
ఫిర్యాదు కోసం డయల్ 100తో అనుసంధానం
ఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా నగదు బదిలీ నిలిపే అవకాశం
ఎస్పీ ఏవీ రంగనాథ్
సీజ్ చేసిన వాహనాల క్లియరెన్స్‌లో నిబంధనలు పాటించాలి
నల్లగొండ సిటీ, ఆగస్ట్ 19 : సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ. రంగనాథ్ తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు, స్టేషన్ రైటర్లు, సీసీటీఎన్ఎస్ ఆపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. సైబరు క్రైం కేసులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా బాధితులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. దీనిపై అవగాహన లేని వారు టోల్‌ఫ్రీ నంబర్ 155260కు ఫోన్ చేసి వివరాలు చెబితే పోలీసు సిబ్బంది ncrp portalలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ఫిర్యాదు నమోదైన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ ద్వారా సైబర్ క్రైమ్‌కు సంబంధించిన నగదు బదిలీని నిలిపి వేసి బాధితులు నష్టపోకుండా నివారించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓటీపీల పేరుతో ఓఎల్ఎక్స్, ఫేస్బుక్ నకిలీ ఐడీల రూపంలో మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు పంపి ఆలింక్ క్లిక్ చేయడం, క్యూఆర్‌కోడ్ స్కానింగ్ చేయడం, మల్టీ లెవల్ మార్కెటింగ్ ఉద్యోగాల కల్పన పేరుతో జరుగుతున్న మోసాల నేపథ్యంలో వాటిని మల్టీ లెవల్ మార్కెటింగ్ ఉద్యోగాల కల్పన పేరుతో మోసాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి నేరాలను నివారణకు కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. డీఐజీ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న సీజ్ చేసిన వాహనాలను క్లియర్ చేయడంలో నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఇక నుంచి జిల్లాలో ప్రతి శనివారం అన్ని పోలీస్‌స్టేషన్‌లోని సిబ్బందికి ఆధునిక సాంకేతిక అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ నర్మద, డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి, ఆనందరెడ్డి, వెంకటేశ్వర్రావు, మొగిలయ్య, సీఐలు గోపీ, పీఎన్డీ ప్రసాద్ శంకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు.