
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సర్కారు గ్రీన్ సిగ్నల్
2020-21 యూడైస్ ఆధారంగా వివరాల సేకరణ
19మంది పిల్లల కంటే తక్కువ ఉంటే మార్పు
ఉమ్మడి నల్లగొండలో 11, 971 ఉపాధ్యాయులు
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి జీఓ 25 విడుదల చేసింది. 2015లో ఈ ప్రక్రియ జరుగగా సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ చేపడుతున్నారు. 19 మంది విద్యార్థుల కంటే తక్కువ సంఖ్య ఉన్న పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు సమీప పాఠశాలలకు సర్దుబాటు కానున్నారు. 2020-21 యూడైస్‌లో నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రక్రియ నిర్వహించాలని విద్యాశాఖ వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలో 11, 971 ఉపాధ్యాయులు ఉండగా డీఈఓల పర్యవేక్షణలో నివేదికలను సిద్ధం చేస్తున్నారు. మరో పది రోజుల్లో పూర్తి చేయనున్నారు. దీని వల్ల ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే అవకాశం ఉంది.
రామగిరి, ఆగస్టు 18 : రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉపాధ్యాయులకు 2015 జూన్‌లో బదిలీల కోసం జీఓ విడుదల చేయగా అదే సందర్భంలో టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియను సైతం నిర్వహిస్తూ బదిలీలు చేశారు.సుదీర్ఘకాలం తర్వాత విద్యార్థుల సంఖ్య ఆధారంగా హేతుబద్ధ్దీకరణ(రేషనలైజేషన్)కు శ్రీకారం చుట్టడంతో విద్యార్థుల సంఖ్య 19 మంది కంటే తక్కువ ఉన్న పాఠశాలల ఉపాధ్యాయుల్లో గుబులు మొదలైంది. విద్యాశాఖ ఆదేశాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖాధికారులు వివరాల నమోదు బిజీబిజీ ఉంటూ ఎంఈఓలు, సీఆర్పీల ద్వారా సమాచారం సేకరణలో నిమగ్నం కావడం వి శేషం. రేషన్లైజేషన్ ముగిస్తేనే ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు అధికంగా ఉన్నాయి..ఎక్కడ ఖాళీలు అధికంగా ఉన్నాయనేది లెక్క తేలుతుంది.
2015 తర్వాత మళ్లీ ప్రక్రియ.
2015లో నిర్వహించిన రేషనలైజేషన్ (హేతుబద్ధ్దీకరణ) తర్వాత ప్రభుత్వం, విద్యాశాఖ జీఓ విడుదల చేసింది. ప్రభుత్వ, జడ్పీ, మండల పరిషత్ పాఠశాలల వారీగా 2020-21 యూ-డైస్లో నమోదైన విద్యార్థుల వివరాల ఆధారంగానే ప్రస్తుత ప్రక్రియ నిర్వహించనున్నారు. జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలల్లోని ఉపాధ్యాయులతోపాటు 19 మంది కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలు సైతం సమీపంలోని పాఠశాలలకు సర్ద్దుబాటు కానున్నాయి. నల్లగొండ జిల్లాలోని 31మండలాల్లో సుమారుగా 110కి పైగా జీరో విద్యార్థులున్న పాఠశాలలు ఉన్నట్లు విద్యాశాఖాధికారుల నివేదిక ప్రక్రియ ఆధారంగా తెలుస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో 11,971మంది ఉపాధ్యాయులు
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 11,971 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.( నల్లగొండ జిల్లాలో 5,388, సూర్యాపేట 3,680, యాదాద్రి-భువనగిరి 2,903)వీరిలో 5,870మంది ఎస్జీటీ (నల్లగొండ 2,690, సూర్యాపేట 1,875, యాదాద్రి 1,305) ఉపాధ్యాయులున్నారు. మిగిలిన వారు జీహెచ్ఎం, ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎం, లాంగ్వేజీ పండిట్స్, స్కూల్ అసిస్టెంట్స్, పీఈటీలు ఉన్నారు. ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగానే ఉపాధ్యాయుల పోస్టులు మిగులుతాయి. విద్యార్థుల సంఖ్య లేని పాఠశాల్లో పోస్టులు తగ్గుతాయి. ఆ ఉపాధ్యాయులంతా దాదాపుగా రేషనలైజేషన్ ప్రక్రియలోకి వస్తారనేది విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యా యుల్లో చర్చగా జరుగుతున్నట్లు సమాచారం.
వివరాల సేకరణలో అధికారులు
విద్యాశాఖ విడుదల చేసిన జీఓ 25 ఆధారంగా 2020-21 యూ-డైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ఫార్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) వివరాలు సేకరణలో డీఈఓలు బిజీబిజీగా మారారు. అయితే అందుకు సంబంధించి పూర్తి వివరాలను నమోదు చేసి జిల్లా కమిటీకి అందజేయనున్నారు. కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, సభ్యులుగా అదనపు కలెక్టర్(లోకల్‌బాడీ), జడ్పీ సీఈఓ, పీఓ ఐటీడీఏ, మెంబర్ కమ్ సెక్రటరీగా డీఈఓ వ్యవహరిస్తారు. ఈ నివేదికలు అందిన వెంటనే సర్దుబాటులు ఎలా నిర్వహించాలనేది రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలో డీఈఓలు నిర్వహిస్తారు.