
ఎస్పీ రంగనాథ్
మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 18 : ఆకతాయిల ఆట కట్టించి మహిళలు, యువతులు, విద్యార్థులను రక్షించేందుకే షీటీం ఏర్పాటైందని, ప్రజలు టీం సభ్యులపై నమ్మకముంచి ఆకతాయిల సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ రంగనాథ్ అన్నారు. బుధవారం మిర్యాలగూడలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన షీటీం కార్యాలయాన్ని ఎస్పీ ప్రారంభించారు. అనంతరం క్యూఆర్ కోడ్ స్కాన్ పోస్టర్‌ను ఏఎస్పీ నర్మద, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్రావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో వ్యాపార కేంద్రంగా ఉన్న మిర్యాలగూడలో షీటీం సెల్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలీసులకు సమాచారం ఇచ్చే మహిళల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. త్వరలో దేవరకొండలో కూడా షీటీం సెల్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సత్వర సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రజలు వీరి సేవలను వినియోగించుకోవాలని కోరారు. ప్రజలు తమ సమస్యలను 100కు గానీ, పోస్టర్లో ఉన్న క్యూఆర్ కోడ్‌కు స్కాన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో షీటీం సీఐ రాజశేఖర్‌గౌడ్, టూటౌన్ సీఐ నిగిడాల సురేశ్, రూరల్ సీఐ ముత్తినేని సత్యనారాయణ, ఎస్ఐలు సర్ధార్‌నాయక్, అంతిరెడ్డి పాల్గొన్నారు.