
నీలగిరి, సెప్టెంబర్ 17 : లైంగిక వేధింపుల నుంచి బాలికలను రక్షించడానికి పోలీస్ శాఖ అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో)ద్వారా నిందితులను కఠినంగా శిక్షిస్తుండగా 2013 సంవత్సరం నుంచి ఈ ఏడాది వరకు 611 కేసులు నమోదయ్యాయి. పోక్సో కేసులను విచారించి సత్వర న్యాయం జరిగేలా పోలీసు యంత్రాంగం కృషి చేస్తున్నది. ఈ మేరకు చిన్నారులకు, బాలికలకు అవగాహన సదస్సులు, శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.
క్షణికావేశం, మద్యం మత్తులో..
క్షణికావేశం, మద్యం మత్తులో లైంగిక దాడులు జరుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. వారిపై టెక్నాలజీ, సెల్ఫోన్లు, ట్యాబ్‌లు, సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుం ది. జిల్లాలో గడిచిన తొమ్మిదేండ్లలో 611 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 81 కేసులు నమోదయ్యాయి.
అందుబాటులో సహాయ కేంద్రాలు…
జిల్లాలో చిన్నారులె, బాలికలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయక కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో సఖీ కేంద్రం, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేకంగా మహిళల కోసం పోలీస్ శాఖ అనేక కార్యక్రమాలను చేపడుతున్నది. మహిళలు, యువతులు, బాలికలపై లైంగిక దాడులు జరుగకుండా అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. డయల్ 100, వాట్సాప్ ద్వారా ఫిర్యాదు అందిన వెంటనే స్పందిస్తున్నారు. ఫిర్యాదు చేయడం కోసం ప్రత్యేకంగా 1098 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేశారు.
పిల్లల్ని ఒంటరిగా వదలొద్దు..
తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలి. జరుగుతున్న నేరాలను పరిశీలిస్తే బాలికలు ఒంటరిగా ఉండడం, తెలిసిన వారే అఘాయిత్యాలకు పాల్పడడం గమనించవచ్చు. పిల్లలను ఒంటరిగా వదలకుండా ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
పిల్లల ప్రవర్తనలో సడెన్‌గా మార్పులు వస్తే తేడాను గమనించి కారణాలను తెలుసుకోవాలి. పిల్లలను పాఠశాల, కళాశాలలకు పంపినప్పుడు వాళ్లు అక్కడికి చేరుకున్నారో లేదో విచారించుకోవాలి.
మగ పిల్లలు అయితే తోటి పిల్లలు ముఖ్యంగా తమ చుట్టూ ఉన్న మహిళలు, బాలికలను ఏవిధంగా గౌరవించాలో తెలియజేయాలి. పిల్లల సున్నితమైన శరీర భాగాలను ఎవరైనా తాకడానికి ప్రయత్నిస్తే ఎలా ప్రవర్తించాలో వివరించాలి. ఆడపిల్లలకు అత్మరక్షణ కోసం కరాటే కుంగ్‌ఫూ వంటివి నేర్పించాలి.
పిల్లలతో నిత్యం కొంత సమయం గడుపుతూ వారు చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చట్టాల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి చైతన్యం చేయాలి. చట్టాల అమలుతో పాటు వాటిపై ప్రజలకు మరింత అవగాహన అవసరం.
అండగా పోక్సో చట్టం..
బాలలపై జరిగే లైంగిక వేధింపులు, దాడులు నివారించడం, అశ్లీల చిత్రాల కోసం పిల్లల్ని ఉపయోగించడం వంటి నేరాల నుంచి బాలలను రక్షించేందుకు లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో చట్టాన్ని) 2012లో ఏర్పాటు చేశారు.
ఆప్రకారం నేరానికి శిక్షలు ఇలా…
లైంగిక దాడి : ఏడేండ్లు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు
దారుణమైన లైంగిక దాడి : పదేండ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదుతోపాటు జరిమానా
లైంగిక దాడికి యత్నం : 3-5ఏండ్ల కఠిన కారాగార జైలు శిక్ష, జరిమానా
లైంగిక వేధింపులు: మూడేండ్ల జైలు శిక్ష, జరిమానా, బాలలను అశ్లీల కార్యకలాపాలకు ఉపయోగిస్తే ఐదేండ్ల జైలు శిక్ష పడుతుంది.
పిల్లలపై దృష్టి పెట్టాలి..
పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారిపై దృష్టి పెట్టాలి. పాఠశాలల్లో, ఇతర బంధువుల ఇండ్లలో కానీ, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు వారి పట్ల ప్రేమతో ఉంటే వారు జరిగే విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటారు. తలిదండ్రులు అంటే భయం ఉంటే ఏదైనా సంఘటన జరిగితే చెప్పడానికి భయపడుతారు. చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని చిన్నారులు తల్లిదండ్రులతో పంచుకునే వాతావరణాన్ని కల్పించాలి. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో పిల్లలు పక్కదారి పడుతున్నారు. ఒంటరిగా కాకుండా గ్రూపులుగా ఉంచాలి.