
నీలగిరి, ఆగస్టు 17 : ఏడాది లోపు చిన్నారుల్లో న్యుమోనియాను అరికట్టేందుకు ప్రత్యేక టీకాను బుధవారం నుంచి అందించనున్నారు. సుమారు రూ.4వేల విలువైన న్యుమోకొకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ను అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో జిల్లా వైద్యారోగ్యశాఖ యంత్రాంగం ఉచితంగా అందించనున్నది. ఈ మేరకు ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలకు ప్రత్యేకంగా శిక్షణ పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 29వేల మంది చిన్నారులను గుర్తించి వారికి మొదటి డోసు ఇవ్వనున్నారు. ప్రతి చిన్నారికి టీకాను మూడు దశల్లో 0.5ఎంఎల్ చొప్పున వేస్తారు. తొలి డోసును శిశువు పుట్టిన ఆరు వారాల వయస్సులో, రెండో డోసును 14వారాల వయస్సులో, మూడో డోసును 9నెలల సమయంలో వేస్తారు. మొదటి డోసు వేయకుండా రెండో, మూడో డోసు వేసేందుకు అవకాశం లేకపోవడంతో ఆరు వారాల చిన్నారులకు మొదటి డోసు వేసేలా ప్రణాళికలు తయారు చేశారు.
న్యుమోనియా మరణాలను అరికట్టే దిశగా జాతీయ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో పీసీవీ న్యుమోకొకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ చేర్చారు. జాతీయ సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా అన్ని పీహెచ్సీ, యుహెచ్సీలో వ్యాక్సిన్ అందించేలా ఏర్పాట్లు చేశాం. జిల్లాకు సరిపడా డోసులు వచ్చాయి. వాటిని అన్ని పీహెచ్సీ, యూహెచ్సీలకు సరఫరా చేశాం.