
దేవరకొండ/పెద్దఅడిశర్లపల్లి, ఆగస్టు 16 : హరితహారం, పల్లె ప్రగతిలో నాటి న మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హెచ్చరించారు. పీఏపల్లి మండలంలోని అంగడిపేట, చిలకమర్రి, ఘాట్ నెమలిపురం గ్రామాల్లో కోదాడ-జడ్చర్ల జాతీ య రహదారి వెంట నాటిన మొక్కలను సోమవారం ఆయన పరిశీలించారు. ప్రతి కిలోమీటర్‌కు ఒక వాచర్‌ను నియమించి చనిపోయిన మొక్కల స్థానంలో తిరిగి నాటాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ గోపీరామ్, ఎంపీడీఓ యాదగిరి, ఎంపీఓ మోహన్‌రెడ్డి ఉన్నారు. కొండమల్లేపల్లి మండలంలోని చిన్నఅడిశర్లపల్లి, గుమ్మడవెళ్లి గ్రామాల్లో రహదారి వెంట నాటిన మొక్కలను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. ఎండిపోయిన వాటి స్థానంలో తిరిగి మొక్కలు నాటాలని సూచించారు. ఎంపీడీఓ బాలరాజురెడ్డి ఉన్నారు.
హాలియా/పెద్దవూర : హాలియా మున్సిపాలిటీ పరిధిలోని రోడ్ల వెంట, పెద్దవూర మండలంలోని పోతునూరు స్టేజీ నుంచి పెద్దగూడెం వరకు నాటిన మొక్కలను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. ఆయన వెంట డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీడీఓలు లక్ష్మి, దుబ్బ శ్యామ్, ఎంపీఓలు భిక్షంరాజు, విజయ కుమారి, సర్పంచులు తుమ్మ దుర్గమ్మ, చామకూరి చిన్న లింగారెడ్డి, కూన్‌రెడ్డి మల్లారెడ్డి ఉన్నారు.
నీలగిరి : ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి పట్టణంలోని గంధంవారి గూడెం పరిధిలోని మొగుళ్ల చెరువు (8,9,11, 25వార్డులు) ప్రాంతంలో ఉన్న 50 ఇండ్లు నీట మునిగాయి. టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు, 8వ వార్డు కౌన్సిలర్ పిల్లి రామరాజు సోమవారం ఈ విషయాన్ని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించడంతో పాటు ఆయనతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. చెరువు వెనుకభాగంలో వేసిన కట్టను తొలగించి నీరు కిందికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఈఈ బుచ్చిరెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. నీరు వెళ్లే సందర్భంలో అక్కడ ఉన్న పంట పొలాలు దెబ్బతినే అవకాశం ఉండడంతో సంబంధిత రైతులకు పరిహారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సమస్య పునరావృతం కాకుండా శాశ్వత ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వారి వెంట మున్సిపల్ డీఈ వెంకన్న, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు పిల్లి రామరాజు, ఆంబోతు ప్రదీప్, చిన్నాల అలివేలు ఉన్నారు.