
నీలగిరి, ఆగస్టు 16 : రోజూ మద్యం తాగి వచ్చి గొడవ చేసి పరువు తీస్తున్నాడని, దీంతో తనకు పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఓ యువకుడు తన తండ్రిని హతమార్చాడు. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని చర్లపల్లిలో ఈ నెల 12న ఈ ఘాతుకానికి పాల్పడగా.. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. చర్లపల్లి గ్రామానికి చెందిన మందడి బుచ్చిరెడ్డికి ఇద్దరు కూమారులు. పెద్ద కొడుకు వివాహం కాగా, భార్యతో కలిసి వేరుగా ఉంటున్నాడు. రెండో కుమారుడు నరేశ్‌రెడ్డి తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. బుచ్చిరెడ్డి ప్రతిరోజూ మద్యం తాగి ఇంట్లో గొడవ చేసేవాడు. అది ఊర్లో వాళ్లకు తెలిసి పరువు పోతుందని, దీంతో తనకు పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తండ్రిపై విసుగు చెందాడు. తనకు పెండ్లి కాకపోవడానికి తన తండ్రే ప్రధాన కారణమని నరేశ్‌రెడ్డి కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 12న రాత్రి 7:30 గంటలకు తాగి వచ్చిన తండ్రితో గొడవ పడ్డాడు. క్షణికావేశంలో విరిగిన కుర్చితో కొట్టి తీవ్రంగా గాయపర్చాడు. నల్లగొండ పట్టణంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా, ఆదే రోజు రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య సునంద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నరేశ్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా, కావాలనే చంపినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో నల్లగొండ వన్‌టౌన్, టూటౌన్ సీఐలు చంద్రశేఖర్‌రెడ్డి, బాలగోపాల్, ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.