
దళితవాడ తీరు మారి.. ధనిక వాడ కావాలే.. దళితోద్ధరణలో దేశానికి తెలంగాణ వేగుచుక్క కావాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ వేదికగా ప్రారంభించిన దళితబంధు పథకంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. దీనిపైనే దళితవాడల్లో ప్రధాన చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలోని వాసాలమర్రి నుంచే తొట్టతొలిగా
దళితబంధుకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ సోమవారం హుజూరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా అమలు చేస్తామని ప్రకటించారు. ఈ పథకం ప్రారంభంలో భాగస్వాములయ్యేందుకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్దసంఖ్యలో దళిత ప్రజాప్రతినిధులు, మేధావులు, పలు రంగాల ప్రముఖులు హుజూరాబాద్‌కు తరలివెళ్లారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు జెండా ఊపగా ప్రత్యేక వాహనాల్లో ఉదయం బయలుదేరి మధ్యాహ్నానికి సభకు చేరుకున్నారు. జిల్లా నుంచి పలువురు ఎమ్మెల్యేలు స్వయంగా సభలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. దళిత బంధు పథకం ప్రారంభంపై జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేశారు.
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని దళితజాతి ఉద్ధరణే లక్ష్యంగా రూపుదిద్దుకున్న దళితబంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని దళిత ప్రజాప్రతినిధులు, మేథావులు, పలురంగాల్లోని ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఉదయాన్నే ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి మధ్యాహ్నం సభా సమయానికి అక్కడికి చేరుకున్నారు. దళితజాతి అభ్యున్నతి కోసం సీఎం చెబుతున్న మాటలను స్వయంగా ఆలకించారు. ఇప్పటికే గతంలో చెప్పిన మాట ప్రకారం అమలవుతున్న ఒక్కో పథకం గురించి కేసీఆర్ వివరిస్తూ దళతబంధు కూడా అదేవిధంగా అమలు చేసి తీరుతామని ప్రకటించినప్పుడు పెద్దఎత్తున చప్పట్లతో హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలోని వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలకు ఇప్పటికే 7.6కోట్ల రూపాయలను ఈ పథకం అమలు కోసం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో జిల్లాలోని దళితులందరికీ రానున్న కాలంలో ఈ పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేయడంతో జిల్లావ్యాప్తంగా దళితవాడల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా దళితులు సంతోషం వ్యక్తం చేస్తూ గతంలో ఎవ్వరికీ ఇంత గొప్ప ఆలోచన రాలేదని, దళితుల ఉద్దరణ సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. దాదాపు జిల్లా నలుమూలల నుంచి ముఖ్యమైన దళిత నాయకులంతా సభకు తరలివెళ్లారు. వీరి వాహనాలను స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు జెండా ఊపి ప్రారంభించారు. వారితోపాటే పలువురు ఎమ్మెల్యేలు కూడా హుజూరాబాద్ సభకు వెళ్లి సభా వేదికపై ఆసీనులయ్యారు. నల్లగొండ నుంచి మూడు ప్రత్యేక బస్సుల్ల్లో హుజూరాబాద్‌కు పయనం కాగా వీరి వాహనాలను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. నకిరేకల్ నియోజకవర్గానికి సంబంధించి నార్కట్‌పల్లిలో ప్రత్యేక వాహనాలను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జెండా ఊపి ప్రారంభించారు. మిర్యాలగూడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు దళితబంధు పథక ప్రారంభసభకు వెళ్తున్న వారి వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. కోదాడ నుంచి వెళ్తున్న వాహనాలకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ జెండా ఊపారు. మునుగోడు నియోజకవర్గం నుంచి దళితబంధు సభకు వెళ్తున్న వాహనాలను చౌటుప్పల్‌లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. సూర్యాపేట నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి మార్గదర్శనంలో, దేవరకొండ, హుజూర్నగర్, తుంగుతుర్తి, ఆలేరు, భువనగిరి, నాగార్జునసాగర్ నియోజకవర్గాల నుంచి స్థానిక ఎమ్మెల్యేల పర్యవేక్షణలో ప్రత్యేక వాహనాల్లో దళిత సోదరులు హుజురాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ వాహనాలను స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు ప్రారంభించారు. సభలో పాల్గొన్న వారిలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, రవీందర్ నాయక్, పైళ్ల శేఖర్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళపల్లి రవీంద్రరావు, రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి ఉన్నారు. చారిత్రాత్మక దళితబంధు పథకంతో అనాదిగా నిర్లక్ష్యానికి గురవుతున్న దళితుల జీవితాల్లో కచ్చితంగా వెలుగులు నిండుతాయని ఈ సందర్భంగా నేతలు వ్యాఖ్యానించారు. ఈ పథకం దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా హుజూరాబాద్ సభకు ఐదు వేల మంది తరలివెళ్లినట్లు టీఆర్ఎస్ నేతలు వెల్లడించారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నార్కట్‌పల్లి, ఆగస్టు 16 : దళిత సాధికారత దిశగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌కు దళితులంతా రుణపడి ఉంటామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల దళితులు స్వచ్ఛందంగా హుజూరాబాద్‌లో జరిగే దళితబంధు సభకు వెళ్తున్న వాహనాలను సోమవారం జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పథకం ప్రవేశపెట్టడం హర్షణీయమన్నారు. ఆయన వెంట ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.