
ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరుతున్నది. రూ.50 వేల లోపు పంట రుణాలు మాఫీ చేసేందుకు సర్కారు నిర్ణయం తీసుకోగా నేటి నుంచి అమలు కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నిధులను విడుదల చేయగా బ్యాంకులు ఈ నెల 31వరకు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నాయి. నల్లగొండ జిల్లాలో 37,166 మంది రైతులకు రూ.128 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 27,658 మందికి రూ.86.96 కోట్లు అందనున్నాయి.
నల్లగొండ, ఆగస్టు 15 : 2018 అక్టోబర్ 31వరకు బ్యాంకులో రుణం తీసుకున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం మాఫీ ప్రకటించింది. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడిన సర్కార్ ఈ నెల 1న ఆగస్టు 16 మాఫీ చేస్తామని ప్రకటించింది. దీంతో సంబంధించిన నిధులను ఆదివారం ప్రభుత్వం బ్యాంకులకు అందజేసింది. రూ.లక్ష వరకు మాఫీ చేస్తామని ప్రకటించిన సర్కార్ ఇప్పటికే మొదటి విడుత రూ.25 వేలు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేసింది. రెండో విడుత రూ.50 వేలు రుణం తీసుకున్న వారివి సోమవారం నుంచి మాఫీ చేయనుంది. నల్లగొండ జిల్లాలో రూ.50 వేల లోపు రుణాలు తీసుకున్న వారు 37,166 మంది, సూర్యాపేట జిల్లాలో 27,658 మంది ఉన్నారు. నల్లగొండకు రూ.128 కోట్లు, సూర్యాపేట రైతాంగానికి రూ.86.96 కోట్లు మొత్తంగా రూ.215 కోట్లు రుణ మాఫీ కింద రానుంది.
ఎన్నికల హామీ కింద రూ.లక్ష మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం తొలి విడుతగా ఇప్పటికే రూ.25 వేల లోపు ఉన్న రైతుల రుణాలు మొత్తం మాఫీ చేసింది. నల్లగొండలో 13,036 మంది రైతులకు సంబంధించి రూ.20.64 కోట్లు మాఫీ చేయగా సూర్యాపేటలో 14,218 మంది రైతులకు రూ.18.55 కోట్లు మాఫీ చేసింది. తాజాగా రూ.50వేలు రుణాలు తీసుకున్న వారివి మాఫీ చేయగా ఈ నెల చివరి నాటికి మూడో విడుతలో రూ.75 వేలు తీసుకున్న వారివి… చివరి విడుతలో వచ్చే ఏడాది లక్ష రుణం తీసుకున్న రైతుల రుణాలు మాఫీ చేయనుంది. సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలనే ఆలోచనతో రెండోవిడుత రుణమాఫీకి చర్యలు చేపట్టారు. రుణ మాఫీకి సంబంధించిన మోడల్ చెక్కును ఆదివారం హోంమంత్రి మహమూద్ అలీ స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో బ్యాంకర్లకు అందజేశారు.