
లేక ఏటికేడు కూలబడిపోతూ వస్తున్న ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది. తరగతి గదులు, మౌలిక వసతులపై ఇప్పటివరకూ శాస్త్రీయంగాలెక్కలు లేకపోవడంతో సమగ్ర సర్వే చేపడుతున్నది. అందుకోసం విద్యాశాఖ ఎస్ఐఎస్ (స్కూల్ ఇన్ఫ్రాస్టక్చర్ స్టేటస్) యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్లాస్ రూమ్‌లు, మరుగుదొడ్లు, ప్రయోగశాలలు, ఆటస్థల విస్తీర్ణం వివరాలన్నింటినీ ఫొటోలు సహా ఉపాధ్యాయులు అప్లోడ్ చేయిస్తుండడంతో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా, సమస్యల పరిష్కారానికి త్వరగా నిధులు అందే అవకాశమున్నది.
పాఠశాలల స్వరూపంపై సమగ్ర వివరాల సేకరణ
భవన పరిస్థితులు, మౌలిక వసతులపై సర్వే
నడిగూడెం, ఆగస్టు 14 : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు స్కూళ్ల పరిస్థితిపై సమగ్ర సర్వే చేపట్టింది. ఇందుకోసం ఎస్ఐఎస్ (స్కూల్ ఇన్ఫ్రాస్టక్చర్ స్టేటస్) యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జూలై 19నుంచి పాఠశాల తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రయోగశాలలు, ఆటస్థల విస్తీర్ణం వంటి వివరాలను ఫొటోలు సహా అప్లోడ్ చేస్తున్నారు. ఈ సారి ప్రతి పాఠశాల మౌలిక వసతుల కల్పనపై విద్యాశాఖ బృహత్తర ప్రణాళిక రూపొందించింది. ఎస్ఐఎస్ (స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్)కు యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జూలై 19న ప్రభుత్వం ఈ సమగ్ర సర్వే యాప్‌లో వివరాల నమోదును ప్రారంభించింది. ప్రస్తుతం యాప్‌లో నిక్షిప్తమైన సమస్యలపై త్వరలోనే పరిష్కారానికి చర్యలు తీసుకోనుంది. పాఠశాలకు సంబంధించి ప్రతి అంశాన్ని ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక యాప్‌లో చిత్రీకరిస్తున్నారు. ఒక్కో గదికి ఎనిమిది రకాల ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారు. పాఠశాల తరగతి గదులు మొదలుకొని మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రయోగశాలలు, ఆట స్థలం విస్తీర్ణం, కంప్యూటర్ గదులు, ఇలా వివిధ రకాల వసతుల వివరాలు ఆన్లైన్లో నిక్షిప్తమవుతున్నాయి. నిధుల కేటాయింపులో పారదర్శకత పాటించేందుకు ఈ అంశాలు యాప్‌లో నమోదవుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో మొత్తం పాఠశాలలు 979 ఉండగా, 74,034 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆయా పాఠశాలల్లో తరగతుల గదులు 4,095 ఉన్నాయి.
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిధుల మంజూరుపై రూపొందించిన ప్రతిపాదనలు అస్తవ్యస్తంగా మారాయి. పలు చోట్ల అవసరం లేకున్నా సమస్యలను నివేదిస్తున్నట్లు విద్యాశాఖ ఏటా నిర్వహించే యూ డైస్లో తేలింది. మరికొన్ని చోట్ల అవసరం ఉన్నప్పటికీ విద్యార్థులు అసౌకర్యాలతో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రతి పాఠశాల సమగ్ర స్వరూపాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు, వసతులకు సంబంధించి నలువైపులా పైకప్పు, గోడలు, పాఠశాల లోపల, బయట ఇలా ఎనిమిది రకాల ఫొటోలను అక్షాంశాలు, రేఖాంశాలతో చిత్రీకరిస్తున్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యూడైస్ కోడ్‌తో ఎస్ఐఎస్ యాప్‌లో లాగిన్ అవుతున్నారు. ఇప్పటికే ఆన్లైన్లో వసతులు నిక్షిప్తమై ఉన్నాయి. గదులకు సంబంధించి వివరాల్లో మరమ్మతు బారిన పడిందా? గోడలు కూలిపోయే ప్రమాదం ఉందా? వానొస్తే పై కప్పు కురుస్తుందా? భవనం విస్తీర్ణం ఎంత? ఖాళీ స్థలం ఉందా? క్రీడా మైదానం ఉంటే ఎంత విస్తీర్ణంలో ఉంది? తదితర అంశాలను స్పష్టంగా సేకరిస్తున్నారు. ప్రయోగశాల, కంప్యూటర్ గది, ఉపాధ్యాయుల విశ్రాంతి గది, విద్యార్థుల సంఖ్య ఆధారంగా వసతులు అందుబాటులో ఉన్నాయా? గ్రంథాలయం ఉంటే పరిస్థితి, లేకుంటే అవసరంపై ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు.
మౌలిక వసతుల వాస్తవ పరిస్థితిని యాప్‌లో చిత్రీకరిస్తున్నాం. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వసతులు, అవసరాలపై పక్కాగా నివేదిస్తున్నాం. పాఠశాలల్లో సమస్యల గుర్తింపుతో విద్యార్థుల ఇబ్బందులు తీరనున్నాయి.