
దళిత సాధికారతే లక్ష్యంగా ఇటీవలే ఉమ్మడి జిల్లా నుంచి దళిత బంధుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా దళితవాడలతోపాటు తండాలపైనా దృష్టి సారించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా.. వివక్షకు, వెనుకబాటుకు గురవుతూ వస్తున్న దళిత, గిరిజన ఆవాసాలను అభివృద్ధి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ మేరకు అన్ని దళితవాడలు, తండాల్లో ప్రస్తుత పరిస్థితులపై సర్వేకు ఆదేశించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, మంచి నీరు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. వాటి ఆధారంగా మౌలిక వసతుల కల్పన కోసం ప్రాథమిక అంచనాలను సైతం రూపొందిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 576.57కోట్ల రూపాయల అంచనాలతో నివేదికను సిద్ధం చేశారు. పూర్తి వివరాలను జిల్లా యంత్రాంగం ఒకటి రెండ్రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నది.
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని తుర్కపల్లి మండలం వాసాలమర్రి నుంచే శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మొత్తం 76కుటుంబాలకు గాను రూ.7.6కోట్లు కలెక్టర్ ఖాతాలో జమ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్య మంత్రి కేసీఆర్.. గిరిజన తండాలపైనా ప్రత్యేకంగా దృష్టి సారించారు. దళితవాడల్లో, గిరిజన తండాల్లో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీస్తూ ఓ సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, వీధిదీపాల ఏర్పాటు, నల్లా కనెక్షన్లు, కరెంటు లైన్ల మార్పిడికి చేయాల్సిన ఖర్చులపై అంచనాలు రూపొందించాలని సూచించింది. ఈ మేరకు నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సర్వేకు ప్రణాళిక రూపొందించి అమలు చేశారు.
రూ.576.57కోట్లతో అంచనాలు సిద్ధం
జిల్లా వ్యాప్తంగా 31మండలాల్లోని 824గ్రామ పంచాయతీల పరిధిలోని దళితవాడలు, తండాల్లో సర్వే జరిగింది. వీటిల్లో ఇప్పటికే ఉన్న సీసీ రోడ్ల విస్తీర్ణం, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ స్తంభాలు, బల్బులు, హెచ్‌టీ, ఎల్టీ లైన్లు, నల్లా కనెక్షన్ల వివరాలతో పాటు మౌలిక సదుపాయాలపై వివరాలను సేకరించారు. మండల స్థాయి అధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శులు, పాలకవర్గాలు ఇందులో పాల్పంచుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా రూ.576.57కోట్ల వ్యయంతో మౌలిక వసతుల కల్పన పూర్తవుతుందని అంచనా రూపొందించారు. అందులో సీసీ రోడ్లు రూ.909. 86 కిలోమీటర్లు(రూ.362.38కోట్లు), 901.58కిలోమీటర్ల డ్రైనేజీ నిర్మాణం (రూ.199.69కోట్లు), 26,753 విద్యుత్ స్తంభాలకు వీధి దీపాల కోసం రూ.14.50కోట్లు.. అంచనా వేశారు.
మండలాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా మిర్యాలగూడకు రూ.56.04కోట్లు అవసరం అని గుర్తించారు. ఇక్కడ 46గ్రామ పంచాయతీలు ఉండగా సీసీరోడ్లకు రూ.31కోట్లు, సీసీ డ్రైనేజీకి రూ.23.91కోట్లు, వీధిదీపాలకు రూ.89లక్షలు అవసరమని నివేదిక రూపొందించారు. ఆ తర్వాత స్థానంలో అడవిదేవులపల్లి రూ.46.4కోట్లు, దేవరకొండ రూ.34.74కోట్లతో నివేదికలు సిద్ధం చేశారు. ఇక అతి తక్కువగా కనగల్ రూ.3.88కోట్లు, కట్టంగూర్ రూ.7.69కోట్లు, వేములపల్లి 7.78 కోట్ల అవసరమని సర్వేలో తేల్చారు.
కలెక్టర్ ఆదేశాలతో దళితవాడలు, గిరిజన తండాల్లో మౌలిక వసతుల కల్పన కోసం సర్వే నిర్వహించాం. మూడు రోజులుగా గ్రామస్థాయిలో బృందాలు పర్యటించి వివరాలను సేకరించాయి. ఇప్పటికే ఉన్న సౌకర్యాలతో పాటు ఇంకా పూర్తి చేయాల్సిన పనులు గుర్తించాం. ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, వీధిదీపాల అవసరాలు గుర్తిస్తూ రూ.576.57కోట్లతో అంచనాలను సిద్ధం చేశాం.
రామగిరి, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని నల్లగొండ జిల్లా ఉత్తమ అధికారుల జాబితాను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ శనివారం విడుదల చేశారు. మొత్తం 25శాఖల నుంచి ఎంపిక చేయగా ఒక్కో విభాగంలో ముగ్గురు, నలుగురు చొప్పున 78మందికి అవకాశం దక్కింది. స్థానిక సంస్థల పరిపాలన, ప్రభుత్వ ఉత్తర్వుల అమలులో పనితీరుకు అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. అదే విధంగా జిల్లా కేంద్ర దవాఖాన మాజీ సూపరింటెండెంట్ నర్సింహ సైతం ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఆదివారం జరిగే వేడుకల అనంతరం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించనున్నారు. సూర్యాపేట జిల్లాలో 157 మంది ఉత్తమ అధికారులను ఎంపిక చేశారు.
నీలగిరి, ఆగస్టు 14 : 75స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని జిల్లా ప్రజలకు ఎస్పీ రంగనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. భారత స్వాతంత్య్ర పోరాటాం ప్రపంచ చరిత్రలోనే సువర్ణాధ్యాయంగా నిలుస్తుందన్నారు. సమరయోధుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు, యువత లక్ష్యాలను ఎంచుకుని ముందుకు సాగాలన్నారు.
పరేడ్ గ్రౌండ్లో రిహార్సల్స్
స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు పూర్తి
నీలగిరి, ఆగస్టు 14 : జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్ రిహార్సల్స్‌ను శనివారం డీటీసీ ఎస్పీ సతీశ్ చోడగిరి పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. మైదానంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా, స్వాతంత్య్ర సమరయోధుల కోసం కేటాయించిన సిటింగ్‌ను పరిశీలించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ జాతీయ జెండాను అవిష్కరించనున్నట్లు తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. ఆయన వెంట ఏఆర్ డీఎస్పీ సురేశ్‌కుమార్, ఆర్ఐలు నర్సింహాచారి, స్పర్జన్‌రాజ్, కృష్ణారావు, నర్సింహాచారి తదితరులున్నారు.
నడిగూడెం, ఆగస్టు 14 : మన జాతీయ జెండా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోనే రూపుదిద్దుకోవడం గర్వకారణం. నాటి జమీందారు రాజా నాయిని వెంకటరంగారావు వద్ద వ్యవసాయ అభివృద్ధి అధికారిగా పనిచేసి పత్తి వెంకయ్యగా పేరొందిన పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని తీర్చిదిద్దారు. మహాత్మా గాంధీ పిలుపు అందుకుని 1913లోనే పలువురు ఉద్యమ నాయకులు జాతీయ జెండా నమూనాలను రూపొందించారు. అయితే, కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు మధ్యలో నూలు ఒడికే రాట్నంతో వెంకయ్య రూపొదించిన జెండాను 1921లో బెజవాడలో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాల్లో గాంధీజీ అమోదించారు. 1947జూలై 22న రాట్నం స్థానంలో అశోకుడి ధర్మచక్రం చోటుసంపాదించుకున్నది. నడిగూడెం కోటను ప్రముఖ చరిత్రకారుడు జితేంద్రబాబు లీజుకు తీసుకొని పురావస్తు గ్రంథాలపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
నల్లగొండకు చెందిన గుర్రం మేఘన రావి చెట్టు ఆకుపై మూడు రంగుల పతాకాన్ని, మధ్యలో జాతీయ నాయకుల చిత్రాలను ఆవిష్కరించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గీసిన బొమ్మలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
కళాశాల, నల్లగొండ
సెల్ నెం: 9848519830