
సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఉమ్మడి నల్లగొండ జిల్లా నేడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఓ వైపు వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ.. దేశానికే రైతన్న వెన్నెముక అన్న నానుడిని నిజం చేస్తూ మరోవైపు పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలతో ‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మ’ నినాదానికి ఆచరణ రూపం ఇస్తున్నారు. సాగునీటికి నోచుకోక ముప్పావంతు భూములన్నీ బీళ్లుగానే ఉండగా రక్షిత తాగునీరు అందించక ఫ్లోరైడ్‌కు పర్యాయపదంగా జిల్లాను చరిత్రకెక్కించారు సమైక్య పాలకులు. ఇక విద్య, వైద్యం, ఉపాధి లాంటి రంగాల్లోనూ తీవ్ర నిర్లక్ష్యం కొనసాగింది. మౌలిక వసతుల కల్పనను గాలికొదిలేశారు. వీటన్నింటి నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ జిల్లా అంటేనే వెనుకబాటు తనానికి నిదర్శనంగా పేరుగాంచింది.
కానీ కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఒక్కో రంగంలో స్పష్టమైన మార్పుతో జిల్లా ప్రగతిపథంలో ముందుకు సాగుతున్నది. రేపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక కథనం.
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు, తాగునీటితోపాటు విద్య, వైద్యం, పారిశ్రామికరంగం, ఉపాధి అవకాశాల కల్పనలోనూ మెరుగైన పరిస్థితులు నెలకొంటున్నాయి. వీటితోపాటు పల్లెలు, పట్టణాలకు ప్రత్యేక పథకాలతో నిధులు ఇస్తూ పారిశుధ్యం, పచ్చదనం పెంపొందిస్తున్నారు. దీంతో పల్లె జీవనంలోనూ ఆరోగ్యకరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తరిగిపోతున్న వృక్ష సంపదకు బ్రేక్ వేస్తూ హరితహారం పేరుతో ఏటా కోట్ల మొక్కలను పెంచుతూ పర్యావరణానికి పెద్దపీట వేస్తున్నారు. పరిశ్రమలకు పెద్దపీట వేస్తూ పారిశ్రామిక పార్కులకు శ్రీకారం చుట్టారు. ఉపాధి అవకాశాల పెంపు కోసం యాదాద్రి పవర్ ప్లాంట్ లాంటి పరిశ్రమను జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. మెడికల్ కాలేజీలతోపాటు ఆస్పత్రుల్లో సౌకర్యాల పెంపుతో మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. విద్యాపరంగా పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు పెద్ద ఎత్తున గురుకులాలకు శ్రీకారం చుట్టారు.
ఉమ్మడి పాలనలో వలసలకు నెలవుగా ఉన్న జిల్లా స్వరాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులతో సాగులో అగ్రస్థానానికి చేరుకున్నది. 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశానికే దిక్సూచిగా నిలిచింది. కృష్ణానీటికి తోడు గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతోపాటు మిషన్ కాకతీయతో చెరువులను పటిష్టం చేయడంతో అదనంగా 5లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుబాటులోకి వచ్చింది. అన్ని రకాల నీటివనరులతో కలిపి 11 లక్షలకు పైగా సాగునీటి వసతి ఏర్పడింది. యాభై ఏండ్ల నినాదంగా ఉన్న గోదావరి జలాలు కాళేశ్వరం ద్వారా వస్తుండడంతో సూర్యాపేట జిల్లా పూర్తిస్థాయిలో సస్యశ్యామలంగా మారింది. యాదాద్రి జిల్లాలో గంధమళ్ల, బస్వాపురం పూర్తయితే ఆ జిల్లాలో పూర్తిస్థాయిలో సాగునీరు అందినట్లే. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు డిండి ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందించేందుకు పనులు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగమార్గం, ఉదయసముద్రం ఎత్తిపోతల నిర్మాణాల పూర్తికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇవి కాకుండా సాగర్ ఆయకట్టులో మిగిలి ఉన్న బీళ్లకు సాగునీరు అందించేందుకు సుమారు 3వేల కోట్లతో 15లిఫ్టు పథకాలకు శ్రీకారం చుట్టారు. పత్తి పంటలోనూ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాదే అగ్రస్థానం. ఈ సారి కూడా 12లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతున్నది.
గతంలో గ్రామాలకు ప్రత్యేక నిధులంటూ ఉండేవి కావు. కానీ, నేడు సీఎం కేసీఆర్ ప్రతి నెలా క్రమం తప్పకుండా జనాభా ప్రతిపాదికన నిధులు విడుదల చేస్తూ గ్రామాల రూపురేఖలు మార్చేస్తున్నారు. గ్రామంలో వెయ్యి జనాభా ఉంటే నెలకు 1.32లక్షల చొప్పున నిధులు వస్తున్నాయి. నల్లగొండ జిల్లాలోని గ్రామాలకు ప్రతి నెలా రూ.18 కోట్లు, సూర్యాపేట జిల్లాలోని గ్రామాలకు రూ.12 కోట్ల చొప్పున వరుసగా 23నెలలు విడుదల చేశారు. వీటితో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు. పల్లె ప్రగతి నిధులతో పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించారు. ప్రతి గ్రామానికి రూ.10లక్షల వరకు వెచ్చించి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను ఏర్పాటు చేశారు. పచ్చదనం పెంపుకోసం ప్రత్యేకంగా హరితహారం చేపట్టారు. ఆధునిక వసతులతో వైకుంఠధామాలు నిర్మించారు. మున్సిపాలిటీల్లోనూ పట్టణ ప్రగతి నిధులతో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు.
జిల్లాలో వైద్యసేవల పరంగా సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. నల్లగొండ, సూర్యాపేటకు మెడికల్ కాలేజీలతోపాటు యాదాద్రి జిల్లాకు ఎయిమ్స్ అందుబాటులోకి వచ్చాయి. అనుబంధ ఆస్పత్రులతోపాటు పీహెచ్‌సీల్లో వసతులు మెరుగుపర్చారు. సీటీ స్కాన్ లాంటి ఖరీదైన పరీక్షలతోపాటు డయాగ్నస్టిక్ సేవలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. కేసీఆర్ కిట్ లాంటి పథకాలతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సంఖ్య పెరిగింది. కరోనా ఎఫెక్ట్‌తో ప్రధాన ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచడంతోపాటు ఆక్సిజన్ ప్లాంట్లతో సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఐసీయూ, వెంటిలేటర్, డయాలసిస్ లాంటి సేవలను అందిస్తున్నారు. నకిరేకల్‌కు వంద పడకల ఏరియా ఆస్పత్రిని మంజూరు చేశారు. విద్యారంగంలోనూ పేదలకు మరింత మెరుగైన విద్య అందించేందుకు పెద్దసంఖ్యలో గురుకులాలు ఏర్పాటయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేశారు. మండలానికి ఒక మోడల్ స్కూల్‌తోపాటు బాలికల కోసం ప్రత్యేకంగా కస్తూర్బా పాఠశాలలు పేదలకు విద్యను దగ్గరకు చేర్చాయి. ఇక ఇంటర్, డిగ్రీ కాలేజీలు సైతం ఏర్పాటు చేశారు. ఇటీవలే హాలియాకు డిగ్రీ కాలేజీ మంజూరైంది.
పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. స్వరాష్ట్రంలో పింఛన్ డబ్బు పెంచడంతోపాటు పేదలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గొర్రెలు, చేపపిల్లల పంపిణీ, ల్యాండ్రీ, సెలూన్లకు ఉచిత విద్యుత్ రాయితీలు ఇలా అన్ని వర్గాల ప్రజలకు పథకాలను అమలుచేస్తున్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తీసుకుంటున్న చర్యలు రానున్న కాలానికి ఉమ్మడి జిల్లాకు ప్రగతి మెట్లుగా మారుతాయనడంలో సందేహం లేదు.
పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నల్లగొండను మూడు జిల్లాలుగా విభజించారు. దీంతోపాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాలను ఏర్పాటు చేశారు. గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ స్వయంపాలనకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 31 మండలాలు, 844 గ్రామపంచాయతీలు, సూర్యాపేట జిల్లాలో 23 మండలాలు, 475 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జిల్లా, మండల, పంచాయతీల పాలకవర్గాల్లో 50శాతం రిజర్వేషన్‌తో మహిళలే పాలనాధ్యక్షులుగా ఉన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇస్తూ కృష్ణాజలాలను సరఫరా చేస్తున్నారు.
దామరచర్ల వద్ద ఏర్పాటు చేస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్ జిల్లాకే తలమానికం కానున్నది. 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి కోసం మల్కాపూర్ వద్ద ఇండస్ట్రియల్ పార్క్‌ను ఇప్పటికే ప్రారంభించగా అనేక పరిశ్రమలకు నెలవుగా మారుతున్నది. తాజాగా మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, వెలిమినేడు, హుజూర్నగర్ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్క్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు కూడా ప్రతిపాదనలు రూపొందించింది. ఇవన్నీ మరింత మందికి ఉపాధి ఇవ్వనున్నాయి.