
రామగిరి, ఆగస్టు 13 : గ్రామీణ ప్రాంత యువతలో సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కొత్త ఆవిష్కరణల్లో నల్లగొండ ఉమ్మడి జిల్లావాసులు ముందు నిలిచారు. ఉమ్మడి జిల్లా నుంచి 9ప్రదర్శనలు ఫైనల్‌కు ఎంపిక కాగా 7ప్రదర్శనలతో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలో ద్వితీయస్థానం చోటుచేసుకున్నది. విద్యార్థులు, యువత, రైతులు ఇతరుల నుంచి కొత్త ఆవిష్కరణ ప్రాజెక్టులకు దరఖాస్తులను ఆహ్వానించగా వచ్చిన వాటిలో మూడు దశల్లో ఫిల్టర్ చేసి ఫైనల్ జాబితాను శుక్రవారం విడుదల చేశారు. ఎంపికైన ప్రాజెక్టును ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆన్లైన్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. ప్రదర్శన అనంతరం వారిని ఆయా జిల్లాల కలెక్టర్లు అభినందించి ప్రశంసా పత్రాలు అందజేస్తారు.
నల్లగొండ జిల్లా నుంచి మొత్తం 12ప్రాజెక్టులు రాగా వీటిలో ఒకటి ఫైనల్స్‌కు ఎంపికైంది. జిల్లాలోని మునుగోడు మండలం గూడపూర్ గ్రామానికి చెందిన డి.నిఖిల్ తయారు చేసిన ఎలక్ట్రికల్ మాస్క్ ప్రాజెక్టు ప్రదర్శన జరుగనుంది.
సూర్యాపేట జిల్లా నుంచి మొత్తం ఒక ప్రాజెక్టు ఎంపికైంది. అశోక్ బోరె అనే విద్యార్థి శరీరాన్ని వంచకుండా అనే ప్రాజెక్టును తయారు చేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి బాలయ్య అనే బాలుడు 121 విశిష్ట రంగంలో ప్రత్యేక మూలంశాలతో చీర కుట్టాడు. నరసింహన్ అనే యువకుడు లో కాస్ట్ డ్రమ్‌సీడర్‌ను తయారు చేశాడు. శివ, ప్రభాకర్, రామకృష్ణ, రమేశ్, దుర్గ, శిరీష అనే యువకులు కలిసి శ్వాస తీసుకునే ముందు బాహ్య గాలిని శుద్ధ చేసే ఎలక్ట్రికల్ మాస్క్‌ను తయారు చేశారు. శివప్రసాద్ అనే యువకుడు దృశ్యపరంగా, దివ్యాంగుల కోసం స్మార్ట్ డస్ట్‌బిన్ తయారు చేశాడు. రిహాన్ అనే విద్యార్థి సింగిల్ ఫిజికల్ స్ట్రెయిన్ అనే అంశంపై ప్రాజెక్టు తయారు చేశాడు. శ్రావణి అనే విద్యార్థిని రాత్రిపూట సులభంగా నడిపించే పరికరాన్ని తయారు చేసింది. రాకేశ్ అనే విద్యార్థి వినియోగదారులు సులభంగా ఉపయోగించే స్మార్ట్ కౌంటర్ అనే ప్రాజెక్టును తయారు చేశాడు. ఈ ప్రదర్శనలు ఫైనల్‌కు ఎంపిక కావడంతో రేపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆన్లైన్లో ప్రదర్శనలు జరుగనున్నాయి.