
మేళ్లచెర్వు, ఆగస్టు 9 : మండలంలో ఏటా సుమారు 10 వేల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోంది. కానీ, గత ఏడాది కురిసిన అకాల వర్షాలకు పంట దిగుబడి తగ్గి పెట్టుబడి రాని పరిస్థితి. అంతేకాకుండా పత్తితో పోల్చితే మిర్చికి ధర అధికంగా ఉండడంతో ఈ ఏడాది కొంత మంది మిర్చి సాగుకు మొగ్గుచూపారు. అయినప్పటికీ సుమారు 8 వేల ఎకరాల్లో పత్తి సాగు అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాదైనా తమకు కలిసొస్తుందన్న నమ్మకంతో ఒక్కో ఎకరానికి ఇప్పటికే రూ.9వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు పేర్కొంటున్నారు. అందులో ట్రాక్టర్‌తో దున్నిచ్చినందుకు ఎకరాకు రూ.3600, అరకకు రూ.వెయ్యి, విత్తనాలకు రూ.1800, కూలీలకు రూ.600 ఖర్చు కాగా ఎరువులకు రూ.1450, కలుపుతీత పనులకు రూ.600 చొప్పున ఖర్చయ్యింది. కాగా, 15 రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో పత్తిచేలు వాడిపోతున్నాయి. బోరు మోటర్లు ఉన్న రైతులు చేలకు నీరందించి కాపాడుకుంటున్నారు. నీటి సౌకర్యం లేనివారు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు.
గతేడాది పత్తి సాగుకు ఎకరాకు రూ.30 వేల దాకా ఖర్చయ్యింది. అధిక వర్షాలకు దిగుబడి తగ్గింది. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చి రూ. 10 వేలు నష్టపోయా. ఇటీవల కురిసిన వర్షాలతో ఈ ఏడాది మంచి దిగుబడి వస్తుందన్న ఆశతో పెట్టుబడి పెట్టి పత్తి సాగు చేశా. కానీ, కొద్ది రోజులుగా వర్షాలు కురువకపోవడంతో చేలు వాడుపడుతున్నాయి.
-లంకెమళ్ల శంకరయ్య, రైతు, మేళ్లచెర్వు