
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి
ఉన్నతస్థాయిలో నిరంతర పర్యవేక్షణ
ఇన్లెట్ వద్ద విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరణ
కొనసాగుతున్న డీ వాటరింగ్
అవుట్లెట్ నుంచి టీబీఎం తవ్వకం
33.98కిలోమీటర్లు పూర్తి.. మిగిలింది 10 కిలోమీటర్లే
రెండేండ్లలో పూర్తి చేసే లక్ష్యంగా పనులు
నల్లగొండ జిల్లా ప్రజల కలల ప్రాజెక్టు శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(ఎస్ఎల్బీసీ) సొరంగ మార్గం పనులు ఇక నిరాటంకంగా కొనసాగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ఇటీవల రాష్ట్ర క్యాబినెట్లో చర్చించడం, సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించడంతో పనులు ఊపందుకున్నాయి. రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ నేతృత్వంలో నిరంతరం పర్యవేక్షించాలని సీఎం నిర్ణయించడంతో ప్రాజెక్టు పనుల్లో నెలకొన్న ఆటంకాలపై దృష్టి పెట్టారు. ఇన్లెట్ వద్ద నిలిచిపోయిన విద్యుత్ కనెక్షన్‌ను పునరుద్ధరించారు. సొరంగంలోకి వచ్చిన సీపేజ్ వాటర్‌ను తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు. మరోవైపు జిల్లా పరిధిలోని మన్నెవారిపల్లి అవుట్లెట్ వద్ద టీబీఎంతో తవ్వకం పనులు చేపడుతున్నారు. వచ్చే రెండేండ్లల్లో నూరు శాతం పనులు పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ) : కృష్ణానదిలో వరద సమయాల్లో 30 టీఎంసీల నీటితో నల్లగొండ జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూపుదిద్దుకున్నదే ఎస్ఎల్బీసీ సొరంగమార్గం. ఇప్పటికే ఏఎంఆర్పీ ద్వారా సాగునీరు అందిస్తున్న ఆయకట్టుకు స్థిరమైన నీటి లభ్యతతో పాటు జిల్లాలోని ఫ్లోరైడ్ గ్రామాలకు శాశ్వతంగా కృష్ణాజలాలు అందించే లక్ష్యంగా దీన్ని 2005 ప్రారంభించారు. రెండు సొరంగ మార్గాలతో పాటు పలు నక్కల గండి, పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో పాటు 25 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్‌తో దీన్ని ప్రాతిపాదించారు. 2005లో 2,813 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని ఆమోదించారు. పనులను మాత్రం వేర్వేరుగా వివిధ సంస్థలకు అప్పగించారు. ఇందులో కీలకమైన సొరంగమార్గాలను ఢిల్లీకి చెందిన జయప్రకాశ్ అసోసియేట్స్ సంస్థ చేపట్టింది. దోమలపెంట వద్ద శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదలై నాగర్‌కర్నూల్ జిల్లా మన్నెవారిపల్లి వరకు 43.93 కిలోమీటర్ల సొరంగమార్గం-1ను రెండు వైపులా రెండు టన్నెల్ బోరింగ్ మిషన్ల(టీబీఎం)తో తవ్వకాలు చేపట్టారు. జిల్లా పరిధిలో మొదటి సొరంగానికి అనుబంధంగా 7.92 కిలోమీటర్ల పొడవైన రెండో సొరంగాన్ని గుర్రెపుడెక్క ఆకారంలో బ్లాస్టింగ్ పద్ధతిలో తవ్వకాలు చేపట్టారు. అయితే ఈ సొరంగాల పనులు 2009 వరకు బాగానే కొనసాగిన ఆ తర్వాత పూర్తిగా మూ లకు పడ్డాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దీనిపై దృష్టి పెట్టినా అప్పటికే ఉన్న ఒప్పందాల నేపథ్యంలో ఆటంకాలు ఎదురయ్యాయి. దీనికి తోడు వరుసగా ఐదేండ్లుగా కృష్ణానదీలో వరదలు పొటెత్తుండడంతో టన్నెల్లోకి భారీగా ఊటనీరు రావడం, కరోనా ప్రభావంతో పనుల నిర్వహణకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రభు త్వం పలుమార్లు సమీక్షించి పనుల పురోగతికి చర్యలు చేపట్టింది. పెరిగిన రేట్లకు అనుగుణంగా 2017 మార్చి 16న తిరిగి 3,152.72 కోట్లతో అంచనా వ్యయానికి కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన ఆమోదం ఇచ్చింది. మధ్యమధ్యలో పెండింగ్ బిల్లులు విడుదల చేస్తూ పనులు పురోగతికి కృషి చేస్తూ వచ్చింది.
సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులపై సమీక్ష చేస్తూ జిల్లా పరిధిలోని ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంతో పాటు ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాలపై ప్రత్యేత దృష్టి సారించారు. నీటి పారుదల ఉన్నతాధికారులతో సమీక్షిస్తూ ప్రాజెక్టు పూర్తికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిధులు, ఇతర అంశాలపై చర్చిస్తూ నిరంతరం పర్యవేక్షణ జరుపుతూ పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఈ మేరకు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యవేక్షణలో నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ నేతృత్వంలో ప్రాజెక్టు సీఈ, ఎస్ఈ, ఈఈలు, విశ్రాంత ఇంజినీర్ల బృందం నిరంతరం దృష్టి పెట్టాలని ఆదేశించారు. వీరందరితో పాటు శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిపి ఓ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా నిరంతరం ప్రాజెక్టు పనులపై చర్చిస్తున్నారు. ఎక్కడైనా ఆటంకాలు ఎదురైతే వెంటనే ఎవరి స్థాయిలో స్పందించేలా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో పనుల్లో వేగం పెరిగింది. ఇన్లెట్పై ప్రధానంగా దృష్టి సారించారు. ఇన్లెట్ వద్ద డీవాటరింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్న సంకల్పంతో పనులు మొదలుపెట్టారు.
నిరంతరం డీవాటరింగ్ ప్రక్రియ
శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలోని ఇన్లెట్ వద్ద పనులు చురుగ్గా సాగుతున్నాయి. 2018 అక్టోబర్‌లో శ్రీశైలంలో భారీ వరదలతో టన్నెల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో టీబీఎం తవ్వకాలు అప్పటి నుంచి నిలిచిపోయాయి. టన్నెల్లోకి వచ్చిన నీటిని ఎప్పటికప్పుడూ బయటకు ఎత్తిపోయాల్సి ఉండగా కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యం చేశారు. సకాలంలో కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో కరెంటు కనెక్షన్ తొలగించారు. దీంతో జనరేటర్‌తో డీ వాటరింగ్ చేయాలని భావించినా ముందుకు సాగలేదు. ఇటీవల సీఎం కేసీఆర్ సమీక్షలో సొరంగంపై చర్చించి చర్యలు చేపట్టారు. ఈ నెల 5న కరెంటు కనెక్షన్ పునరుద్ధ్దరిస్తూ కరెంటు బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. దీంతో ప్రత్యేకంగా 20, 30 హెచ్‌సీ మోటార్లను రన్ చేస్తూ డీవాటరింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు. సొరంగంలోకి చేరిన నీటినంతా తోడడానికి కనీసం నెల రోజులు పట్టనుందని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. 45 రోజుల్లో ఇన్లెట్ వద్ద టీబీఎంతో తవ్వకాలు ప్రారంభం కానున్నాయి.
పెండింగ్ పనులపైనా దృష్టి
ఈ ప్రాజెక్టులో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఓపెన్ కెనాల్ పనులపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. టన్నెల్-1, టన్నెల్-2లను అనుసంధానం చేస్తూ నక్కలగండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పునులు దాదాపు పూర్తి కావచ్చాయి. దీనిలోనూ పెండింగ్ పనులపై దృష్టి పెట్టనున్నారు. సొరంగమార్గం-2 తర్వాత నీరు చేరేందుకు వీలుగా పెండ్లిపాకల రిజర్వాయర్‌ను విస్తరిస్తున్నారు. అక్కడి నుంచి 25 కిలోమీటర్ల మేర ఓపెన్ కెనాల్ నిర్మాణం చేపడుతున్నారు. తర్వాత ఆ నీటిని ఇప్పటికే ఉన్న ఏఎంఆర్పీ ప్రధాన కాల్వకు అనుసంధానం చేయనున్నారు. సొరంగమార్గం పనులతో పాటు మిగతా పనులు పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
సొరంగమార్గం పనుల్లో వేగం
సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో సొరంగమార్గం పనుల్లో వేగం పెరిగిందని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ వెల్లడించారు. ఇన్లెట్ వద్ద కరెంటు కనెక్షన్ పునరుద్ధ్దరణ, డీవాటరింగ్ ప్రక్రియ మొదలైందన్నారు. త్వరలోనే టీబీఎంతో తవ్వకాలు చేపట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. సాధ్యమైనంత త్వరగా దీన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధ్దంగా ఉందన్నారు. కాగా ఇప్పటివరకు మొత్తం ఈ ప్రాజెక్టు సుమారు రూ.2, 300 కోట్ల పనులు పూర్తి కానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
మిగిలి ఉన్నది మరో 10 కిలోమీటర్లే
మొత్తం 43.93 కిలోమీటర్ల మేర మొదటి సొరంగం తవ్వాల్సి ఉంది. రెండు వైపులా రెండు టీబీఎంలతో తవ్వకాలు చేపట్టారు. ఇన్లెట్ వైపు నుంచి ఇప్పటివరకు 14 కిలోమీటర్ల మేర తవ్వకం పూర్తయింది. అవుట్లెట్ మన్నెవారిపల్లి నుంచి ఇప్పటివరకు 19.98 కిలోమీటర్ల మేర తవ్వకం పూర్తయింది. అవుట్లెట్ వైపు నుంచి ఈ ఏడాది మే నుంచి నిరాటకంగా తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ఇంకా 10 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వాల్సి ఉంది. ఇన్లెట్ వైపు నుంచి కూడా మరికొద్దీ రోజుల్లో పనులు మొదలైతే సొరంగం పనులు మరింత వేగం అందుకోనున్నాయి. ఈ సొరంగం పూర్తయితే ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తయినట్టే. వచ్చే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికి అనుసంధానంగా చేపట్టిన 7.92 కిలోమీటర్ల పొడవైన సొరంగమార్గం-2 తవ్వకం గతంలోనే పూర్తయింది. అయితే ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయనున్నారు.
త్వరలోనే ఇన్లెట్ టీబీఎం పనులు
సీఎం కేసీఆర్ ఆదేశాలతో పనుల్లో వేగం పెరిగింది. ఇన్లెట్ వద్ద ఆటంకంగా ఉన్న సీపేజ్ వాటర్‌ను తొలగించే పని నిరంతరం కొనసాగుతుంది. ప్రభుత్వ ఆదేశాలతో నాలుగు రోజుల కిందటే కరెంటు కనెక్షన్‌ను పునరుద్ధ్దరించారు. దీంతో ప్రత్యేక మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్నాం. ఈ ప్రక్రియకు మరో 30 నుంచి 45 రోజుల సమయం పట్టవచ్చు. తర్వాత టీబీఎంను ప్రత్యేక నిపుణులతో పరీక్షించాల్సి ఉంది. వారు ఓకే అంటే టీబీఎంతో తవ్వకాలు ప్రారంభిస్తాం. సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించేందుకు కృషి జరుగుతుంది. అవుట్ లెట్ వైపు నుంచి పనులు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఉన్నతాధికారులు కూడా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. -జగన్మోహన్రెడ్డి, ప్రాజెక్టు ఈఈ