
జనంలో పెరుగుతున్న అవగాహన
ప్రోత్సహిస్తున్న అధికార యంత్రాంగం
చేయి కలుపుతున్న సామాజిక, ధార్మిక సంస్థలు
నేడు, రేపు పెద్దఎత్తున మట్టి విగ్రహాల పంపిణీ
కొన్నేండ్లుగా ఇండ్లల్లో మట్టి వినాయకులకే ప్రాధాన్యం
మార్కెట్లో రూ.30 నుంచి 9వేల వరకు..
ఎల్లుండి వినాయక చవితి
పర్యావరణ హితంగా, కరోనా రహితంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకొనేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమవుతున్నారు. ఏటికేడు మట్టి విగ్రహాలపై పబ్లిక్‌లో అవగాహన పెరుగుతుండగా, ప్రభుత్వ యంత్రాంగానికితోడు స్వచ్ఛంద, ధార్మిక సంస్థలూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. దాంతో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులు మట్టితో
చేసిన విగ్రహాల ప్రతిష్ఠ అంతకంతకూ పెరుగుతూ వస్తున్నది. ప్రారంభంలో ఇండ్లల్లో మాత్రమే మట్టి వినాయకుల ఏర్పాటుకు ఆసక్తి చూపిన ప్రజలు క్రమంగా మండపాల్లో ప్రతిష్ఠించేందుకు కొంచెం పెద్ద సైజు మట్టి విగ్రహాలను ఎంపిక చేసుకుంటుండడం శుభపరిణామం. నల్లగొండలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం వెయ్యి మట్టివిగ్రహాలను పంపిణీ చేయనున్నారు. మరోవైపు పలు సంస్థల ఆధ్వర్యంలో 15 వేల వరకు, సూర్యాపేట జిల్లాలో 7 వేలకు పైగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 వేల విగ్రహాల వరకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మట్టి గణేశ్‌ల తయారీతో వృత్తిదారులకూ ఉపాధి దొరుకుతున్నది. వివిధ సైజులను బట్టి మార్కెట్లో రూ.30 నుంచి
రూ.9వేల దాకా మట్టి విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి.
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ) : గణేశ్ నవరాత్రోత్సవాలకు ప్రజలు సిద్ధమయ్యారు. వినాయక చవితి వస్తున్నదంటే చాలు.. సాధారణ రోజుల్లో సందడే సందడి. గతంలో రంగురంగుల తీరొక్క రూపంలో విగ్రహాలను తీసుకువచ్చి వీధివీధికీ ఓ గణపయ్యను ప్రతిష్ఠించేవారు. కాలనీవాసులంతా ఒకచోటకు చేరి నిత్య పూజలు, అన్నదానాలు నిర్వహించి, నిమజ్జన శోభాయాత్రలో డప్పులు, నృత్యాలు, బ్యాండుమేళాలతో భారీ హంగామా చేస్తుంటారు. అయితే కొవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈ సందడిలో కొంత జోష్ తగ్గించక తప్పదు. మరోవైపు విగ్రహాల విషయంలోనూ ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. ప్రభుత్వం, పర్యావరణవేత్తలు, సామాజిక సంస్థలు మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించాలని చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి స్పందన బాగున్నది. ప్రారంభంలో ఇళ్లల్లో పూజించి విగ్రహాల వైపు మొగ్గు చూపిన ప్రజలు.. రానురాను వీధుల్లో ఏర్పాటు చేస్తున్న పెద్ద విగ్రహాల విషయంలోనూ ఆలోచిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున మట్టి విగ్రహాల ప్రతిష్ఠించడానికి సిద్ధపడుతున్నారు. ఓ అంచనా ప్రకారం ఈ సారి 25శాతం విగ్రహాలు మట్టివే ఉండవచ్చని భావిస్తున్నారు. ఇండ్లలో 70 నుంచి 80శాతం వరకు మట్టి ప్రతిమలను పూజిస్తున్నట్లు సమాచారం. ఐదారేండ్లతో పోలిస్తే మట్టి విగ్రహాల వాడకం భారీగా పెరిగింది.
పెద్ద ఎత్తున పంపిణీకీ ఏర్పాట్లు..
మట్టి విగ్రహాల వినియోగంపై జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తున్నది. రసాయన విగ్రహాల ఏర్పాటుతో కలుగుతున్న నష్టాన్ని వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నది. గతేడాది నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మట్టి వినాయకుల పంపిణీకి భారీగా ప్రాధాన్యమిచ్చారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పదివేల మట్టి ప్రతిమలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఈ సారి కూడా ఇప్పటికే జిల్లా కాలుష్య నియంత్రణ విభాగం ద్వారా ప్రత్యేకంగా వెయ్యి విగ్రహాలను పంపిణీకి సిద్ధం చేశారు. మున్సిపాలిటీల్లోనూ వివిధ సంస్థల ద్వారా పంపిణీపై దృష్టి సారించారు. చేతివృత్తుల వారికి ప్రత్యేకంగా శిక్షణ అందించారు.
ముందుకొస్తున్న స్వచ్ఛంద సంస్థలు..
పర్యావరణ హితం కోరుతూ జిల్లాలోని పలు స్వచ్ఛంద, ధార్మిక సంస్థలు, పలు సంఘాలు కూడా మట్టి విగ్రహాల పంపిణీకి ముందుకు వస్తున్నాయి. నల్లగొండలో జిల్లా అధికార యంత్రాం గం ఆధ్వర్యంలో వెయ్యి మట్టివిగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో ఎలిశాల రవిప్రసాద్(వైఆర్పీ) ట్రస్ట్ ఆధ్వర్యంలో 6500 విగ్రహాలను సిద్ధం చేసినట్లు సంస్థ బాధ్యులు తెలిపారు. వాసవీ క్లబ్ ఆధ్వర్యంలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జగిని టెక్స్టైల్స్ అధినేత వెంకన్న ఆధ్వర్యంలో 1,800 విగ్రహాలను సిద్ధం చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4వేల మట్టి విగ్రహాలను మునుగోడుతోపాటు మున్సిపాలిటీల్లో పంపిణీ చేయనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ తెలిపారు. యాదగిరిగుట్ట, భువనగిరి పట్టణాల్లో శాంఖరీ, శ్రీకరీ డైవలపర్స్ ఆధ్వర్యంలో 1000 మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నారు.
పెద్ద విగ్రహాలు సైతం అందుబాటులో…
పెద్ద సైజు మట్టి విగ్రహాలను గతంలో హైదరాబాద్‌లో కొనుగోలు చేయాల్సి వచ్చేది. స్థానికంగా అందుబాటులో ఉంటే ఎక్కువ సంఖ్యలో నెలకొల్ప వచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో నల్లగొండకు చెందిన పర్యావరణ వేత్త మిట్టపల్లి సురేశ్ గుప్తా ముందుకు వచ్చారు. పదేళ్లుగా మట్టి విగ్రహాలపై ప్రజలను చైతన్యం చేస్తున్న గుప్తా.. 2, 3, 5, 7 ఫీట్ల ఎత్తు విగ్రహాలను అందుబాటులో ఉంచారు. తాను కొనుగోలు ధరకే విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులకు ప్రోత్సాహక బహుమతిగా చిరుధాన్యాలు, చేనేత వస్ర్తాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు గుప్తా తెలిపారు.
మట్టి విగ్రహాలను సిద్ధం చేశాం..
ఐదేండ్లుగా మట్టి విగ్రహాలను తయారు చేసి అమ్ముతున్నాం. కొంత మంది ముందుగానే ఆర్డర్ ఇచ్చి 100 నుంచి 500 వరకు తయారు చేయించుకుంటారు. మట్టి గతంలో ఉచితంగా దొరికేది. కానీ, ఇప్పుడు అది కొంటున్నం. పోయినేడాది కరోనా టైంలో చాలా మంది మా దగ్గరికి వచ్చి మట్టి విగ్రహాలు కొనుక్కున్నరు.
మట్టి విగ్రహాలనే పూజిద్దాం…
పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలనే పూజిద్దాం. ఇండ్లల్లో, వీధుల్లో మట్టి విగ్రహాలనే పూజించాలని కొద్ది రోజులుగా మా కాలనీలో అవగాహన కల్పిస్తున్నాం. అంతే కాకుండా మా ఇంట్లో కూడా మట్టి విగ్రహాన్నే పూజించి నిమజ్జనం చేస్తాం.
పర్యావరణ హితం శుభపరిణామం…
మట్టి వినాయకులను పూజించడం మంచి సంప్రదాయం. పర్యావరణహితంగా పండుగ జరుపుకొనేందుకు ప్రజలు ముందుకు రావాలి. కొవిడ్ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కొన్ని నిబంధనలు కూడా తప్పనిసరిగా పాటించాలి. ఉత్సవ నిర్వాహకులు పోలీస్ శాఖ సూచనలను తప్పకుండా పాటించాలి. మండపాలను శానిటైజ్ చేయాలి. భక్తులు భౌతికదూరం, మాస్కు ధరించేలా చర్యలు తీసుకోవాలి.