
జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన డిండి దాదాపు 50 ఏండ్ల తర్వాత వరుసగా రెండో ఏడాదీ అలుగు పోస్తున్నది. సోమవారం సాయంత్రానికి నిండు కుండలా మారి తొణికిసలాడిన జలాశయం మంగళవారం మత్తడి దూకింది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా డిండి పరీవాహక ప్రాంతంలోని చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు సమృద్ధిగా ఉండడం, భారీ వర్షాలు కురువడంతో ప్రాజెక్టు పూర్వవైభవాన్ని సంతరించుకున్నది. పర్యాటకులు పెద్దసంఖ్యలో వచ్చి ప్రాజెక్టు అందాలను చూసి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.
డిండి, సెప్టెంబర్ 7 : భారీ వర్షాలతో నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని జలశయాలన్నీ నిండుగా దర్శనమిస్తున్నాయి. చెరువులు, కుంటలు అలుగు పారుతున్నారు. 50 ఏండ్ల తర్వాత డిండి ప్రాజెక్టు వరుసగా రెండోసారి అలుగు పోస్తున్నది. నైజాం కాలంలో 1940-43లో డిండి ప్రాజెక్టు నిర్మించారు. 1971వరకు డిండి ఆయకట్టులో యేటా రెండు పంటలు సాగయ్యేది. 1972లో వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయింది. క్రమంగా నీటి లభ్యతా తగ్గిపోయింది. అధిక వర్షాలు కురిసినప్పుడు ప్రాజెక్టు నిండుతున్నది.
కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తితో..
తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులను వేగంగా పూర్తి చేయడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 36 అడుగులు (2.41టీఎంసీలు). ప్రాజెక్టులోకి మంగళవారం 2500క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా అంతే ఔట్‌ఫ్లో వెళ్తున్నది.
కొనసాగుతున్న మూసీ నీటి విడుదల
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు ఆరు గేట్ల ద్వారా మంగళవారం దిగువకు నీటిని వదిలారు. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 10,269.72 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. గేట్ల ద్వారా 10,039.36 క్యూసెక్కులు వదులుతున్నారు. కాల్వలకు 136.34 క్యూసెక్కులు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 640.5అడుగులు (3.33 టీఎంసీలు)గా ఉన్నట్లు ఏఈ తెలిపారు.