
ఆటోలకు క్యూఆర్ కోడ్ : ఎస్పీ రంగనాథ్
నీలగిరి : మహిళల భద్రతతోపాటు ఆటో డ్రైవర్లలో మరింత బాధ్యత పెంచడమే లక్ష్యంగా జిల్లాలోని అటోలకు క్యూఆర్ కోడ్ కలిగిన స్టిక్కరింగ్ చేస్తున్నట్లు నల్లగొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు. మంగళవారం ట్రాఫిక్ సీఐ చీర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ వద్ద ఆటోలకు క్యూ ఆర్ కోడింగ్, సేఫ్ ఆటో ట్యాక్సీ.కామ్ ద్వారా ఆటోలకు నంబరింగ్ కార్యక్రమాన్ని ఏఎస్పీ నర్మదతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ ద్వారా ఆటోల్లో ప్రయాణించే వారు ఆ కోడ్ స్కాన్ చేసి సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. దీంతో పాటు అత్యవసర పరిస్థితిలో మేసేజ్, కాల్ చేసే సదుపాయం కల్పించినట్లు చెప్పారు. ఈ క్యూఆర్ కోడ్‌ను పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసినట్లు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు, యజమానులు మరింత బాధ్యతగా వ్యవహరిస్తూ మహిళను, తమ ఆటోలో ఎక్కే ప్రయాణికులను గౌరవిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని, మహిళా భద్రతకు పోలీసుశాఖ తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, ట్రాఫిక్ సిబ్బంది తూడి సుధాకర్, వేముల మహేందర్, వెంకటేశ్వర్లు, కృష్ణ, వెంకన్న పాల్గొన్నారు.