
పండుగకు ఆడబిడ్డలంతా సిద్ధమయ్యారు. ఎంగిలిపూల బతుకమ్మతో తొమ్మిది రోజుల వైభవానికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇల్లూ, వాకిళ్లు పూల
లోగిళ్లుగా మార్చి ఊరూవాడ బతుకమ్మ పాటలు హోరెత్తించనున్నారు. బుధవారం నుంచి దసరా సెలవులు ఉండడంతో విద్యాసంస్థల్లో ఒక రోజు ముందే సంబురాలను ప్రారంభించారు. ఆడబిడ్డలందరూ బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోవాలంటూ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.సందడి చేసిన విద్యార్థినులు బతుకమ్మ పండుగ సందర్భంగా విద్యాలయాల్లో మంగళవారం సందడి నెలకొన్నది. సెలవుల నేపథ్యంలో ఒక రోజు ముందుగానే తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి ఆనందోత్సాహాలతో సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఉయ్యాల పాటలతో పాఠశాలలు మార్మోగాయి. ఉపాధ్యాయినులు సైతం వేడుకల్లో సంతోషంగా పాల్గొన్నారు.
ఆడబిడ్డలకు తోబుట్టువుగా సీఎం కేసీఆర్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ చక్కటి నిర్వచనం. యావత్ ప్రపంచంలోనే పూలను పూజించి, మానవీయమైన పద్ధతిలో జరుపుకొనే అతి గొప్ప పండుగ బతుకమ్మ. ప్రకృతిని కొలిచే పండుగకు అధికారికంగా బట్టలు పెట్టవచ్చు అనే సరికొత్త సంప్రదాయానికి తెర తీసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు తోబుట్టువుగా మారారు. తంగేడు పువ్వును అధికారిక పుష్పంగానూ గుర్తించారు. బతుకమ్మ పండుగ జరుపుకొంటున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు.