
రామగిరి, సెప్టెంబర్ 5 : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి అవార్డులు అందించింది. ఇం దులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అవార్డులు అందించారు. అవార్డులు అందుకున్న వారిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి. ధర్మానాయక్, కేపీఎం ప్రభుత్వ జానియర్ కళాశాల జువాలజీ అధ్యాపకుడు సింగం శ్రీనివాస్, డిండి ప్రభుత్వ జూనియర్ కళాశాల గణిత అధ్యాపకుడు సుధీర్‌కుమార్, వలిగొండలోని ఎస్వీ ప్రభుత్వ జూనియర్ కళాశాల జువాలజీ లెక్చరర్ వై. విక్రంబాబు అందుకున్నారు. తిరుమలగిరి సాగర్ మండలానికి చెందిన ఉపాధ్యాయుడు కె. సైదయ్య ఉన్నారు.
అవార్డు అందుకున్న రాజిరెడ్డి
చౌటుప్పల్ : మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారం గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రేగట్టి రాజిరెడ్డి ఆదివారం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు.
కూచిపూడి విద్యార్థినులకు
యాదాద్రి : గురుపూజ దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో యాదాద్రి కూచిపూడి నృత్య కళాశాలకు చెందిన విద్యార్థినులు నృత్య ప్రదర్శన చేశారు. అనంతరం విద్యార్థినులను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితాఇంద్రారెడ్డి శాలువతో సన్మానించారు. సన్మానం పొందిన వారిలో మిర్యాల నిఖిల, లింగాల ప్రనూతి, గుండ్లపల్లి అశ్విని, సిరివల్లి, బృం ద, రుతిక, నిహారిక, మాస్టర్ రమేశ్ రాజా ఉన్నారు.