
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 2(నమస్తే తెలంగాణ)/దేవరకొండ : ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. నాగార్జునసాగర్ ద్వారా నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలకు సాగునీరు అందుబాటులో ఉన్నది. రాష్ట్రం వచ్చాక కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పీకి గోదావరి జలాలను తీసుకువచ్చారు. దాంతో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలు సస్యశ్యామలం అయ్యాయి. మరోవైపు భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల కోసం బస్వాపురం, గంధమళ్ల రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారు. నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల కోసం ఇప్పటికే ఉన్న ఏఎంఆర్పీని శాశ్వతపర్చడం కోసం ఎస్ఎల్బీసీ సొరంగమార్గం, తద్వారా పానగల్ ఉదయసముద్రం పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇదే సమయంలో సమైక్య రాష్ట్రంలో ఎలాంటి ప్రాజెక్టుల ప్రస్తావన కూడా లేని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అధ్యయనాల అనంతరం డిండి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా దీన్ని చేపట్టాలని నిర్ణయించారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలో పలుచోట్ల రిజర్వాయర్లు నిర్మించడం ద్వారా నీటిని నిల్వ చేసి ఆయా ప్రాంతాల్లోని భౌగోళిక పరిస్థితులను బట్టి కాల్వల ద్వారా సాగునీరు అందించాలన్నది లక్ష్యం. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రత్యేకంగా సమీక్ష కూడా చేపట్టారు. అవసరాలకు అనుగుణంగా నిధులను విడుదల చేస్తూ పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా దేవరకొండ నియోజకవర్గం పరిధిలో నాలుగు కొత్త రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతున్నది. గతంలో ఈ నియోజకవర్గానికి డిండి రిజర్వాయర్ మాత్రమే 1.075టీఎంసీల సామర్థ్యంతో అందుబాటులో ఉన్నది. కానీ ప్రస్తుత రిజర్వాయర్లన్నీ పూర్తయితే రాష్ట్రంలోనే అత్యధిక రిజర్వాయర్లున్న నియోజకవర్గంగా దేవరకొండ మారనున్నది. అదేవిధంగా పూర్తి ఫ్లోరైడ్ ప్రాంతంగా పేరు పడ్డ మునుగోడు నియోజకవర్గంలో శివన్నగూడెం రిజర్వాయర్ పనులు కొనసాగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే సాగు, తాగునీటికి ఢోకా ఉండదు. ఇప్పటికే రిజర్వాయర్ల నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు 80శాతం పూర్తిచేశారు. గొట్టిముక్కల రిజార్వాయర్ ముంపు బాధితుల్లో 110 మందికి చింతపల్లి మండలంలోని సాయిబాబా ఆలయం సమీపంలో 240 గజాల చొప్పున ఇంటి స్థలం కేటాయించారు. ఇండ్లు నిర్మించుకునేందుకు ఒక్కొక్కరికి రూ.7.61 లక్షలు అందించనున్నారు.
శివన్నగూడెం రిజర్వాయర్…
డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులో అతి పెద్దది శివన్నగూడెం రిజర్వాయర్. మర్రిగూడెం మండలం చర్లగూడెం వద్ద నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్‌ను రెండు గుట్టలను అనుసంధానం చేస్తూ భారీ కట్ట నిర్మాణం చేపట్టారు. 11.968 టీఎంసీల సామర్థ్యంతో అతి వెడల్పైన రాతి, మట్టి కట్ట నిర్మాణం దాదాపు 60శాతం పూర్తైంది. మిగతా పనులు కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా గేట్లు నిర్మించే రివిట్మెంట్ స్థలంలోని బండ్ నిర్మాణం కూడా 40శాతం పూర్తికావచ్చింది. ఈ ప్రాజెక్టు పరిధిలో నిర్వాసితులకు 90శాతం మందికి పరిహారం చెల్లింపులు పూర్తి చేశారు. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వతంగా చెక్ పడనుంది.
గొట్టిముక్కల రిజర్వాయర్..
దేవరకొండ మండలంలోని గొట్టిముక్కల గ్రామ పరిధిలో 1.075 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నదే గొట్టిముక్కల రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ పనులు కూడా వేగంగా పూర్తి కావస్తున్నాయి. ప్రాజెక్టు అధికారులు చెప్పిన ప్రకారం 90 శాతం పనులు పూర్తయినట్లే. బండ్ పనులు పూర్తి చేసి ఐదు ప్రధాన గేట్లు బిగించారు. ఇందులోకి నాగర్‌కర్నూల్ జిల్లా ఇర్విన్ రిజర్వాయర్ నుంచి సమారు 15 కిలోమీటర్ల కెనాల్ ద్వారా నీరు చేరనుంది. దీని కింద సుమారు 10,500 ఎకరాల ఆయకట్టును ఇంజినీర్లు ప్రతిపాదించారు. మండలంలోని సుమారు 39 గ్రామాలకు సాగునీరు అందుతుంది. సమీపంలోని కొండభీమనపల్లి ప్రాజెక్టులోకి నీటిని తరలించనున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు కింద ఇప్పటికే సాగవుతున్న 4వేల ఎకరాలు ఆయకట్టు సుస్థిరం కానుంది.
చింతపల్లి రిజర్వాయర్…
చింతపల్లి మండలంలో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ ద్వారా సుమారు 6,500 ఎకరాల భూములకు కొత్తగా నీరు అందనుంది. ఇక్కడ 0.86 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. ప్రధాన కట్ట పనులతో పాటు రాతికట్టడం పనులు కొనసాగుతున్నాయి. దీనికి ఇర్విన్ నుంచి మెయిన్ కెనాల్ ద్వారా వరద చేరనుంది.
సింగరాజ్‌పల్లి రిజర్వాయర్…
డిండి మండలంలోని 0.056 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న సింగరాజ్‌పల్లి రిజర్వాయర్ పనులు 90 శాతం పూర్తికావచ్చాయి. గేట్లు బిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బండ్ రివిట్మెంట్ పనులు కూడా 80 శాతం పూర్తయ్యాయి. ఈ రిజర్వాయర్‌కు జూపల్లి సమీపంలోని ప్రధాన కాల్వ నుంచి 7 కిలో మీటర్ల ఓపెన్ కెనాల్ ద్వారా నీటిని తరలిస్తారు. ఇది అందుబాటులోకి వస్తే 6,500 ఎకరాలకు సాగునీరు అందనున్నది. రిజర్వాయర్‌లో నీటి నిల్వ ద్వారా సమీప గ్రామాల్లో భూగర్భ జలాలు పెరుగనున్నాయి.
కిష్టరాంపల్లి రిజర్వాయర్
చింతపల్లి మండలంలోని కిష్టరాంపల్లి పరిధిలో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ ద్వారా పలు మండలాల పరిధిలోని భూములకు సాగునీరు అందనుంది. 5.68 టీఎంసీల సామర్థ్యం కల్గిన ఈ రిజర్వాయర్ నుంచి సుమారు లక్ష ఎకరాలకు నీరందించాలన్నదే ప్రధాన లక్ష్యం. ఈ రిజర్వాయర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. దేవరకొండ నియోజకవర్గంలోనే అతి పెద్ద రిజర్వాయర్‌గా ఇది నిలువనుంది.
చారిత్రక కట్టడం
దేవరకొండ, అక్టోబర్ 2 : హైదరాబాద్‌లోని స్లేట్ ది స్కూల్ విద్యార్థులు శనివారం దేవరకొండ ఖిలాను సందర్శించారు. సుమారు 700 మంది విద్యార్థులు ఉదయం ఖిల్లాకు చేరుకొని కొండపైన ఆలంయం, కొనేరు, పురాతన కట్టడాలను తిలకించారు.
పర్యాటక సాగరం
నందికొండ, అక్టోబర్ 2 : నాగార్జునసాగర్‌లో శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. టూరిజం శాఖ లాంచీల్లో జాలీ ట్రిప్పులకు వెళ్లేందుకు పర్యాటకులు ఉత్సాహం కనబరిచారు. నదీతీరంలో సెల్ఫీలు తీసుకుంటూ ఆనందంగా గడిపారు.