
సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 2 : కండ్లు కనిపిస్తలేవు. బీపీ, షుగర్ ఉంది. మందులు అయిపోయినయి సారూ. నెల సంది పింఛన్ వస్తలేదు. ఎట్ల బతకాలి? మా పెద్ద కొడుకు కేసీఆర్ ఇచ్చే పింఛన్ పైసలతోనే బతుకుతున్నాం. పెద్ద సార్లు మేము సచ్చిపోయినట్లు కాగితాల్లో రాశారంట. అందుకే మాకు పింఛన్ వస్తాలేదని ఆఫీసర్లు చేప్తున్నారు. మేము బతికే ఉన్నాం. పింఛన్ పైసలు ఇప్పించండి. ఆరోగ్యం బాగ లేదు. మందులు తెచ్చుకోవాలి.. అంటూ వృద్ధులు ధీనంగా వేడుకుంటున్నారు.
చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు
మండల కేంద్రానికి చెందిన ఉప్పల పాపమ్మ, రమావత్ గొమ్లీ, జక్కిడి ప్రతాప్‌రెడ్డి, జక్కిడి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా అందించే పింఛన్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఏ పని చేసుకోలేని నిససహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు పింఛన్ అందించే ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడు అనుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. వృద్ధులు బతికుండగానే గ్రామపంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారులు చనిపోయినట్లుగా రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో గత నెల నుంచి వృద్ధులకు వచ్చే పింఛన్ రద్దయ్యింది. పింఛన్ పైనే జీవనం సాగిస్తున్న వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల పింఛన్ రాకపోవడంతో వృద్ధులు అధికారులను అడిగితే పింఛన్ దారుల్లో మీ పేరు లేదు అని సమాధానం చెప్పడంతో వృద్ధులు కంగుతిన్నారు. ఏ ఆధారాలతో అధికారులు తాము చనిపోయినట్లుగా రికార్డుల్లో నమోదు చేశారని వృద్ధులు ప్రశ్నిస్తున్నారు. పింఛన్ రాకపోవడంతో తిండికి, మందులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నడవడానికి కూడా చేత కాని పరిస్థితిలో పింఛన్ ఇప్పించాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తమ లాంటి పరిస్థితి ఎవరికీ రావద్దని కోరుకుంటున్నారు.
పింఛన్‌తోనే బతుకుతున్నా
బీపీ, షుగర్ ఉంది. మందులు అయిపోయినయి. పింఛన్ పైసలు వస్తేనే మందులు తెచ్చుకుంటా. ఈ నెల పింఛన్ పైసలు రాలేదు. సచ్చిపోయిన అని రాసి పింఛన్ ఇస్తలేరంట. నేను బతికే ఉన్నా. పింఛన్ ఇప్పించండి సారూ.
-రమావత్ గొమ్లీ, మేళ్లచెర్వుతండా
దండం పెడుతా పింఛన్ ఇప్పించండి
మా ఆయన సచ్చిపోయిన తరువాత నాకు వింతంతు పింఛన్ ఇస్తుండ్రు. 8 ఏండ్లుగా పింఛన్ తీసుకుంటున్నా. ఈ నెల పింఛన్ రాలేదు. అడిగితే ఆఫీసుల నేను సచ్చిపోయిన అని చెప్పిర్రంట. అందుకే పింఛన్ పైసలు ఇయ్యలే. దండం పెడుతా. పింఛన్ ఇప్పించండి సారూ.
-ఉప్పల పాపమ్మ, సంస్థాన్ నారాయణపురం
అధికారుల పై చర్యలు తీసుకోవాలి
బతికి ఉన్న వాళ్లను సచ్చిపోయునట్లు ఎట్లా రాస్తరు. ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నరు. అడిగితే ఎవ్వరరూ పట్టించుకోవడం లేదు. పెద్ద సార్లు కల్పించుకుని తప్పు చేసిన వారిని శిక్షించాలి. పింఛన్ తొందరగా వచ్చేలా చూడాలి.
-రమావత్ సక్రూ, గొమ్లీ కుమారుడు