
సల్లగొండ ప్రతినిథి, సెప్టెంబర్ 30 (నమస్తేతెలంగాణ) : చేనేత వృత్తికి పునరుజ్జీవం కల్పించడంతో ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింప జేయడమే లక్ష్యంగా బతుకమ్మ చీరెల పంపిణీ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేశారు. వస్త్ర పరిశ్రమకు పునరుజ్జీవం కల్పించాలన్నది కూడా ఓ ముఖ్య ఉద్దేశం. ప్రారంభంలో సూరత్, గుజరాత్‌లోని పలు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసినా తర్వాత ప్రభుత్వం అన్నింటినీ రాష్ట్రంలోనే సిరిసిల్ల తదితర ప్రాంతాల్లో తయారు చేయిస్తున్నది. తద్వారా నేతన్నలకు ఏడాదిలో సుమారు ఐదు నెలల పాటు అదనంగా ఉపాధి కల్పించినైట్లెంది. తెల్లరేషన్ కార్డు ఉండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకూ బతుకమ్మ కానుక పేరుతో చీరె అందించడమే ఈ పథకం లక్ష్యం. అందులో భాగంగానే 2017 దసరా నుంచి ఈ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వరుసగా ఐదో ఏడాది కూడా బతుకమ్మ చీరెల పంపిణీకి రంగం సిద్ధమైంది. గత నెల నుంచే జిల్లాలకు చీరెల రాక మొదలైంది. ఈ ఏడాదికి అర్హులైన మహిళా లబ్ధిదారుల సంఖ్యను పౌరసరఫరాల శాఖ ద్వారా సేకరించి, ఆ వివరాలను గతంలోనే జిల్లా చేనేత జౌళి శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రతిపాదనల ప్రకారం చీరెలను తయారు చేయించారు. తయారైన చీరెలను ఎప్పటికప్పుడు జిల్లాలకు చేరవేస్తూ గోదాముల్లో భద్రపరిచారు. ముందస్తుగా ఏర్పాట్లు చేయడం ద్వారా పంపిణీలో ఆటంకాలు లేకుండా చూడాలని ప్రభుత్వం సంబంధిత శాఖలను ఆదేశించింది. దాంతో ఆయా జిల్లాల వారీగా ప్రత్యేకంగా పౌరసరఫరాల శాఖ, చౌనేత జౌళిశాఖ, మార్కెటింగ్, డీఆర్డీఏ శాఖల అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్లు, డీఆర్ఓలు పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. దీని ప్రకారమే చీరెల నిల్వ, గోదాముల గుర్తింపు, అక్కడి నుంచి గ్రామాలకు తరలింపు, గ్రామాల్లో పంపిణీ ఎలా చేపట్టాలి అన్న అంశాలపై ఇప్పటికే క్షేత్రస్థాయి వరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారుల లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లాలో మొత్తం 4,68,179 ఆహారభద్రతా కార్డులు ఉండగా వీటి ప్రకారం బతుకమ్మ చీరెలకు అర్హులైన 5,52,509 మంది మహిళలను గుర్తించారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం 3,91,770 మంది లబ్ధిదారులు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 2,69,126 మంది మహిళలు ఉన్నట్లుగా లెక్కలు తేల్చారు. ఈ ప్రకారమే ఈ చీరెల కోసం ప్రతిపాదనలు పంపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 12,13,405 చీరెలు లబ్ధిదారులకు అందజేయనున్నారు. గతేడాదితో పోలిస్తే 40వేల పైచిలుకు లబ్ధిదారులు అదనంగా నమోదయ్యారు. ఈ సారి పెరిగిన లబ్ధిదారులతో కలిపి అర్హులైన ప్రతి ఒక్కరికీ బతుకమ్మ చీరెలు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
గోదాముల్లో భద్రంగా చీరెలు..
జిల్లాకు చేరిన బతుకమ్మ చీరెలను పకడ్బందీగా భద్రపరిచేందుకు చర్యలు చేపట్టారు. అందుకోసం నియోజకవర్గాల వారీగా గోదాములను గుర్తించి అక్కడికి చీరెలను చేరవేశారు. నల్లగొండ జిల్లాలో తిప్పర్తి మార్కెట్ గోదాం, మిర్యాలగూడ మార్కెట్, దామరచర్ల వ్యవసాయ మార్కెట్ గోదాం, కొండమల్లేపల్లి, నిడమనూర్, చండూరు మార్కెట్ గోదాములతో పాటు నకిరేకల్‌లో రైతువేదికలో చీరెలను భద్రపరిచారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించిన చీరెలన్నింటినీ సూర్యాపేటలోని అంబేద్కర్‌నగర్‌లోని విశాలమైన వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల్లో భద్రపరిచారు. యాదాద్రి జిల్లాలో భువనగిరి మార్కెట్గోదాములో, ఆలేరు ఇండోర్ స్టేడియంలో, మోత్కూర్ చేనేత సొసైటీ గోదాములో, చౌటుప్పల్‌లో మల్కాపూర్ టెక్స్టైల్స్ పార్క్‌లో బతుకమ్మ చీరలను నిల్వ చేశారు. ఈ గోదాముల నుంచి నేరుగా గ్రామాలకు చేరవేస్తున్నారు. నేటి సాయంత్రానికి గ్రామాలకు చేరవేయాలని మండల స్థాయి అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోని చౌకధరల దుకాణాల వారీగా లబ్ధిదారులకు ఈ చీరెలను పంపిణీ చేయనున్నారు.
కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ…
బతుకమ్మ చీరెలను రేపటి నుంచి పంపిణీ చేయనుండగా అందుకోసం ఇప్పటికే మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, తాసీల్దార్, ఎంపీఓలతో మండల కమిటీలను, గ్రామస్థాయిలోనూ పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, వీఆర్ఏ, రేషన్ షాపు డీలర్లను కమిటీలో భాగస్వాములను చేశారు. వీరితో పాటు పట్టణాల్లో వార్డుల వారీగా అర్బన్ బిల్‌కలెక్టర్, రేషన్ డీలర్, వార్డు ఆర్గనైజర్లతో కమిటీలను సిద్ధం చేశారు. రేషన్ షాపుల వారీగా లబ్ధిదారుల జాబితాను కమిటీలకు అందజేస్తే వీరు ఆ జాబితా ప్రకారం పంపిణీ చేయనున్నారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ బతుకమ్మ చీరలను అందజేసేందుకు సర్వం సిద్ధం చేశారు.