
నల్లగొండ సెప్టెంబర్ 30 : నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార యూనియన్(నార్మాక్స్)కు కొత్త చైర్మన్‌గా గంగుల కృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డెయిరీ అభివృద్ధి, పురోగతిని దృష్టిలో పెట్టుకుని సీనియర్ డైరెక్టర్‌గా ఉన్న గంగుల కృష్ణారెడ్డినే చైర్మన్ అభ్యర్థిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఆయన ఆదేశాల మేరకు గురువారం హయత్‌నగర్‌లోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన పాలకవర్గ ప్రత్యేక సమావేశంలో కృష్ణారెడ్డిని బోర్డు సభ్యులు కొత్త చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అనంతరం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టింది. ఈ మొత్తం ప్రక్రియను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించగా.. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇదే సమయంలో 12 ఏండ్లుగా చైర్మన్‌గా కొనసాగిన గుత్తా జితేందర్‌రెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. సంస్థ పురోగతికి నూతన పాలకవర్గం పాటుపడుతుందని నూతన చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి ప్రకటించారు. పాడి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మదర్ డెయిరీకి మరింత వన్నె తెచ్చేలా కృషి చేయాలని నూతన పాలక వర్గానికి మంత్రి జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి నేతృత్వంలో కొత్త పాలకవర్గం, జిల్లా ప్రజాప్రతినిధులు ప్రగతి భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆశ్వీర్వాదం తీసుకున్నారు.
అనుభవానికి ప్రాధాన్యం..
నార్మాక్స్ నూతన చైర్మన్ పదవికి అనుభవానికి ప్రాధాన్యమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్.. సీనియర్ డైరెక్టర్‌గా ఉన్న రామన్నపేట మండలం శోభనాద్రిపురం సొసైటీ చైర్మన్ గుంగుల కృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం 11 గంటలకు హయత్‌నగర్‌లోని సంస్థ కార్యాలయంలో 15 మంది డైరెక్టర్లతో జరిగిన ప్రత్యేక సమావేశంలో చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. కృష్ణారెడ్డిని చైర్మన్‌గా ప్రతిపాదించగా మిగతా సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆది నుంచి జిల్లా నేతలను సమన్వయం చేస్తూ ముందుకు నడిపిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి చైర్మన్ ఎన్నికను స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం జరిగిన ప్రమాణస్వీకార మహోత్సవంలో జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో నూతన పాలకవర్గం, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలంతా ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ నూతన చైర్మన్ గంగుల కృష్ణారెడ్డిని ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, గాదరి కిషోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నార్మాక్స్ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, నంద్యాల దయాకర్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
మదర్ డెయిరీకి మరింత వన్నె తేవాలి : మంత్రి జగదీశ్‌రెడ్డి
మదర్‌డెయిరీకి మరింత వన్నె తెచ్చేలా నూతన పాలకవర్గంతో పాటు సంస్థ ఉద్యోగులు కృషి చేయాలని జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉన్నదని, అందుకు అనుగుణంగానే పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. నార్మాక్స్ నూతన చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, ఇతర సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన పాలకవర్గాన్ని ప్రత్యేకంగా సన్మానించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ సంస్థకు క్షేత్రస్థాయిలోని పాడి రైతే వెన్నెముక లాంటి వాడని, అటువంటి రైతు సంక్షేమానికి కృషి చేయాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉందన్నారు. సంస్థ పురోభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. సంస్థకు సుధీర్ఘ కాలం చైర్మన్‌గా పనిచేసి బాధ్యతల నుంచి తప్పుకుంటున్న గుత్తా జితేందర్‌రెడ్డి సేవలు మర్చిపోలేనివన్నారు. ఆయన అనుభవం, సేవలు మున్ముందు కూడా సంస్థకు ఉండాలని మంత్రి జగదీశ్‌రెడ్డి కోరారు.
జితేందర్‌రెడ్డికి ఘనంగా సన్మానం..
నార్మాక్స్ చైర్మన్ పదవినుంచి వైదొలిగిన గుత్తా జితేందర్‌రెడ్డిని మంత్రి జగదీశ్‌రెడ్డి, పాలకవర్గం సభ్యులు ఘనంగా సన్మానించారు. 12 ఏండ్లుగా ఆయన సేవలు వెలకట్టలేనివని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశంలోనే డెయిరీకి, డెయిరీ ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చానన్నారు. సంస్థ అభివృద్ధి కోసం తన శక్తి మేరకు కృషి చేశానని, ఇక ముందు కూడా తన సహకారం ఉంటుందని చెప్పారు.
డెయిరీ పురోభివృద్ధికి కృషి : కృష్ణారెడ్డి
నార్మాక్స్ సంస్థను మరింత బలోపేతం చేస్తూ డెయిరీ పురోభివృద్ధికి కృషి చేస్తానని నూతన చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన గంగుల కృష్ణారెడ్డి అన్నారు. చైర్మన్‌గా పదవీబాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం ప్రకారం మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో సంస్థను ముందుకు నడిపిస్తానని చెప్పారు. చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, యువనేత కేటీఆర్‌తో పాటు ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.