
కృత్రిమ గర్భధారణపై ప్రత్యేక దృష్టి
సంకర జాతి పశువులతో సత్ఫలితాలు
దేశవాళితో పోలిస్తే అధిక పాల ఉత్పత్తి
కిందటేడు 1.70లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ
ఈసారి ఉమ్మడి జిల్లాలో 2.12లక్షల లక్ష్యం
మన అవసరాలకు సరిపడా పాల ఉత్పత్తే సర్కారు ఉద్దేశం
పశువుల్లో కృత్రిమ గర్భధారణకు నేటి నుంచి స్పెషల్ డ్రైవ్
నల్లగొండ, ఆగస్టు 31 : మేలు జాతి పశువుల సంతతి ద్వారా పాల దిగుబడి పెంచి ప్రతి ఇంటికీ అవసరం మేరకు పాలు అందించాలని సర్కారు యోచిస్తున్నది. ఈ నేపథ్యంలో జిల్లా పశుగణాభివృద్ధి(డీఎల్‌డీఏ) ద్వారా ప్రభుత్వం పశువులకు కృత్రిమ గర్భధారణ చేసి దేశవాలీ ఆవుల ద్వారా సంకరజాతి రకం పశువుల పెంపుపై దృష్టి సారించింది. దేశవాలీ కంటే సంకరజాతి పశువుల ద్వారానే పాల ఉత్పత్తి గణనీయంగా ఉండటంతో ఈ సంకరజాతి వైపు మొగ్గు చూపి ఆ దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే జిల్లాలో డీఎల్‌డీఏ ద్వారా ఉమ్మడి జిల్లాలో ప్రతి ఏటా సంకరజాతి పశువులు, బర్రెల పెంపుకోసం ప్రత్యేక నిధులతో సంబంధిత సిబ్బంది ఆర్టిఫీషియల్ ఇన్సెమ్యునేషన్ (కృత్రిమ గర్భధారణ) చేపట్టింది. ముందటేడు ఉమ్మడి జిల్లాలో 75వేల పశువులకు ఏఐ చేయగా, గతేడాది 1.79 లక్షలకు చేశారు. ఈ ఏడాది 2.12లక్షల పశువుల పశువులకు లక్ష్యం నిర్దేశించిన సర్కార్, బుధవారం నుంచి వచ్చే ఏడాది మే 22వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించింది. అయితే ఉమ్మడి జిల్లాలో 14లక్షల పశువులు ఉండగా, అందులో 5.58లక్షల పశువులు పాలిస్తున్నాయి. వాటి ద్వారా రెగ్యులర్‌గా సుమారు 22లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి.
రెండేండ్లుగా పెరుగుతున్న సంకర జాతి పశువులు
రెండు దశాబ్దాల క్రితం మన దగ్గర ఇంటింటికీ దేశవాలీ పశువులే ఉండేవి. కాలానుగుణంగా వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగడంతో వాటి అవసరం తగ్గినప్పటికీ పాల అవసరం మాత్రం క్రమంగా పెరుగుతున్నది. దీంతో మళ్లీ పశువుల పెంపకంపై పాడి రైతులు దృష్టి సారించి దేశవాలీ పశువుల(ఆవులు, బర్రెలు) ద్వారా పాల దిగుబడి తక్కువగా వస్తుండటంతో హర్యానా, ముర్రా, ఒంగోలు, జర్సీ లాంటి పశువులపై దృష్టి సారించారు. అయితే ఇక్కడి వాతావరణానికి అవి తట్టుకోలేని పరిస్థితితో వాటి సెమన్ (వీర్యం)ను మన ఆవులు, బర్రెలకు ఎక్కించి దూడలకు జన్మనిచ్చేలా సర్కారు ఏర్పాట్లు చేసింది. అంతేకాక దీనిపై ప్రత్యేక దృష్టి సారించి డీఎల్‌డీఏకు ప్రతి ఏటా టార్గెట్లు ఇవ్వడంతో జిల్లాలో ఈ ఆర్టిఫీషియల్ ఇన్సెమ్యునేషన్ పెరిగి సంకరజాతి పశువుల ఉత్పత్తి పెరిగింది. అయితే ఈ పద్ధతి ద్వారా ముందటేడు 79వేల పశువులకు కృత్రిమ గర్భధారణ చేయగా 23వేల మేలు రకం దూడలు పుట్టాయి. గతేడాది 1.79లక్షల పశువులకు చేస్తే 1.11లక్షల దూడలు పుట్టడంతో ప్రభుత్వం 2.12లక్షల కృత్రిమ గర్భధారణల టార్గెట్ విధించింది.
36 లక్షల లీటర్ల పాలు అవసరం
ఉమ్మడి జిల్లాలో 36లక్షల కుటుంబాలు ఉన్నట్లు సమగ్ర సర్వే ఇచ్చిన నివేదిక. అయితే ప్రతి కుటుంబానికీ పాలు అవసరమే. పేద, మధ్యతరగతి వారు మినహాయిస్తే మిగిలిన వారి ఇండ్లల్లో పాల వినియోగం బాగా ఉంటుంది. ప్రతి మనిషి ఆరోగ్య రీత్యా రెగ్యులర్‌గా కనీసం 275మి.లీటర్ల పాలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. దీన్ని బట్టి రాష్ట్రంలో, జిల్లాలో పాల దిగుబడి పెరుగాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో 14,05,588 తెల్ల, నల్ల పశువులు ఉండగా, వాటిలో 5.58లక్షల పశువులు సగటున నాలుగు లీటర్ల చొప్పున పాలు ఇస్తుండటంతో సుమారు 22.34 లక్షల లీటర్ల పాలు దిగుబడి అవుతున్నాయి. ఇందులో డెయిరీలకు పోగా 15లక్షల లీటర్ల దాకా మిగిలి ఉన్నట్లు పశు సంవర్ధక శాఖ అంచనా. జిల్లాలో 36లక్షల కుటుంబాలు ఉన్నందున ఇంటికి సగుటున లీటర్ చొప్పున అంచనా వేసినప్పటికీ 36లక్షల లీటర్ల పాలు అవసరం. ఈ నేపథ్యంలో పలు కంపెనీల నుంచి 20లక్షల లీటర్ల మేర దిగుమతి చేసుకుంటున్నాం. దీని నుంచి బయటపడాలంటే పాల దిగుబడి పెంచాల్సి ఉన్నది. అందుకోసం కృత్రిమ గర్భధారణ ద్వారా సంకర జాతికి చెందిన పశువుల ఉత్పత్తి పెరిగేలా డీఎల్‌డీఏ ద్వారా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.
నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్..
ఇప్పటికే వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యమిస్తున్న సర్కారు, దాని అనుబంధ రంగమైన పాడికి చేయూతనిచ్చేందుకు మేలు జాతి పశువుల ఉత్పత్తిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే జాతీయ ఉచిత కృత్రిమ గర్భధారణ పథకం కింద ఉచితంగా బుధవారం నుంచి వచ్చే ఏడాది మే 22వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. సాధారణ సమయంలోనూ ఈ కృత్రిమ గర్భధారణ జరుగుతున్నప్పటికీ గోపాలమిత్రలు నామినల్‌గా ప్రతి రైతు నుంచి రూ.140 వసూలు చేస్తారు. అయితే ఈ స్పెషల్ డ్రైవ్‌లో మాత్రం ఉచితంగా చేస్తారు. 2019-20లో 59వేల పశువులకు కృత్రిమ గర్భధారణ చేయగా 23వేల దూడలు, 2020-21లో 1.79లక్షల పశువులకు చేయగా 1.11లక్షల దూడలు పుట్టాయి. ఈసారి ఆ లక్ష్యాన్ని 2.12 లక్షలకు పెంచారు. సూర్యాపేటలో 79,005 పశువులకు , నల్లగొండలో 71,317 పశువులకు, యాదాద్రి భువనగిరిలో 62,011 పశువులకు కృత్రిమ గర్భధారణ చేయాలని ప్రభుత్వం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థకు లక్ష్యాన్ని విధించింది. మే, 2022 నాటికి జిల్లాలోని 291మంది గోపాలమిత్రలు, 44మంది మైత్రిల ద్వారా ఈ లక్ష్యాన్ని పూర్తిచేయాల్సి ఉంది.
పాల ఉత్పత్తి పెంచేందుకే కృత్రిమ గర్భధారణ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాల ఉత్పత్తి పెంచి ఇక్కడి అవసరాలు తీర్చి అవసరమైతే ఎగుమతి చేసి పాడి రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం చేపడుతున్నాం. ఇందుకు అవసరమైన ఆర్టిఫీషియల్ సెమన్ (వీర్యం) అందుబాటులో ఉంచాం. వచ్చే మే నాటికి లక్ష్యాన్ని పూర్తి చేసి మేలు జాతి పశువుల సంతతి పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
-మోతె పిచ్చిరెడ్డి, పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా