
ఆగస్టులో సాధారణానికి మించి వర్షపాతం
జూన్, జూలైలోనూ 50 శాతం అధికం
నిండుకుండలా చెరువులు
సూర్యాపేటలో మంగళవారం 15మి.మీ. వాన
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ఈ వానకాలం సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ప్రతి నెలలోనూ అధిక వర్షపాతం నమోదైంది. వరుసగా జూన్, జూలై, ఆగస్టులో సాధారణానికి మించి వాన పడడంతో చెరువులు, కుంటలు తొణికిసలాడుతున్నాయి. మంగళవారం కూడా నల్లగొండ జిల్లాలో 18.5మిల్లీ మీటర్లు, సూర్యాపేట జిల్లాలో 15మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది.
వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే జూన్, జూలై, ఆగస్టు నెలల్లో అధిక వర్షపాతం నమోదైంది. మూడు నెలల్లోనూ వరుసగా సాధారణానికి మించి వర్షం కురువడంతో చెరువులు, కుంటలకు జలకళ ఉట్టి పడుతున్నది. భూగర్భజలాలు కూడా పెరిగి వరితో పాటు మెట్ట పంటలు పెద్ద ఎత్తున సాగవుతున్నాయి. మంగళవారం నల్లగొండ జిల్లాలో 18.5మిల్లీ మీటర్లు, సూర్యాపేట జిల్లాలో 15మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఆగస్టులోనూ నల్లగొండలో 196.4మిల్లీ మీటర్ల వర్షపాతం (43శాతం అధికం), సూర్యాపేట జిల్లాలో 13శాతం అధిక వర్షపాతం నమోదు కావడం విశేషం.
నల్లగొండ జిల్లాలో ఈ సీజన్ పూర్తిగా ఆశాజనకంగా కొనసాగుతున్నది. ప్రారంభం నుంచే వర్షాలు దంచి కొడుతున్నాయి. సకాలంలో కురుస్తున్న వర్షాలతో పంటల్లో మంచి పెరుగుదల కనిపిస్తున్నది. సీజన్లో ఇప్పటివరకు 49.3శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూన్ 1నుంచి ఆగస్టు చివరి నాటికి 367.8మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 542.2మి.మీ. వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ప్రతి నెలలోనూ సాధారణం కంటే అధికంగా వర్షం పడింది. జూన్ నెల సాధారణ వర్షపాతం 85.2మి.మీ., కాగా 133.7మి.మీ., జూలైలో 145.2మి.మీ.కు గాను 219.1మి.మీ., ఆగస్టులో 137.3మి.మీకు గాను 196.4మి.మీ. వర్షం కురిసింది. గతేడాదితో పోలిస్తే మూడు నెలల్లోనూ అధిక వర్షపాతం నమోదైంది.
నల్లగొండ జిల్లాలో 18.5మి.మీ., సూర్యాపేటలో 15మి.మీ. వర్షపాతం
నల్లగొండ జిల్లాలో మంగళవారం 18.5మిల్లీ మీటర్లు, సూర్యాపేట జిల్లాలో 15మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్లో అత్యధికంగా ఆ తర్వాత నల్లగొండ, దేవరకొండ డివిజన్లలో వర్ష ప్రభావం ఉన్నది. హాలియాలో అత్యధికంగా 58.4మి.మీ.,
మాడ్గులపల్లిలో 48.8మి.మీ., దామరచర్లలో 44.9మి.మీ., నల్లగొండలో 37.3మి.మీ., మునుగోడులో 26.5మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అన్ని మండలాల్లోనూ వర్ష ప్రభావం కనిపించింది. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా చివ్వెంల మండలంలో 48.6మి.మీ., తర్వాత ఆత్మకూర్(ఎస్)లో 35.5మి.మీ., మట్టంపల్లిలో 34.9మి.మీ., మోతెలో 33.4మి.మీ., పాలకవీడులో 30మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా 3.6మి.మీ. వర్షపాతం మునగాలలో నమోదు కాగా మిగతా అన్నిచోట్ల వర్ష ప్రభావం కనిపించింది. ప్రస్తుత వర్షాలతో మెట్ట పంటలకు మేలు జరగ్గా… ఇకనైనా తెరిపినిస్తేనే కలుపుతీత పనులు, అడుగుమందులు పెట్టే పనులు కొనసాగించవచ్చని రైతులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే అధిక వర్షాలతో పంటలు నీరు చిచ్చు బారిన పడే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేటలో 13 శాతం అధికం
సూర్యాపేట జిల్లాలో జూన్ 1నుంచి 493.9మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 13శాతం అధికంగా 558.7మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో చెరువులు, కుంటలను నింపుతున్నాయి. సాగర్ ఎడమ కాల్వ ద్వారా కృష్ణానది నీళ్లు హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలకు సమృద్ధిగా అందుతున్నాయి. దాంతో పంటల సాగు ఆశాజనకంగా కొనసాగుతున్నది. ప్రస్తుత వర్షాలకు రెండు జిల్లాల్లో సుమారు 800కు పైగా చెరువులు అలుగు పోస్తున్నాయి. ఇంకా మరికొన్ని చెరువులు నిండుకుండలా మారాయి.
మూసీ 5గేట్ల ఎత్తివేత
కేతేపల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నదికి వరద పోటెత్తుతున్నది. ప్రాజెక్టుకు మంగళవారం 13,484 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో 5క్రస్ట్ గేట్లను ఎత్తి 13,919 క్యూసెక్కుల నీటిని దిగువకు
వదిలారు. కుడి, ఎడమ కాల్వలకు 142.02 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. మొత్తంగా 14,155.18 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 642.70(3.88 టీఎంసీలు)
అడుగులు ఉన్నట్లు ఏఈ ఉదయ్ తెలిపారు.
జలకళ
చివ్వెంల, ఆగస్టు 31 : భారీ వర్షాలతో చెరువులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. పంట చేలు నీట మునగడంతోపాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంగళవారం తెరిపినివ్వడంతో పిల్లలు, పెద్దలు, మహిళలు అలుగుల్లో చేపలు పడుతూ కనిపించారు.
నిండు కుండలా..
మునుగోడు : మండల వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. మునుగోడు పెద్ద చెరువు నిండుకుండలా మారింది. మునుగోడు, కొరటికల్, చొల్లేడు వాగులు ఉధృతంగా పారుతున్నాయి.
వరద ఉధృతి
మోతె : మండలంలోని మామిళ్లగూడెం నుంచి విభళాపురం వెళ్లే రోడ్డుపై వరద
ఉధృతి పెరిగి
వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నామవరం పెద్ద చెరువు అలుగు పోయడంతో జాతీయ రహదారిని కలిపే రోడ్డు తెగిపోవడంతో ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ పరిశీలించి భద్రతా చర్యలు చేపట్టారు.
జాలు వాగుకు వరద
త్రిపురారం, ఆగస్టు 31 : త్రిపురారం మండలంలోని మాటూరు గ్రామం వద్ద ఉన్న జాలువాగుకు వరద పెరిగింది. రోడ్డు పైనుంచి నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అడవిదేవులపల్లి మండలంతో పాటు, సుమారు 20గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పంట చేలు నీట మునిగాయి.