కోడేరు, ఆగస్టు 14: మండలకేంద్రంలోని వడ్డెర కాలనీలో జ్వరాలు తగ్గే వరకు వైద్య శిబిరాలు కొనసాగించి సేవలు అందిస్తామని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ వెంకటదాసు పేర్కొన్నారు. కోడేరులోని వడ్డెరకాలనీతోపాటు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వడ్డెర కాలనీతోపాటు పీహెచ్సీలో రెండు వైద్య శిబిరాలు కొనసాగిస్తామన్నారు. అలాగే జ్వరాలను అదుపు చేసేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణతోపాటు రక్త నమూనాలను తీసుకొని పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. జ్వరపీడితులకు మెరుగైన వైద్యం అదించేందుకు అన్నివిధాలా చర్యలు చేపట్టామన్నారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేకించి కోడేరు వడ్డెరకాలనీ రోగులకు ప్రత్యేక వార్డును కేటాయించామన్నారు. కోడేరు పీహెచ్‌సీకి రెగ్యులర్ డాక్టర్ కిరణ్‌ను హైదరాబాద్‌లోని కొవిడ్ దవాఖానకు తీసుకున్నారని కోడేరులో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని వివరించి తిరిగి కోడేరు దవాఖానకు వచ్చేవిధంగా జిల్లా అధికారుల ద్వారా కోరామన్నారు. త్వరలోనే రెగ్యులర్ డాక్టర్ కిరణ్ విధుల్లో ఉంటారని వివరించారు. అంతకుముందు వైద్యశాఖ ఆధ్వర్యంలో కోడేరులో మురుగు ఉన్న ప్రాంతంలో ఆయిల్‌బాల్స్ వదిలి దోమల నివారణకు చర్యలు చేపట్టినట్లు మలేరియా కొల్లాపూర్ యూనిట్ అధికారి రామ్మోహన్ తెలిపారు. శనివారం వైద్యశిబిరంలో 13మంది సాధారణ రోగులకు డాక్టర్ నారాయణస్వామి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఒకరికి జ్వరం ఉండగా చికిత్సలు చేయిస్తున్నామన్నారు. ముగ్గరి రక్తనమూనాలు సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్లు డాక్టర్లు తెలిపారు.