మండల బృహత్ ప్రకృతి వనం పనులు
పరిశీలించిన ఎంపీపీ, ఎంపీడీవో
కొల్లాపూర్, ఆగస్టు 13: మండలంలోని సింగవట్నంలో లక్ష్మీదేవమ్మగుట్టపై సర్వేనంబర్ 127లో ప్రభుత్వ భూమి 10ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన మండల బృహత్ ప్రకృతి వనం పనులు చురుకుగా సాగుతున్నాయి. పనులను ఎంపీపీ సభావట్ భోజ్యనాయక్, ఎంపీడీవో శేషగిరిశర్మ, ఈజీఎస్ టీఏ, నాగస్వామి, సర్పంచ్ దశరథ్‌నాయక్, సీనియర్ మేట్ దర్వేశ్ శుక్రవారం పరిశీలించారు. ఈజీఎస్ నిధుల కింద రూ.45లక్షలతో పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. కొండపై చెట్లపొదలను రెండు జేసీబీలతో తొలగిస్తూనే రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ బృహత్ ప్రకృతి వనంలో (కొండపై) మూడు రహదారులను నిర్మించేందుకు కొండను జేసీబీలతో తవ్వుతున్నారు. కొండపై పనికిరాని చెట్లు, ముళ్లపొదలను తొలగించి నీడనిచ్చే పెద్దవృక్షాలను ఉంచుతున్నారు. పర్యాటకుల వాహనాలు సైతం కొండపైకి వచ్చేవిధంగా రహదారులను తయారు చేస్తున్నారు. కొండను తవ్విన రోడ్డుపై తేలుతున్న కంకర రాళ్లను కూలీల సహాయంతో తొలగిస్తున్నారు. ఈ రహదారులపై డస్ట్‌తో చదును చేసి వాహనాల రాకపోకలకు అనువుగా నిర్మించనున్నట్లు ఎంపీడీవో శేషగిరిశర్మ తెలిపారు. అలాగే మండలంలో మరో నాలుగు మండల బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు జిల్లా ఉన్నతాధికారులు స్థానిక అధికారులను ఆదేశించారు. దీనికోసం మండలంలో అనువైన గ్రామాల్లో స్థలాల ఎంపిక ప్రక్రియలో అధికారులు నిమగ్నమయ్యారు.