బతుకమ్మ అతిపెద్ద పూల పండుగ. చిన్నారుల నుంచి పెద్దల వరకు చేయిచేయి కలిపి ఆడిపాడే ఉత్సవం. ప్రతి ఏడాది ఆడపడుచులంతా ఆతృతతో ఎదురు చూసే వేడుక. సమైక్య పాలనలో గుర్తింపు కోల్పోయిన పండుగను స్వరాష్ట్రంలో ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నది. ఆడపడుచులకు చీరెలు పంపిణీ చేయడంతో గౌరవం లభించింది. ప్రాముఖ్యత ఉన్న ఈ వేడుక బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. సంప్రదాయబద్ధంగాముస్తాబైన ఆడబిడ్డలు తమకే సొంతమైన పండుగను 9 రోజులపాటు అత్యంత వైభవంగా జరుపు కోనున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ
ఊరూరా ఇక పాటల సందడి మొదలు కానున్నది. వివిధ రకాల పూలను అందంగా పేర్చి బతుకమ్మను తయారు చేసి పండుగను వైభవంగా నిర్వహించుకు నేందుకు మహిళలు సిద్ధమయ్యారు.
నాగర్కర్నూల్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ)/వనపర్తి టౌన్ : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఊ రూరా పాటల సందడి మొదలు కానున్నది. ప్రతి ఏడాది ఆడపడుచులంతా ఆతృతతో ఎదురుచూసే బతుకమ్మ పండుగ బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. సమైక్య పాలనలో ప్రాభవం కోల్పోయిన పండుగకు సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో గుర్తింపు తీసుకొచ్చారు. పల్లెలు, పట్టణాల్లో అధికారికంగా నిర్వహిస్తుండడం విశేషం. తెలంగాణ ఉద్యమంలో ఆడపడుచులంతా బతుకమ్మ బోనాలతో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో భాగమయ్యారు. ప్రతి ఉద్యమంలోనూ ఈ పండుగ ప్రత్యేకంగా నిలిచింది.
బతుకమ్మ చారిత్రక నేపథ్యం..
బతుకమ్మ పండుగకు చారిత్రక నేపథ్యం ఉన్నది. దాదాపు వేయి సంవత్సరాల కిందట తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రకూటులు, చోళులకు జరిగిన యు ద్ధంలో వేములవాడలోని శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరులోని బృహదీశ్వరానికి తరలించారు. ఈ క్రమంలో ప్రజల మనస్సు కలచి వేసింది. దీంతో తమ దుఃఖాన్ని తెలియజేసేందుకు మెరూ పర్వతంలా పూలను పేల్చి బతుకమ్మ పండుగను నిర్వహించడం మొదలుపెట్టారు. ఇలా బృహదీశ్వర పేరు నుంచి ఈ పండుగను జరుపుకొంటున్నారు. శివుడు లేని పార్వతి గురించి పాటల రూపంలో పాడుతూ ఆడపడుచులు తొమ్మిది రోజులపాటు సంబురాలు చేసుకుంటూ వచ్చారు.
కాగా, బతుకమ్మ పండుగకు ఇంకో చరిత్ర కూడా ఉన్నది. రాజైన ధర్మాంగుడు, సత్యవతి దంపతులు యుద్ధంలో సర్వం కోల్పోతారు. ఆ బాధలో అడవిలోకి వెళ్లి లక్ష్మీదేవిని పూజించి తనకు కూతురుగా పుట్టాలని వే డుకుంటారు. అనుగ్రహించిన లక్ష్మీమాత వారికి కూతురుగా జన్మిస్తుంది. ఆయురారోగ్యాలతో చల్లగా బతుకమ్మా అని మునీశ్వరులు దీవిస్తారు. రాజు తన కూతురికి బతుకమ్మ అని పేరు పెడతారు. ఇలా లక్ష్మీదేవి పుట్టడంతో ధర్మాంగుడికి రాజ్యం, ఐష్టెశ్వర్యాలు తిరిగి లభిస్తాయి. కూతురుకు పెండ్లి చేసి పూలతో అలంకరించి మెట్టినింటికి పంపుతారు. అప్పటి నుంచి బతు కమ్మ పండుగ జరుపుకొంటున్నట్లు పురాణ గాథ చెబుతున్నది.
ఇలా చారిత్రక, పురాణ నేపథ్యాలున్న ఈ పండుగ సమైక్య పాలనలో ని రాదరణకు గురైంది. తెలంగాణ సంప్రదాయాలకు మూలమైన ఈ పండుగను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ గుర్తింపు తీసుకొచ్చారు. తెలంగాణ వచ్చిన తరువాత 2014 నుంచి అధికారికంగా ఉత్సవాలు చేపడుతుండడం గమనార్హం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం పండుగ సందర్భంగా ఆడపడుచులందరికీ సర్కార్ సారెగా తీరొక్క రంగుల చీరెలను పంపిణీ చేస్తున్నది.
తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు..
బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ. గ్రామాల్లో తెల్లవారుజామునే పూలను సేకరించడం పెద్ద వేడుక. తంగేడు, గునుగు, బంతిపూలు, చామంతి, బొడ్డుమల్లె, గన్నేరు, టేకు పూలు ఇలా ఎన్నో రకాల పూలతో బతుకమ్మను అందంగా పేరుస్తారు. ఎన్ని రకాల పూ లు ఉన్నా తంగేడు పూలకే ప్రాధాన్యం. పసుపు వర్ణంలో బంగారు లా మెరిసిపోతుంటాయి. పసుపు ఐదోతనానికి సంకేతం. తూర్పు, ఉత్తర దిశకు అభిముఖంగా కూర్చొని బతుకమ్మను అమర్చుతారు. రంగురంగుల పూలతో త్రికోణ ఆకారంలో బతుకమ్మను పేర్చి స్త్రీలు, యువతులు రంగురంగుల వస్ర్తాలు, గాజులు ధరించి బతుకమ్మ చుట్టూ చప్పట్లు కొడుతూ వలయంగా తిరుగుతారు. తొమ్మిది రోజు ల పాటు బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు. ప్రతి రోజూ బతుక మ్మ ఆడిన తరువాత చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై పళ్లెంలో తెచ్చిన నీటితో పడతులు వాయినాలు ఇచ్చి పుచ్చుకొంటారు. తర్వా త ఇంటి నుంచి తీసుకొచ్చిన పెరుగు అన్నం, సత్తుపిండిలను ఇచ్చి పుచ్చుకొని తింటారు. ఇలా ప్రకృతితో మమేకమైన పండుగ బతుక మ్మ. జానపద పాటలతో గౌరీదేవిని కొలిచే పడతుల పండుగ. బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల సూక్ష్మక్రిములు చనిపోయి నీరు శుద్ధి అవుతుంది. గునుగు పువ్వులు జీర్ణకోశాన్ని శుద్ధి చేస్తాయి. ఈ ఏడాది అక్టోబర్ 6న అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతూ 14న నవమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. అక్టోబర్ 15న విజయదశమి పండుగ జరుపుకోనున్నారు. తొమ్మిది రోజుల పాటు ఏ రోజుకారోజు ప్రత్యేకంగా పూజించడం ఈ పండుగ ప్రత్యేకత. ఏ ఉత్సవాలు జరిగినా కొవిడ్ నిబంధనలు అనుసరించాలి. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలి. శానిటేషన్ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి.
ప్రతి రోజూ ప్రత్యేక పూజలు..
ఎంగిలి పూల బతుకమ్మ (అక్టోబర్ 6) : మహా అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పెత్తర అమావాస్యగానూ పిలుస్తారు. ఈ సందర్భంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
అటుకుల బతుకమ్మ (అక్టోబర్ 7) : ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నాడు నిర్వహిస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యంతో అమ్మవారికి పూజలు చేస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ (అక్టోబర్ 8) : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు.
నానే బియ్యం బతుకమ్మ (అక్టోబర్ 9) : నానేసిన బియ్యం, పాలు, బెల్లంతో కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
అట్ల బతుకమ్మ (అక్టోబర్ 10) : అట్లు లేదా దోశ నైవేద్యంగా ఉంటుంది.
అలిగిన బతుకమ్మ (అక్టోబర్ 11) : ఆశ్వయుజ పంచమిన అలిగిన రోజు కావడంతో నైవేద్యం సమర్పించరు. బతుకమ్మ ఆడరు.
వేపకాయల బతుకమ్మ (అక్టోబర్ 12 ) : బియ్యం పిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యం అందిస్తారు.
వెన్నెముద్దల బతుకమ్మ (అక్టోబర్ 13) : నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
సద్దుల బతుకమ్మ (అక్టోబర్ 14) : అశ్వయు జ అష్టమి రోజు జరుపుకొంటారు. ఈ సందర్భం గా దుర్గాష్టమి పూజలు ఉంటాయి. అత్యంత మ నోహరంగా జరుపుకొంటారు. ఐదు రకాల నైవే ద్యం చేస్తారు. పెరుగు అన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వుల అన్నం. తొమ్మిది రోజులు సమర్పించే నైవేద్యాల లో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుము లు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమ లు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.