గ్రామస్థాయిలో మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రభుత్వం ఆరోగ్య ఉప కేంద్రాలను
నిర్వహిస్తున్నది. త్వరలో వీటిని పల్లె దవాఖానలుగా మార్చనున్నది. ఈ క్రమంలో పీహెచ్‌సీలకు అనుబంధంగా పనిచేస్తున్న వీటికి పక్కా భవనాలు నిర్మించేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా ఒక్కో భవనానికి రూ.16 లక్షల చొప్పున నిధులు కేటాయించింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో 178 సబ్‌సెంటర్లకు అధికారులు
ప్రతిపాదనలు పంపారు. కాగా, కొన్ని చోట్ల స్థలసేకరణ జరుగుతున్నది. తొలి విడుతలో 28 భవన నిర్మాణాలకుప్రభుత్వం రూ.4.48 కోట్లు మంజూరు చేసింది. పనులను త్వరగా పూర్తి చేసేలా వైద్యశాఖ పర్యవేక్షిస్తున్నది.
నాగర్‌కర్నూల్, (అక్టోబర్ 4) నమస్తే తెలంగాణ : ప్రజలకు గ్రామస్థాయిలో వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం సబ్సెంటర్లను ఏర్పాటు చేసింది. సమీప పీహెచ్సీ పరిధిలో ఈ సబ్ సెంటర్లు పనిచేస్తాయి. నిర్ధేశించిన రోజుల్లో ఏఎన్ఎంలు ఇక్కడికి వచ్చి ప్రజలకు వైద్యసేవలు, సలహాలు అందజేస్తారు. అయితే చాలావరకు సొంత భవనాలు లేవు. మరికొన్ని సబ్‌సెంటర్లు అద్దె గదుల్లో కొనసాగుతున్నాయి. దీంతో ఇరుకు గదుల్లో వైద్యసేవలు అందించడం సిబ్బందికి, సేవలు పొందడం ప్రజలకు కష్టంగా మారింది. దీన్ని పూర్తిగా తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో భవనానికి రూ.16లక్షల చొప్పున నిధులను మంజూరు చేసింది. త్వరలో గ్రామస్థాయిలో ఈ సబ్సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చబోతున్నది. ఓ వైద్యుడు, ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్లు ఇక్కడ అందుబాటులో ఉంటారు. దీని ద్వారా గ్రామస్థాయిలో పేదలకు ప్రాథమిక చికిత్సతో పాటుగా సకాలంలో సరైన వైద్య చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఇలాంటి సబ్‌సెంటర్లకు పక్కా భవనాల నిర్మాణానికి గానూ నిధులు మంజూరు చేయడంతో త్వరలో నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు. జిల్లా వైద్యశాఖ అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో సబ్‌సెంటర్ల నిర్మాణానికి కావాల్సిన సల సేకరణకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం స్థలాభావ సమస్యలు ఉండడంతో పనుల్లో కాస్త జాప్యం ఏర్పడుతున్నది. దీంతో స్థలాలు లభించిన చోట్ల భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నది.
28 భవనాలకు నిధులు విడుదల
నాగర్‌కర్నూల్ జిల్లాలోనూ 28భవనాలకు నిధులు విడుదలయ్యాయి. ఒక్కో భవనానికి రూ.16లక్షల చొప్పున రూ.4.48కోట్లతో పనులు జరుగనున్నాయి. ఇందులో 7 సబ్ సెంటర్లు ఏజెన్సీ పరిధిలో ఉన్నాయి. ఈ పనులకు గానూ ఇప్పటికే 30శాతం నిధులు సంబంధిత శాఖ ఖాతాలో జమయ్యాయి. దీనివల్ల పనులు జరిగిన వెంటనే బిల్లులు సైతం అందనున్నాయి. జిల్లాలో 26 పీహెచ్‌సీల పరిధిలో 178 సబ్‌సెంటర్లు ఉన్నాయి. ఇందులో బిజినేపల్లి మండలంలో వసంతాపూర్, వెల్గొండ, తిమ్మాజిపేటలో కోడుపర్తి, మర్రికల్, నాగర్‌కర్నూల్‌లో గగ్గలపల్లి, మంతటి, తాడూరు, తెలకపల్లి మండలం కార్వంగ, పెద్దపల్లి, పెద్దూరు, పెద్దకొత్తపల్లి మండలం దేవనితిర్మలాపూర్, కోడేరు మండలం నర్సాయపల్లి, పెంట్లవెల్లిలో మంచాలకట్ట, కొల్లాపూర్ బీ సబ్‌సెంటర్, అచ్చంపేట బీ సబ్‌సెంటర్, ఉప్పునుంతల మండలం సదగోడు, వంగూరు మండలం డిండిచింతపల్లి, చారకొండ మండలం జూపల్లి, కల్వకుర్తి మండలం గుండూరు, ఊర్కొండలో ఊర్కొండపేట, రాంరెడ్డిపల్లి సబ్‌సెంటర్లకు నిధులు వచ్చాయి. ఈ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా వైద్యశాఖ పర్యవేక్షిస్తున్నది. ఇక మిగిలిన ప్రాం తాల్లోనూ స్థలసేకరణ కోసం వైద్యశాఖ కృషి చేస్తున్నది. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సహకారంతో స్థలసేకరణ చేస్తున్నారు. ప్రభుత్వం సబ్ సెంటర్లన్నింటికీ కొత్త భవ
నాల నిర్మాణాలకు సిద్ధంగా ఉండటం గమనార్హం. గ్రామీణ స్థాయిలోనూ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా మెడికల్, నర్సింగ్ కళాశాలలు, డయాగ్నొస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. గ్రామస్థాయిలోనూ మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సబ్సెంటర్లను పటిష్టపరుస్తున్నది.
ఒక్కో సబ్సెంటర్కు రూ.16లక్షలు
ప్రభుత్వం సబ్ సెంటర్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నది. జి ల్లాలో 28 సబ్ సెం టర్లకు ఒక్కో నిర్మాణానికి రూ.16లక్షల చొప్పున రూ.4.48కోట్లు మంజూరు చేసింది. స్థలాభావం, కాంట్రాక్టర్ల వల్ల పనుల్లో కాస్త జాప్యం జరుగుతున్నది. సాధ్యమైనంత త్వరలో పనులన్నింటినీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.