
మెదక్, సెప్టెంబర్ 29 : కరోనా నివారణ టీకా ప్రక్రియ మెదక్ జిల్లాలో వేగంగా సాగుతున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లాలో మూడుసార్లు నిర్వహించిన ఇంటింటి ఆరోగ్య సర్వే ఆధారంగా వైద్య ఆరోగ్య శాఖ వారు తీసుకున్న చర్యలు కరోనా కట్టడికి తోడ్పడ్డాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో కరోనా సెకండ్‌వేవ్ జిల్లాలో ప్రజల ప్రాణాలను అధికంగా బలి తీసుకుంది. గడిచిన ఆగస్టు, ప్రస్తుత సెప్టెంబర్ నెలలో కరోనా తీవ్రత చాలా తగ్గింది. ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
జిల్లాలో 4,56,757 మందికి టీకా..
జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ముందుగా హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తర్వాత మార్చి ఒకటి నుంచి 60 ఏండ్లు పైబడిన వారికి, ఏప్రిల్ ఒకటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి, ఆ తర్వాత 18 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. జిల్లాలో 5.37.220 మందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. ఈ నెల 29 వరకు 3,50,742 మంది మొదటి డోస్ తీసుకోగా, లక్షా 6వేల 15 మంది సెకండ్ డోస్ తీసుకున్నారు.
స్పెషల్ డ్రైవ్‌లో 1,76,253 మందికి వ్యాక్సిన్..
ఈ నెల 16న ప్రారంభించిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో 1,76,253 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఫస్ట్, సెకండ్ డోస్ పూర్తి చేయడానికి మెగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. జిల్లా పరిధిలోని 469 పంచాయతీల్లో 20 పీహెచ్‌సీల్లో ఈ స్పెషల్ డ్రైవ్ ప్రక్రియ కొనసాగుతుంది. అల్లాదుర్గం పీహెచ్సీలో 3615 మందికి, చేగుంట 9615, డి.ధర్మారంలో 15,084 మందికి, గడిపెద్దాపూర్ పీహెచ్సీలో 1660, కౌడిపల్లిలో 14,659, కొల్చారంలో 4736మందికి, మెదక్‌లో 9161, నార్సింగిలో 6185 మందికి, పాపన్నపేటలో 7086, పొడ్చన్‌పల్లిలో 5931, రంగంపేట పీహెచ్సీలో 3961, రెడ్డిపల్లిలో 13,012, రేగోడ్‌లో 4200, సర్ధనలో 14,290, పెద్దశంకరంపేటలో 6632 మందికి, చిన్నశంకరంపేటలో 9535 మంది, శివ్వంపేటలో 10,951, టేక్మాల్ పీహెచ్సీలో 6672, తూప్రాన్ పీహెచ్సీలో 18,954 మంది, వెల్దుర్తిలో 10,310 మందికి టీకా వేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వర్రావు తెలిపారు.